‘రుణయాప్‌’ వేధింపులు.. వ్యక్తి ఆత్మహత్య

బాకీ చెల్లించాలంటూ రుణయాప్‌ నిర్వాహకులు  బెదిరించడంతో ఓ క్యాబ్‌ డ్రైవరు  ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు, మృతుడి బంధువుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌లోని రాంకోఠిలో నివసించే....

Published : 20 Aug 2022 03:48 IST

సుల్తాన్‌బజార్‌, న్యూస్‌టుడే: బాకీ చెల్లించాలంటూ రుణయాప్‌ నిర్వాహకులు  బెదిరించడంతో ఓ క్యాబ్‌ డ్రైవరు  ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు, మృతుడి బంధువుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌లోని రాంకోఠిలో నివసించే చైతన్యయాదవ్‌(42) క్యాబ్‌డ్రైవర్‌గా పనిచేస్తూ భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి జీవిస్తున్నాడు. భార్య ప్రైవేటు ఉద్యోగి. చైతన్య శుక్రవారం ఉదయం డ్యూటీకీ వెళ్లగా, భార్య ఉద్యోగానికి, పిల్లలు స్కూల్‌కు వెళ్లారు. మధ్యాహ్నం ఇంటికొచ్చిన అతను  భార్యకు ఫోన్‌ చేసి నీతో మాట్లాడాలనిపించిందని చెప్పి ఫోన్‌ పెట్టేశాడు. కొద్దిసేపటి తర్వాత ఆమె తిరిగి ఫోన్‌ చేయగా స్పందించలేదు. అత్తామామలకు ఫోన్‌ చేసి విషయం చెప్పింది. వారు ఇంటికెళ్లి చూడగా.. అప్పటికే అతను ఉరికి వేలాడుతూ కనిపించాడు. కింగ్‌కోఠి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇటీవల తీసుకున్న అప్పును చెల్లించాలని రుణయాప్‌ నిర్వాహకులు ఒత్తిడి చేయడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని