logo

ఇంతింతై.. ప్రపంచమంతై!

సాఫ్ట్‌వేర్‌ రంగంలో జిల్లాకు చెందిన వేలాది మంది పని చేస్తున్నారు. రూ.లక్షల్లో వేతనం సంపాదిస్తున్నారు. వీరు మాత్రం అందుకు భిన్నంగా ఆలోచించారు. పైకి ఎదుగుతూనే గుర్తింపు వస్తుందని భావించి కష్టపడ్డారు.

Published : 25 Jan 2023 06:35 IST

ఆదిలాబాద్‌ బిడ్డల సాఫ్ట్‌వేర్‌ రంగ ప్రస్థానం
న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ పట్టణం 

సాఫ్ట్‌వేర్‌ రంగంలో జిల్లాకు చెందిన వేలాది మంది పని చేస్తున్నారు. రూ.లక్షల్లో వేతనం సంపాదిస్తున్నారు. వీరు మాత్రం అందుకు భిన్నంగా ఆలోచించారు. పైకి ఎదుగుతూనే గుర్తింపు వస్తుందని భావించి కష్టపడ్డారు. ఒకరైతే కంపెనీ తరఫున ఏడు దేశాల్లోని ఉద్యోగులకు హెడ్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. మరికొందరు స్వతహాగా కంపెనీలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే తాము పుట్టి పెరిగిన ఆదిలాబాద్‌ గడ్డను మరవకుండా ఇక్కడ వారికి సైతం ఉద్యోగాలు కల్పించేందుకు  ముందుకొస్తున్నారు. ఇదే విషయమై ఆదిలాబాద్‌లో ఏర్పాటుచేసిన సమావేశానికి హాజరైన వారిని ‘న్యూస్‌టుడే’ పలకరించింది. వారి విజయప్రస్థానంపై ప్రత్యేక కథనం..


ఏడు దేశాల ఉద్యోగులకు బాస్‌గా ఎదిగి

చదివింది తెలుగు మాధ్యమంలోనైనా ఆంగ్ల అవసరాన్ని గుర్తించి అందులో ప్రావీణ్యం సంపాదించారు. సాఫ్ట్‌వేర్‌ రంగంలో ప్రవేశించి అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం ఏడు దేశాల్లోని కంపెనీ సీఈఓలకు బాస్‌గా వ్యవహరిస్తూ ఏకంగా 4,800 ఉద్యోగుల పని తీరును పర్యవేక్షిస్తున్నారు. ఆయనే ఆదిలాబాద్‌ పట్టణం బ్రాహ్మణవాడ కాలనీకి చెందిన సంజీవ్‌దేశ్‌పాండే. స్థానికంగా పదో తరగతి వరకు విద్యనభ్యసించిన ఆయన ఇంటర్‌  ఆదిలాబాద్‌ ప్రభుత్వ కళాశాలలో చదివారు. ఆ తరువాత జైపూర్‌లో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు. వివిధ కంపెనీల్లో ఉద్యోగం చేసిన ఆయన 1999లో యూఎస్‌ఏ వెళ్లి అక్కడే ఉద్యోగం చేస్తూ ఎంబీఏ పూర్తిచేశారు. 2002లో సాఫ్ట్‌వేర్‌ దిగ్గజ కంపెనీల్లో ఒకటైన ‘ఎన్‌టీటీ డాటా బిజినెస్‌ సొల్యూషన్‌’ కంపెనీలో చేరి అందులో అనతికాలంలోనే ఉన్నతస్థానానికి చేరుకున్నారు. తొలుత ఆ సంస్థకు సంబంధించి భారత దేశ సీఈఓగా వ్యవహరించిన ఆయనకు పనితీరుగా ఆధారంగా పదోన్నతి లభించింది. ప్రస్తుతం భారత్‌తో పాటు సింగపూర్‌, మలేషియా, ఇండోనేషియా, థాయిలాండ్‌, ఖతర్‌, ఆస్ట్రేలియా దేశాల్లో సంస్థ తరఫున పని చేస్తున్న సీఈఓలకు హెడ్‌గా వ్యవహరిస్తున్నారు. ఆదిలాబాద్‌లో ఐటీహబ్‌ను ప్రోత్సహించేందుకు ఇక్కడ ఒక ప్రైవేటు కంపెనీని ఏర్పాటు చేయించేలా వారికి తమ సంస్థ తరఫున 100 మంది ఉద్యోగుల కాంట్రాక్ట్‌ ఇప్పించి తొలి అడుగు వేయించారు. ఆదిలాబాద్‌ వాసులకు ఏదో చేయాలనే తపనతోనే సాఫ్ట్‌వేర్‌ కంపెనీలను ఇక్కడికి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.


విదేశాలల్లోనూ కార్యకలాపాలు

జైనథ్‌ మండలం గిమ్మ గ్రామానికి చెందిన జలగం రవీందర్‌రావు పట్టణంలోని శ్రీ సరస్వతి శిశుమందిర్‌లో పదో తరగతి వరకు చదివారు. అమరావతి విశ్వవిద్యాలయంలో 1994లో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన ఆయన తొలుత వివిధ కంపెనీల్లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పని చేశారు. దాంతో సంతృప్తి చెందని ఆయన సొంతంగా కంపెనీని ఏర్పాటు చేయాలని నిర్ణయించి మిత్రులతో కలిసి ‘ఏఈఎస్‌’ సర్వీసెస్‌ పేరిట కంపెనీని ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోనే కాకుండా కెనడా, యూఎస్‌ఏలకు కంపెనీని విస్తరించారు. దాదాపు 152 మంది ఉద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నారు. ఇంజినీరింగ్‌ పట్టభద్రులే కాకుండా సాధారణ డిగ్రీ చదివిన విద్యార్థులు సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉద్యోగాలు సాధించేందుకు ఆయన ఆదిలాబాద్‌ వాసులకోసం స్థానికంగా ‘ఫినిషింగ్‌ స్కూల్‌’ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు.


పిన్న వయసులోనే....

తాంసికి చెందిన వేదాంత్‌ పడిగెల్‌వార్‌ చిన్నప్పటి నుంచే భిన్నంగా ఆలోచన చేయడం ఆయన ఎదిగేందుకు తోడ్పడింది. కేవలం 24 ఏళ్ల ప్రాయంలోనే సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఏర్పాటు చేసి మంత్రి కేటీఆర్‌తోనూ అభినందనలు అందుకున్నారు. హైదరాబాద్‌లోని ఐటీ హబ్‌లోనూ ఆయన కంపెనీ ఉద్యోగులు పని చేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఆదిలాబాద్‌లో 5వ తరగతి వరకు చదివి మిగతా విద్యాభ్యాసం కోసం హైదరాబాద్‌ వెళ్లారు. కోయంబత్తూర్‌లోని అమృత విశ్వవిద్యాలయంలో బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ పూర్తిచేసి ఇంగ్లాండ్‌లో 6 నెలల పాటు పనిచేశారు. ఉద్యోగ సమయంలోనే క్రికెట్‌ పోటీలు తిలకించే సమయంలో క్రీడాకారులు ఫీల్డింగ్‌లో ఎక్కడెక్కడ ఉన్నారని టీవీల్లో తిలకించేందుకు రూపొందించిన సాఫ్ట్‌వేర్‌లో భాగస్వామ్యం పంచుకున్నారు. సొంతంగా ‘ఁ-్న‘్మ’ పేరిట సాఫ్ట్‌వేర్‌ కంపెనీని ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌ కేంద్రంగా పని చేస్తూ ఆదిలాబాద్‌ వంటి మారుమూల ప్రాంతాలకు విస్తరించి ఉద్యోగావకాశాలు కల్పించాలనేది తన ఉద్దేశమని వివరించారు.


సివిల్స్‌కు సన్నద్ధమై.. సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఏర్పాటు చేసి

జైనథ్‌ మండలం గిమ్మ గ్రామానికి చెందిన మామిడిపల్లి రాఘవేందర్‌ సివిల్స్‌ సర్వీసెస్‌ కోసం డిగ్రీ చదువును ఎంచుకొని పరీక్షలకు సన్నద్ధమయ్యారు. ఇంటర్వ్యూ వరకు వెళ్లి తిరిగి వచ్చేయడంతో ఆయనలో కొత్త ఆలోచన మొదలైంది. ఎంఏ వరకు చదివిన ఆయన ఆ తరువాత ఐటీ రంగంవైపు మళ్లీ ప్రత్యేక శిక్షణ పొందారు. 1999లో యూఎస్‌ఏ వెళ్లి అక్కడే వివిధ ఐటీ కంపెనీల్లో ప్రోగ్రామర్‌గా పనిచేసిన ఆయన తన దగ్గరి మిత్రునితో కలిసి 2020లో ‘ఎన్‌విజియనార్డ్‌’  పేరిట కంపెనీని మొదలెట్టారు. ప్రస్తుతం హైదరాబాద్‌తో పాటు మహారాష్ట్రలోని పూణే, యూఎస్‌లలో కంపెనీ సేవలందిస్తోంది. ప్రజల కోరికకు తగ్గట్లుగా వారి ఆరోగ్యానికి సరిపడా ఎక్కడ భోజనం లభిస్తుందనే కొత్త అప్లికేషన్‌ను ఇటీవలే ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఆదిలాబాద్‌లోనూ ఉద్యోగవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని