Andhra news: ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షం.. పిడుగుపాటుకు ఇద్దరి మృతి

ఎండ వేడిమికి ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు వరుణుడు కాస్త ఉపశమనం కలిగించాడు. ఏపీలోని పలు జిల్లాల్లో మంగళవారం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.

Updated : 07 May 2024 19:27 IST

అమరావతి: ఎండ వేడిమికి ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు వరుణుడు కాస్త ఉపశమనం కలిగించాడు. ఏపీలోని పలు జిల్లాల్లో మంగళవారం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. పలు చోట్ల పిడుగులు పడి ఇద్దరు మృతి చెందారు. కొన్ని చోట్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రాజమహేంద్రవరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌, వీఎల్‌పురం, శ్యామల సెంటర్‌ ప్రాంతాల్లో భారీగా వరదనీరు చేరింది. గానుగ వీధిలో రెండు చెట్లు నేలకొరిగాయి. మరోవైపు విజయవాడలో ఈదురుగాలులతో చిరుజల్లులు కురిశాయి. గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. అచ్చంపేట, అమరావతి, క్రోసూరు మండలాల్లో మిరప, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. ఏలూరు జిల్లా భీమడోలు మండలంలో ఈదురుగాలుతో భారీ వర్షం కురిసింది. కరెంట్‌ స్తంభాలు నేల కూలి పలు గ్రామాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

మరోవైపు తూర్పు విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. తెలంగాణ, దక్షిణ కర్ణాటక మీదుగా సముద్ర పట్టానికి 1.5 కి.మీ ఎత్తులో ఇది వ్యాపించి ఉన్నట్లు వాతావారణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో మరో రెండు రోజుల పాటు ఏపీలో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. బుధవారం శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, నెల్లూరు, పల్నాడు, బాపట్ల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశముంది. విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అనంతపురం, సత్యసాయి, వైఎస్సార్‌, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయి. మంగళవారం తూర్పుగోదావరి జిల్లా వేమగిరిలో 124 మి.మీ, కోనసీమ జిల్లా  మండపేటలో 120.5, రాజమహేంద్రవరంలో 92 , తాటిపూడిలో 75.5, నూజివీడులో 73.5, మచిలీపట్నంలో 73 , ఆలమూరులో 73 మి.మీ వర్షపాతం నమోదైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు