logo

ఆ డబ్బులు ఎప్పుడొస్తాయో?

జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ వసతి గృహ విద్యార్థులకు కాస్మొటిక్స్‌ ఛార్జీలు అందక ఇబ్బంది పడుతున్నారు. నెలనెలా అందాల్సిన నగదు రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో విడుదల చేయనందున పిల్లలు తల్లిదండ్రులపై ఆధారపడుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాలతో

Updated : 20 Jan 2022 06:18 IST

 సంక్షేమ వసతి గృహ విద్యార్థులకు అందని కాస్మొటిక్‌ ఛార్జీలు
 తల నూనె, సబ్బులు కరవాయే..!


గిరిజన గురుకుల పాఠశాల బాలికలు

జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ వసతి గృహ విద్యార్థులకు కాస్మొటిక్స్‌ ఛార్జీలు అందక ఇబ్బంది పడుతున్నారు. నెలనెలా అందాల్సిన నగదు రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో విడుదల చేయనందున పిల్లలు తల్లిదండ్రులపై ఆధారపడుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాలతో పాటు గురుకులాల్లో చదువుకుంటున్న వేలమంది విద్యార్థులకు పాఠశాలల పునః ప్రారంభం నుంచి ఇప్పటి వరకు తలకు నూనె, సబ్బులు, పేస్టు, బ్రష్‌ కొనడానికి డబ్బులు లేక బేలగా చూస్తున్నారు. నెల..నెలా ఇదిగో...అదిగో అంటున్నారు తప్ప.. డబ్బులు ఇచ్చిన దాఖలాల్లేవు.

వినుకొండ, న్యూస్‌టుడే  ప్రతినెలా మెస్‌ ఛార్జీలతో పాటు విద్యార్థులకు వ్యక్తిగత శుభ్రతకు రోజు వారి వినియోగించే వస్తువులు కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని చెప్పింది. ఫ్రీమెట్రిక్, పోస్టు మెట్రిక్‌ చదివే బాల, బాలికలకు కేటగిరీల వారిగా సగటున నెలకు రూ.160 వంతున చెల్లించాలి. బీసీలకు ఈ విద్యాసంవత్సరం ప్రారంభమైన తర్వాత ఆగస్టు నుంచి ఇప్పటి వరకు మూడు నెలల బకాయి ఉండగా, ఎస్సీ బాల, బాలికలకు గత విద్యా సంవత్సరంలో మూడు ఇప్పుడు మరో మూడు మొత్తం ఆరు నెలల డబ్బులు అందలేదు. గత రెండేళ్ల నుంచి డబ్బులు ఇవ్వలేదని ఎస్టీ విద్యార్థులు చెప్పి వాపోయారు. ఇందులో బాలికలకు మరికొంత అదనంగా రావాల్సి ఉన్నా గత ఏడాది నుంచి ఇవ్వలేదు

పిల్లలవి ఆపొద్దు
పేద పిల్లలకు ప్రతినెలా ఛార్జీలు చెల్లిస్తే వాటిని వినియోగించుకుంటారు. సకాలంలో ఇవ్వకుంటే ఇబ్బంది ఎదురవుతుంది. చాలామందితో మాట్లాడిన తర్వాత జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడాను. ఇంకా రాలేదన్నారు. ప్రభుత్వం పిల్లల డబ్బులు ఆపకూడదు వెంటనే చెల్లించాలి. అవసరమైతే రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి తెస్తాను. - సుబ్బారావు, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు

పోయిన సంవత్సరం నుంచి ఇవ్వలేదు
నేను 7వ తరగతిలో ఉన్నప్పుడు జనవరి నుంచి మూడు నెలలు రాలేదు. ఇప్పుడు మళ్లీ నాలుగు నెలలు గడిచింది. మొత్తం ఆరేడు నెలల నుంచి కాస్మొటిక్స్‌ ఛార్జీలు ఇవ్వాలి. అవి ఇస్తే మాకు వెసులుబాటుగా ఉంటుంది. నూనె, సబ్బులు కొనుక్కొని  వాడుకుంటాం. - పల్లెపోగు   నరసింహరావు, 8వ తరగతి, ఎస్సీ బాలుర వసతి గృహం

ఇంటి నుంచి తెచ్చుకుంటున్నాం 
సబ్బులు, తల నూనె, రిబ్బన్‌ ఇతరత్రావి గత ఏడాది నుంచి ఇవ్వడం లేదు. అంతకు ముందు మాకు హాస్టల్‌కు తెచ్చి పంచేవారు. ఇప్పుడు ఇళ్ల వద్ద నుంచి తెచ్చి వాడుకుంటున్నాం. ఆ పరిస్థితి లేని వాళ్లు సర్దుకుపోతున్నారు. ప్రతి రోజు శుభ్రంగా విద్యార్థులు ఉండాలంటే ఏనెలకానెల ఇస్తే ఉపయోగించుకోవచ్చు. లేనప్పుడు ఈ ప్రభావంతో వ్యక్తిగత పరిశుభ్రత తగ్గుతుంది. 
- వాగిబాయి, 9వ తరగతి విద్యార్థిని, ఎస్టీ బాలికల గురుకుల పాఠశాల

ఉన్నంతలో సర్దుబాటు..
డబ్బులివ్వనందున వాటిని కొనలేక తలకు నూనె రాసుకోకుండా వస్తున్నాం. మా అమ్మవాళ్ల బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని చెప్పారు కానీ ఇప్పటి వరకు అవి రాలేదు. మా అమ్మ, నాన్న వ్యవసాయం చేస్తున్నారు వాళ్లను అడగాలంటే ఇబ్బందిగా ఉంది. అందుకనే ఉన్నంతలో సర్దుకుంటున్నాం. - బండారు శ్రీహరి, 6వ తరగతి విద్యార్థి, ఎస్సీ బాలుర సంక్షేమ వసతి గృహం 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని