కటకటాల్లోకి టోనీ

ముంబయి కేంద్రంగా కొకైన్‌ను సరఫరా చేస్తున్న అంతర్జాతీయ డ్రగ్స్‌ స్మగ్లర్‌ టోనీని శుక్రవారం పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. మసాలా దినుసుల ఫ్యాక్టరీ ఎండీ సహా మరో తొమ్మిది మందిని కూడా కారాగారానికి

Published : 22 Jan 2022 05:09 IST

మరికొందరు బడాబాబులు కూడా..

ఈనాడు, హైదరాబాద్‌: ముంబయి కేంద్రంగా కొకైన్‌ను సరఫరా చేస్తున్న అంతర్జాతీయ డ్రగ్స్‌ స్మగ్లర్‌ టోనీని శుక్రవారం పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. మసాలా దినుసుల ఫ్యాక్టరీ ఎండీ సహా మరో తొమ్మిది మందిని కూడా కారాగారానికి పంపించామని పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్‌ నిరంజన్‌రెడ్డి తెలిపారు. యజ్ఞానంద్‌ అగర్వాల్‌ మసాలా దినుసుల ఫ్యాక్టరీ ఎండీ కాగా నిరంజన్‌జైన్‌, శాశ్వత్‌జైన్‌, బండి భార్గవ్‌, సూర్య సుమంత్‌రెడ్డి, వెంకట్‌ చలసాని కాంట్రాక్టర్లు. తమ్మినీడి సాగర్‌ ప్రైవేటు ఉద్యోగి, గోడి సుబ్బారావు డ్రైవరు. అలగాని శ్రీకాంత్‌ ఆఫీస్‌ బాయ్‌. ఈ పది మందిని నాంపల్లి కోర్టులో హాజరు పరచగా న్యాయస్థానం 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించింది. డ్రగ్స్‌ రాకెట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు కస్టడీకి అప్పగించాల్సిందిగా పంజాగుట్ట పోలీసులు న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. తూర్పు అంధేరి ప్రాంతంలో నివాసముంటున్న టోనీ పాస్‌పోర్టు, వీసాల గడువు పూర్తైన నేపథ్యంలో దిల్లీలోని రాయబార కార్యాలయం, ప్రాంతీయ విదేశీ వివరాల నమోదు కేంద్రానికి సమాచారం పంపామని ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.

అంతా పెద్ద వ్యాపారులే  
టోనీ నుంచి కొకైన్‌ను తరచూ కొంటున్న నిరంజన్‌జైన్‌ తొలిసారిగా పోలీసులకు దొరికాడు. డ్రగ్స్‌ అవసరమైనప్పుడు అతడు తన డ్రైవర్‌ను ముంబయికి పంపించే వాడు. స్థిరాస్తి వ్యాపారం, ప్రభుత్వ ప్రాజెక్టు పనులతో రూ.వెయ్యి కోట్లకు పైగా వ్యాపారాలు చేస్తున్నాడు. మూడేళ్ల నుంచి నిరంజన్‌జైన్‌, శాశ్వత్‌జైన్‌, యజ్ఞానంద్‌ అగర్వాల్‌లు వ్యాపారాలు, కాంట్రాక్టులు చేస్తున్నారు. శాశ్వత్‌జైన్‌ శంషాబాద్‌ పరిసర ప్రాంతాల్లో స్థిరాస్తి వెంచర్లను కూడా ప్రారంభించాడు. బండి భార్గవ్‌, వెంకట్‌లు హైదరాబాద్‌ శివారులోని ఓ అంతర్జాతీయ స్కూల్‌లో చదివారు. ఇద్దరూ భాగస్వామ్యులుగా ఎగుమతులు, దిగుమతుల వ్యాపారం నిర్వహస్తున్నారు. వెంకట్‌ చలసాని తండ్రి కూడా కాంట్రాక్టరేనని పోలీసులు గుర్తించారు. టోనీ నుంచి వీరంతా కొకైన్‌ను ఎప్పటి నుంచి కొంటున్నారు? తరచూ పార్టీలు చేసుకుంటున్నారా? కొకైన్‌ను కొని ఇతరులకు విక్రయిస్తున్నారా? అన్న కోణాల్లో పోలీసులు పరిశోధిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని