logo

‘బీసీలను నట్టేట ముంచిన జగన్‌’

‘బీసీలు రాజ్యాధికారం చేపట్టాలంటే ఎన్డీఏ కూటమితోనే సాధ్యం. బీసీ ఉపప్రణాళిక నిధుల్ని దారి మళ్లించి జగన్‌ నమ్మక ద్రోహం చేశారు.

Published : 27 Apr 2024 04:26 IST

సంఘీభావం తెలుపుతున్న పెమ్మసాని, శంకరరావు, మాధవి, నసీర్‌, నాయకులు

పట్టాభిపురం, న్యూస్‌టుడే: ‘బీసీలు రాజ్యాధికారం చేపట్టాలంటే ఎన్డీఏ కూటమితోనే సాధ్యం. బీసీ ఉపప్రణాళిక నిధుల్ని దారి మళ్లించి జగన్‌ నమ్మక ద్రోహం చేశారు. మాయమాటలు చెప్పి ఓట్లను దండుకుని అధికారంలోకి వచ్చిన జగన్‌ వారిని నట్టేట ముంచారు’.. అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు, గుంటూరు పార్లమెంట్‌ తెదేపా అభ్యర్థి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌లు విమర్శించారు. గుంటూరు అమరావతి రోడ్డులోని స్వగృహ కన్వెన్షన్‌లో బీసీ సంఘాల ఆత్మీయ సమావేశం శుక్రవారం నిర్వహించారు. కేసన శంకరరావు మాట్లాడుతూ ‘రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి బీసీ సంక్షేమ సంఘ నాయకుల నుంచి అభిప్రాయ సేకరణ తర్వాతే ఎన్డీఏ కూటమికి మద్దతు ప్రకటించాం. అయిదేళ్లలో జగన్‌ తీసుకున్న నిర్ణయాలతో ప్రజల జీవనం అస్తవ్యస్తంగా మారింది. సీఎం బటన్‌ నొక్కడానికి మాత్రమే పరిమితమయ్యారు. ప్రత్యేక రక్షణ హక్కు చట్టం కల్పిస్తామని ప్రకటించిన తర్వాత తెదేపాపై బీసీలకు నమ్మకం పెరిగింది. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఎన్డీఏ కూటమికి మద్దతు ప్రకటించాల్సిన అవసరముంది. నిజాయతీగా పని చేస్తున్నారన్న ఒకే ఒక్క కారణంతో వెనుకబడిన వర్గాలకు చెందిన పలువురు ఐఏఎస్‌, ఉద్యోగులకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా జగన్‌ ప్రభుత్వం వేధించింది. ఎన్నికల్లో అందరూ ఏకమై వైకాపా ప్రభుత్వాన్ని కూలదోయాలి’.. అని పిలుపునిచ్చారు. పెమ్మసాని చంద్రశేఖర్‌ మాట్లాడుతూ బీసీలకు జగన్‌ తీవ్ర అన్యాయం చేశారు. 16 విశ్వవిద్యాలయాల్లో వైస్‌ఛాన్సలర్‌ అవకాశాలుంటే.. ఒక్క పోస్టు మాత్రమే ఇచ్చారు. జగన్‌కు అభివృద్ధి చేద్దామన్న ఆలోచనే లేదు. భవన నిర్మాణ కార్మికుల పొట్ట కొట్టారు. చేతి వృత్తిదారులకు ద్రోహం చేశారు’.. అని మండిపడ్డారు. గుంటూరు పశ్చిమ తెదేపా అభ్యర్థి గళ్లా మాధవి మాట్లాడుతూ వైకాపా హయాంలో బీసీల సాధికారత లేదన్నారు.   తూర్పు తెదేపా అభ్యర్థి మహమ్మద్‌ నసీర్‌ మాట్లాడుతూ రాజ్యాధికారం కోసం బీసీలు పోరాటాలు చేస్తున్నారన్నారు. రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం యువజన అధ్యక్షుడు క్రాంతికుమార్‌, సంఘ రాష్ట్ర నాయకులు అన్నవరపు నాగమల్లేశ్వరరావు, నిమ్మల శేషయ్య, మల్లె ఈశ్వరరావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని