logo

గురువులపై బోధనేతర విధుల భారం

గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వ ఉపాధ్యాయులపై వైకాపా ప్రభుత్వం కక్ష గట్టినట్లు వ్యవహరిస్తోందని పలుమార్లు ఉపాధ్యాయ సంఘాలే నేరుగా విమర్శలు గుప్పించాయి.

Published : 27 Apr 2024 04:25 IST

గుంటూరు విద్య, న్యూస్‌టుడే : గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వ ఉపాధ్యాయులపై వైకాపా ప్రభుత్వం కక్ష గట్టినట్లు వ్యవహరిస్తోందని పలుమార్లు ఉపాధ్యాయ సంఘాలే నేరుగా విమర్శలు గుప్పించాయి.. బోధనేతర పనులు ఉపాధ్యాయులకు అప్పగించి విద్యాప్రమాణాలకు పాతర వేశారు. ప్రభుత్వ బడులను కార్పొరేట్‌ స్థాయికి చేర్చుతున్నామని చెప్పుకుంటూనే ప్రభుత్వం ఉపాధ్యాయులకు బోధనేతర విధులు అప్పగిస్తోంది. నాడు- నేడు పనుల పర్యవేక్షణ, మరుగుదొడ్ల నిర్వహణ, మధ్యాహ్న భోజన పథకం అమలు వంటివి ఫొటోలు తీసి యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలనే నిబంధనలు విధించి ఒత్తిళ్లకు గురిచేశారు. ఆన్‌లైన్‌ యాప్‌లతో బోధనపై ప్రభావం పడుతుందని ఆ విధులు రద్దు చేయాలని పలుమార్లు నిరసనలు, ఆందోళనలు చేపట్టినా ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలేదు. దీంతో ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత పాఠశాలల వరకు బోధనపై ప్రభావం పడి ఉపాధ్యాయులు నానా అవస్థలు పడ్డారు. తుదకు పాఠశాలల పర్యవేక్షణ పేరుతో పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి తనిఖీలు చేసి ఉపాధ్యాయులకు నోటీసులు, పలుసందర్భాల్లో చర్యలు తీసుకున్నారు.

బోధనకు తీవ్ర ఆటంకం: శ్రీనివాసరావు, ఉపాధ్యాయుడు

ఉపాధ్యాయులకు ఆన్‌లైన్‌ యాప్‌ల బాధ్యతలు ఇచ్చి అనేక రకాల డేటా అప్‌లోడ్‌ చేయాలని విధులు అప్పగించడంతో బోధనకు తీవ్ర ఆటంకం ఎదురైంది. పాఠశాల 9 గంటలకే ప్రారంభమైనా యాప్‌లో వివరాల నమోదుకు రెండు గంటలు కేటాయించాల్సి వస్తోంది. దీనితో విద్యార్థుల సిలబస్‌ అనుకున్న సమయానికి పూర్తి కాక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. విద్యార్థుల వర్క్‌బుక్స్‌ కూడా సరిగా చూడలేక పోయాం.

నాడు-నేడు పనులతో అవస్థలు పడ్డాం: విజయకుమార్‌, ఉపాధ్యాయుడు

పాఠశాలల్లో నాడు- నేడు పనుల బాధ్యత ప్రధానోపాధ్యాయులకు అప్పగించడం వలన వారు పాఠశాల అడకమిక్‌ కార్యక్రమాలపై దృష్టి పెట్టలేక పోయారు. నిత్యం అభివృద్ధి పనుల లెక్కలతోనే వారు కాలం గడపాల్సి రావడంతో పిరియడ్ల షెడ్యూల్‌, పరీక్షల నిర్వహణ తదితర పనులకు ఇబ్బంది పడ్డాం. నిత్యం ఏదో ఒక మీటింగ్‌ ఉందని జిల్లా కార్యాలయానికి వెళ్లాల్సి రావడంతో పాఠశాలలు అస్తవ్యస్తంగా మారాయి. దీంతో ఈ ఏడాది పలుపాఠశాలల్లో పదో తరగతి ఫలితాలపై కూడా ప్రభావం పడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని