Video: నగల దుకాణంలో దొంగల బీభత్సం.. రూ.4కోట్ల విలువైన ఆభరణాలు చోరీ

నగల దుకాణంలో అల్మరాలను బద్దలుకొట్టుకొని 5లక్షల డాలర్ల విలువ చేసే నగలతో దొంగలు పరారయ్యారు. ఈ నెల 15న తెల్లవారు జామున 3.30గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టు న్యూయార్క్‌ పోలీసులు వెల్లడించారు.

Published : 19 Oct 2022 11:28 IST

న్యూయార్క్‌: అమెరికాలోని న్యూయార్క్‌(New york) నగరంలో ఓ నగల దుకాణంలో దొంగలు బీభత్సం సృష్టించారు. 5లక్షల డాలర్ల (సుమారు రూ.4.11కోట్లకు పైనే) విలువ చేసే ఖరీదైన ఆభరణాలతో ఉడాయించారు. మిడ్‌టౌన్‌ మాన్‌హట్టన్‌లోని పార్క్‌ అవెన్యూలో 400 బ్లాక్‌లో ఉన్న అత్యాధునికమైన సెల్లిని జ్యువెలర్స్‌లో జరిగిన ఈ చోరీ ఘటన వీడియోను న్యూయార్క్‌ పోలీసులు ట్విటర్‌లో షేర్‌ చేశారు. దీని ప్రకారం.. ముసుగులు ధరించిన ముగ్గురు దొంగలు ఆయుధాలతో తలుపులు బద్దలుకొట్టుకొని నగల దుకాణంలోకి వేగంగా చొరబడ్డారు. దుకాణంలో నగలు ప్రదర్శించిన అల్మరాలను బద్దలుకొట్టుకొని 5లక్షల డాలర్ల విలువ చేసే నగలతో పరారయ్యారు. ఈ నెల 15న అర్ధరాత్రి 2.30గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని.. ఒకేసారి ముగ్గురు వ్యక్తులు లోపలికి చొరబడి విధ్వంసం సృష్టించారని పోలీసులు తెలిపారు. వాళ్ల ఆచూకీ తెలిపిన వారికి 3500డాలర్లు రివార్డుగా ఇస్తామని ప్రకటించారు. ఈ చోరీ ఘటనలో ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని తెలిపిన పోలీసులు.. అనుమానితులను గుర్తించడంలో ప్రజల సహకారం కోరుతూ షేర్‌ చేసిన ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని