logo

బరిలో మిగిలేదెవరో?

సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామపత్రాల సమర్పణ, పరిశీలన కార్యక్రమం ముగిసింది. ప్రధాన పార్టీలతో పాటు గుర్తింపు, నమోదైన పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు పెద్దఎత్తున నామపత్రాలు దాఖలు చేశారు.

Published : 27 Apr 2024 04:43 IST

ప్రధాన పార్టీ అభ్యర్థుల నామపత్రాలన్నీ ఆమోదం
కొందరు స్వతంత్రుల నామినేషన్ల తిరస్కరణ

 ఈనాడు, అమరావతి, న్యూస్‌టుడే, కలెక్టరేట్‌: సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామపత్రాల సమర్పణ, పరిశీలన కార్యక్రమం ముగిసింది. ప్రధాన పార్టీలతో పాటు గుర్తింపు, నమోదైన పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు పెద్దఎత్తున నామపత్రాలు దాఖలు చేశారు. ఈ నెల 18న మొదలైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ 25వ తేదీతో ముగిసింది. శుక్రవారం నామపత్రాల పరిశీలన చేసిన అధికారులు సంబంధిత పత్రాలు లేనివాటిని తిరస్కరించారు. అర్హులైన వారివి ఆమోదించారు. తిరస్కరణకు గురైన వాటిలో స్వతంత్రులు, డమ్మీ అభ్యర్థులు ఉన్నారు. నేటి నుంచి నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ మొదలై ఈ నెల 29వ తేదీతో ముగుస్తుంది. అదే రోజు ఎన్నికల్లో పోటీలో ఉండే అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తారు.

గుంటూరు పార్లమెంటుకు ఈసారి పెద్దఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. 47 నామినేషన్లు దాఖలు కాగా 13 తిరస్కరించగా 34 ఆమోదం పొందాయి. ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న తెదేపా అభ్యర్థి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ రూ.5705కోట్ల ఆస్తులు అఫిడవిట్‌లో చూపడంతో గుంటూరు పార్లమెంటు స్థానంపై దేశ వ్యాప్తంగా చర్చ మొదలైంది. అదే సమయంలో నామినేషన్లు కూడా ఎక్కువగా రావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక్కడి నుంచి తెలంగాణ, హరియాణా, కర్ణాటక రాష్ట్రాలకు చెందినవారు ఐదుగురు పోటీకి సిద్ధమై నామినేషన్లు వేయడం గమనార్హం. వారు సరైన పత్రాలు సమర్పించలేదని అధికారులు తిరస్కరించారు. జిల్లాలోని అసెంబ్లీ స్థానాల్లో మంగళగిరికి అత్యధికంగా 44 నామినేషన్లు రాగా 2 తిరస్కరణకు గురయ్యాయి. ఇక్కడి నుంచి తెదేపా తరఫున ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ బరిలోకి దిగడంతో ఇక్కడ పోటీ చేయడానికి పలువురు ముందుకు రావడం గమనార్హం.  జిల్లాలో మొత్తం 7 అసెంబ్లీ స్థానాలకు 181 నామినేషన్లు రాగా 40 తిరస్కరించి 141 ఆమోదించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని