నీరు మింగింది.. కన్నీరు మిగిలింది

సరదాగా నీటి గుంతలోకి దిగిన ముగుర్గురు చిన్నారులు.. నీటమునిగి మృతి చెందారు. షాద్‌నగర్‌ పురపాలిక పరిధిలోని సోలీపూర్‌ గ్రామ శివారులో సోమవారం ఉదయం ఈ ఘటన జరిగింది.

Published : 27 Sep 2022 05:36 IST

నీటి గుంతలోకి దిగి ముగ్గురు చిన్నారుల మృతి
షాద్‌నగర్‌ పరిధి సోలీపూర్‌లో ఘటన

షాద్‌నగర్‌, షాద్‌నగర్‌ పట్టణం, న్యూస్‌టుడే: సరదాగా నీటి గుంతలోకి దిగిన ముగుర్గురు చిన్నారులు.. నీటమునిగి మృతి చెందారు. షాద్‌నగర్‌ పురపాలిక పరిధిలోని సోలీపూర్‌ గ్రామ శివారులో సోమవారం ఉదయం ఈ ఘటన జరిగింది. సోలీపూర్‌కు చెందిన సయీఫ్‌(7), అక్షిత్‌గౌడ్‌ (8), ఫరీద్‌ (12)లు మరో మిత్రుడు సంజయ్‌కుమార్‌తో కలిసి గ్రామ శివారులోని ఓ వెంచర్‌ వద్దకు ఆడుకోవడానికి వెళ్లారు. అక్కడ ఓ పెద్ద గుంత ఇటీవల కురిసిన వర్షాలకు నీటితో నిండింది. అందులో ఈత కొడదామన్న ఆసక్తితో నలుగురు అందులోకి దిగారు. సంజయ్‌కుమార్‌ కొంచెం దూరం వెళ్లగానే భయమేసి ఒడ్డుకు రాగా.. మిగతా ముగ్గురు నీటిలో మునిగి పోయారు. సంజయ్‌కుమార్‌ పరుగెత్తుకెళ్లి గ్రామంలోని వారికి విషయం చెప్పగా.. వారొచ్చేసరికే ముగ్గురు పిల్లలూ మృత్యు ఒడికి చేరారు.

కొత్త బట్టలు కావాలి నాన్నా..
దసరాకు కొత్త బట్టలు కావాలని ఉదయమే తన కుమారుడు మారాం చేశాడని.. ఇంతలోనే ఇలా జరిగిందని అక్షిత్‌గౌడ్‌ తండ్రి భిక్షపతి వాపోయాడు. ఆయనకు ముగ్గురు కుమారులు కాగా, అక్షిత్‌ చిన్నవాడు.

అన్నదమ్ముల కుటుంబాల్లో తీరని విషాదం
ఫరీద్‌, సయీఫ్‌లు అన్నదమ్ములైన నయీమ్‌, సలీంల కుమారులు. వారిద్దరి మృతితో ఆ రెండు కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. వెంచర్‌లో అడ్డగోలుగా తవ్విన గుంతలు తమ పిల్లల ప్రాణాలు తీశాయని, తమకు న్యాయం చేయాలని చిన్నారుల కుటుంబ సభ్యులు పట్టణంలోని కమ్యూనిటీ ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు. న్యాయం జరిగేలా చూస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని