లింగనిర్ధారణ పరీక్షలు..అబార్షన్లు

లింగనిర్ధారణ పరీక్షలు చేయకూడదు. అయినా వరంగల్‌, హనుమకొండ జిల్లాల పరిధిలో కొందరు అక్రమార్కులు యథేచ్ఛగా ఈ పరీక్షలు చేస్తున్నారు.

Published : 30 May 2023 04:15 IST

హనుమకొండలో అమానుషం గుట్టురట్టు
ఇప్పటివరకూ వందకుపైగా భ్రూణహత్యలు
ముఠాను అరెస్టుచేసిన పోలీసులు

వరంగల్‌క్రైం, న్యూస్‌టుడే: లింగనిర్ధారణ పరీక్షలు చేయకూడదు. అయినా వరంగల్‌, హనుమకొండ జిల్లాల పరిధిలో కొందరు అక్రమార్కులు యథేచ్ఛగా ఈ పరీక్షలు చేస్తున్నారు. ఆడపిల్ల వద్దనుకున్న వారికి అబార్షన్లు సైతం చేయిస్తున్నారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లోని మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టి.. ఈ అక్రమాన్ని బట్టబయలు చేశారు. మొత్తం 18 మందిని అరెస్టు చేశారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో సీపీ రంగనాథ్‌ సోమవారం ఈ వివరాలు వెల్లడించారు.

వేముల ప్రవీణ్‌, సంధ్యారాణి దంపతులు హనుమకొండ గోపాలపూర్‌లోని వెంకటేశ్వరకాలనీలో ఇల్లు అద్దెకు తీసుకొని అనధికారికంగా లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. వీరితో పాటు పరీక్షలు, అబార్షన్లకు సహకరించిన డాక్టర్‌ బాల్నె పార్ధు, డాక్టర్‌ మోరం అరవింద, డాక్టర్‌ మోరం శ్రీనివాస్‌మూర్తి, డాక్టర్‌ బాల్నె పూర్ణిమ, వార్ని ప్రదీప్‌రెడ్డి, కైత రాజు, కల్లా అర్జున్‌, ప్రణయ్‌బాబు, కీర్తిమోహన్‌, బాల్నె ఆశాలత, కొంగర రేణుక, భూక్యా అనిల్‌, చెంగెల్లి జగన్‌, గన్నారపు శ్రీలత, బండి నాగరాజు, కాసిరాజు దిలీప్‌లను పోలీసులు అరెస్టు చేశారు. మరికొందరు నిందితులు పరారీలో ఉన్నట్లు సీపీ తెలిపారు.  

బయటపడిందిలా..

వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలోని కొన్ని మండలాల్లో బాలికల సంఖ్య తగ్గుతుండడంతో.. మార్చిలో ఆపరేషన్‌ డెకాయ్‌ పేరిట పోలీసులు, వైద్యశాఖ అధికారులు సంయుక్తంగా నిఘా పెట్టారు. స్థానికంగా లింగనిర్ధారణ పరీక్షలు, ఆడపిల్ల అయితే అబార్షన్లు చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో పథకం ప్రకారం.. ఓ మహిళా కానిస్టేబుల్‌ సాధారణ యువతిలా.. స్థానిక ఆర్‌ఎంపీ వద్దకు వెళ్లి లింగనిర్ధారణ పరీక్ష చేయాలని కోరింది. ఆమెను ఆర్‌ఎంపీ గోపాల్‌పూర్‌లోని స్కానింగ్‌ కేంద్రానికి తీసుకెళ్లాడు. అక్కడ లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించే క్రమంలో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ముఠాలోని ప్రధాన సూత్రధారి వేముల ప్రవీణ్‌కు వైద్యపరమైన అర్హతలు లేవు. స్కానింగ్‌ కేంద్రంలో సాంకేతిక సహాయకుడిగా పనిచేసిన అనుభవంతో గతంలోనూ లింగనిర్ధారణ పరీక్షలు చేయగా హనుమకొండ పోలీసులు అరెస్టు చేశారు. అయినా పద్ధతి మార్చుకోలేదు. సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో భార్య సంధ్యారాణితో కలిసి గోపాల్‌పూర్‌లో రహస్యంగా పోర్టబుల్‌ స్కానర్ల సహాయంతో స్కానింగ్‌ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. స్కానింగ్‌లో ఆడపిల్ల అని తేలితే.. ఆ గర్భం వద్దని తల్లిదండ్రులు కోరుకుంటే.. హనుమకొండలోని లోటస్‌, గాయత్రి ఆసుపత్రులు, నర్సంపేటలోని బాలాజీ మల్టీ ఆసుపత్రులకు పంపించి  గర్భవిచ్ఛిత్తి చేయిస్తున్నాడు. ఇందుకు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు తీసుకొంటున్నాడు. ఇప్పటివరకు ఈ ముఠా వందకుపైగా అబార్షన్లు చేసినట్లు తేలిందని సీపీ తెలిపారు. నిందితుల నుంచి స్కానింగ్‌ యంత్రం, ఇతర వస్తువులు, రూ.73 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని