‘స్టాక్‌ ట్రేడింగ్‌’.. మోసాలు లోడింగ్‌!

‘స్టాక్‌ ట్రేడింగ్‌’లో సహకరిస్తామని నమ్మిస్తూ సైబర్‌ నేరగాళ్లు రూ.కోట్లలో కొల్లగొడుతున్నారు. ఈ మోసగాళ్ల బారినపడి తెలంగాణలో ఈ ఏడాది మొదటి రెండు నెలల్లోనే 213 మంది బాధితులు రూ.27.4 కోట్లు పోగొట్టుకున్నారు.

Updated : 06 May 2024 05:00 IST

సైబర్‌ నేరగాళ్ల మాయాజాలం
రెండు నెలల్లో రూ.27.4 కోట్లు హాంఫట్‌

ఈనాడు, హైదరాబాద్‌: ‘స్టాక్‌ ట్రేడింగ్‌’లో సహకరిస్తామని నమ్మిస్తూ సైబర్‌ నేరగాళ్లు రూ.కోట్లలో కొల్లగొడుతున్నారు. ఈ మోసగాళ్ల బారినపడి తెలంగాణలో ఈ ఏడాది మొదటి రెండు నెలల్లోనే 213 మంది బాధితులు రూ.27.4 కోట్లు పోగొట్టుకున్నారు. గత ఏడాది 627 మంది నుంచి నేరగాళ్లు రూ.3.9 కోట్లు దోచుకున్నారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, చార్టర్డ్‌ ఎకౌంటెంట్లు, ఇతర హైప్రొఫైల్‌ ప్రొఫెషనల్స్‌ను లక్ష్యంగా ఎంచుకుని నేరగాళ్లు ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారు. బాధితులను వాట్సప్‌, టెలిగ్రామ్‌ గ్రూపుల్లో చేర్చుతూ.. అప్పటికే ఆయా గ్రూపుల్లో తమ ముఠా సభ్యులను ఉంచుతున్నారు. ఉచితంగా స్టాక్‌ ట్రేడింగ్‌ మెలకువలు నేర్పిస్తామంటూ ఊదర గొడుతున్నారు. మరోవైపు తాము భారీగా లాభాలు ఆర్జించామని గ్రూపులోని ముఠాసభ్యులు విస్తృతంగా పోస్టింగులు పెడుతూ నకిలీ స్క్రీన్‌షాట్లను షేర్‌ చేస్తున్నారు. నిజమని నమ్మి ఎవరైనా ఆసక్తి చూపితే పెట్టుబడి పెట్టిస్తూ లాభాలు విరివిగా వచ్చినట్లు ఆన్‌లైన్‌ ఖాతాల్లో చూపిస్తున్నారు. ఒకవేళ లాభాల్ని విత్‌డ్రా చేసుకోవాలని చూస్తే మాత్రం పన్నులు చెల్లించాలని చెబుతూ వీలైనంత మొత్తం లాగేస్తున్నారు. బాధితులు ఒత్తిడి పెంచితే గ్రూప్‌లోనుంచి నంబరును తొలగిస్తున్నారు.

హైదరాబాద్‌ వ్యాపారి నుంచి రూ.3.41 కోట్ల లూటీ  

హైదరాబాద్‌ సుచిత్రకు చెందిన ఓ వ్యాపారి (47) వాట్సప్‌కు గత మార్చి 11న ఓ మెసేజ్‌ వచ్చింది. ‘ఇంటర్నేషనల్‌ స్టాక్‌ ట్రేడింగ్‌ ఎకౌంట్‌’ పేరిట ఉన్న గ్రూపులో జాయిన్‌ కావాలనేది దాని సారాంశం. నాలుగేళ్లుగా తాను స్టాక్‌ ట్రేడింగ్‌లో ఉండటంతో ఆ మెసేజ్‌ వచ్చిందని వ్యాపారి భావించారు. అందులో ‘రాజీవ్‌ అంబానీ’ పేరిట ఉన్న ఫోన్‌ నంబర్‌కు మాట్లాడటంతో ‘స్టాక్‌ ట్రేడింగ్‌’లో సలహాలిస్తామని చెప్పారు. ఓ ట్రేడింగ్‌ యాప్‌ పేరిట లింక్‌ను పంపించి వ్యాపారితో డౌన్‌లోడ్‌ చేయించారు. అనంతరం ట్రేడింగ్‌ ఖాతాను తెరిచి డబ్బును ఆ ఖాతాలో జమచేశారు. అవతలి వ్యక్తి సూచన మేరకు మార్చి 18న వ్యాపారి తొలుత రూ.30 లక్షలను రెండు విడతల్లో ఆ ఖాతాలో నుంచి మరోఖాతాకు బదిలీచేశారు. అదేరోజు తొలుత రూ.1,000, మరోసారి రూ.3.87 లక్షలను డీమ్యాట్‌ ఖాతా నుంచి ఉపసంహరించడంతో వ్యాపారి సేవింగ్స్‌ఖాతాలో జమ అయ్యాయి. నమ్మకం కుదరడంతో ఆ రోజు మొదలుకొని ఏప్రిల్‌ 21 వరకు దఫదఫాలుగా రూ.3.41 కోట్లు ఆ వ్యక్తి సూచించిన బ్యాంకుఖాతాల్లోకి వ్యాపారి బదిలీచేశారు. మరోవైపు మార్చి 19న రూ.వెయ్యి, 20న  రూ.50 వేలు, 22న రూ.70 వేలు, 27న రూ.66 వేలు; ఏప్రిల్‌ 2, 12 తేదీల్లో రూ.లక్ష చొప్పున బ్యాంకుఖాతాల ద్వారా వ్యాపారి ఇంటర్నేషనల్‌ స్టాక్‌ ఎకౌంట్‌ యాప్‌లో జమయ్యాయి. అప్పటికి అతని స్టాక్‌ఎకౌంట్‌లో రూ.19 కోట్లు లాభాలొచ్చినట్లు చూపించింది. దీంతో అందులోనుంచి రూ.5 కోట్లను తన బ్యాంకుఖాతాలోకి జమ చేసుకోవాలని వ్యాపారి ప్రయత్నించారు. అయితే అందుకు రూ.1.71 కోట్ల పన్ను కట్టాలని మోసగాళ్లు సూచించారు. తన లాభంలోనుంచి ఉపసంహరించుకోవాలని వ్యాపారి చెబితే అలా కుదరదన్నారు. దీంతో మోసపోయానని గ్రహించిన వ్యాపారి సైబర్‌ సెక్యూరిటీ బ్యూరోలో ఫిర్యాదు చేయడంతో రెండు రోజుల క్రితం ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది.

సైబర్‌ సెక్యూరిటీ నిపుణుల సూచనలు..

  • స్టాక్‌ ట్రేడింగ్‌ నిర్వహించే డీమ్యాట్‌ ఖాతా వివరాలను ఎట్టిపరిస్థితుల్లోనూ అపరిచితులతో పంచుకోవద్దు.
  • స్టాక్‌ ట్రేడింగ్‌లో సలహాలిస్తామంటూ గుర్తు తెలియని యాప్‌ల నుంచి వచ్చే లింక్‌లను క్లిక్‌ చేయొద్దు. మార్కెట్‌ రెగ్యులేటర్‌ సెబీలో రిజిస్టర్‌ అయిన యాప్‌లను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి.
  • ప్రముఖ సంస్థలేవీ వ్యక్తిగత ఖాతాల్లోకి నగదు బదిలీ చేయమని అడగవు. అలా ఎవరైనా అడిగితే మోసంగా అనుమానించి తప్పనిసరిగా వెరిఫై చేయాలి.
  • ఒకవేళ స్టాక్‌ ట్రేడింగ్‌ మోసాలబారిన పడితే వెంటనే 1930కి ఫోన్‌ద్వారా ఫిర్యాదు చేయాలి. స్థానిక పోలీస్‌స్టేషన్‌/సైబర్‌క్రైమ్‌ పోలీస్‌స్టేషన్‌ లేదా  cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని