కన్నవారికి కడుపుకోత

ఆడుకునేందుకు ఉల్లాసంగా వెళ్లిన ఆ చిన్నారులు.. నీటిలో పడి విగత జీవులయ్యారు. ఎప్పుడూ నవ్వుతూ.. చలాకీగా ఉండే ఆ పిల్లలు తిరిగిరాని లోకాలకు వెళ్లి కన్నవారికి కడుపుకోత మిగిల్చారు. ఆదివారం గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లో జరిగిన వేర్వేరు ఘటనల్లో ..

Updated : 23 Aug 2021 06:41 IST

నీటికుంటల్లో పడి ముగ్గురు,  ఉప్పుటేరులో పడి ఇద్దరు  చిన్నారుల మృతి 

మాచర్ల గ్రామీణ, ఈపూరు, సోంపేట, న్యూస్‌టుడే: ఆడుకునేందుకు ఉల్లాసంగా వెళ్లిన ఆ చిన్నారులు.. నీటిలో పడి విగత జీవులయ్యారు. ఎప్పుడూ నవ్వుతూ.. చలాకీగా ఉండే ఆ పిల్లలు తిరిగిరాని లోకాలకు వెళ్లి కన్నవారికి కడుపుకోత మిగిల్చారు. ఆదివారం గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లో జరిగిన వేర్వేరు ఘటనల్లో ఐదుగురు చిన్నారులు మృత్యువాతపడ్డారు. వివరాలు ఇలా..  గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం కొత్తపుల్లారెడ్డిపురం గ్రామానికి చెందిన సోమయ్య కుమారుడు పిల్లి కొండలు (10), లక్ష్మయ్య కుమారుడు పి.శివయ్య (10) నాలుగో తరగతి చదువుతున్నారు. ఆదివారం సెలవు కావడంతో మరో స్నేహితుడు నరసింహతో కలిసి గ్రామ శివారులోని కుంట వద్దకు వెళ్లారు. కొండలు, శివయ్య ఆడుకుంటూ కుంటలోకి దిగి నీటిలో మునిగిపోయారు. నరసింహ గ్రామంలోకి వచ్చి తల్లిదండ్రులకు చెప్పగా వారొచ్చి గాలించి చిన్నారుల మృతదేహాలు బయటికి తీశారు.  

గుంటూరు జిల్లా ఈపూరు మండలం ఊడిజర్ల ఎస్సీ కాలనీకి చెందిన నంబూరి ఎలిషాబాబు (10) క్వారీ గుంతలో పడి మృతి చెందాడు. స్నేహితుడితో కలిసి బహిర్భూమికి వెళ్లి వస్తూ కాలు జారి గుంతలో పడిపోయాడు. ఇటీవల వర్షాలకు అందులో నీరు చేరడంతో ఎలిషాబాబు మునిగిపోయాడు. బాలుడి మిత్రుడు కుటుంబ సభ్యులకు చెప్పగా వారొచ్చి మృతదేహాన్ని వెలికితీశారు.  

శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం సిరిమామిడి గ్రామానికి చెందిన కారాగి హర్చిత్‌(6), దున్న శ్రీశాంత్‌(8) ఉప్పుటేరులో మునిగి చనిపోయారు. ఆదివారం సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి గ్రామ సమీపంలోని ఉప్పుటేరు వద్దకు వెళ్లారు. కుటుంబ సభ్యులు తోటలో ఉండగా పిల్లలు ఒడ్డున ఆడుకుంటూ జారి ఉప్పుటేరులో మునిగిపోయారు. చిన్నారులు కనిపించకపోయేసరికి కుటుంబ సభ్యులు వెతికి చివరికి కాలువలో గుర్తించారు. వెంటనే ఒడ్డుకు తీసి అపస్మారకస్థితిలో ఉన్న వారిని హరిపురం సామాజిక ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చూసి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని