logo

నేటి నుంచి డిగ్రీ పరీక్షలు

కాకతీయ విశ్వవిద్యాలయ పరిధిలో డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఒకవైపు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ప్రస్తుత తరుణంలో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ తదితర కోర్సుల్లో రెండు, నాలుగు, ఆరో సెమిస్టర్‌ పరీక్షల నిర్వహిస్తుండటం సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Published : 06 May 2024 04:47 IST

కేయూ తీరుపై సర్వత్రా విమర్శలు

పాలనాప్రాంగణం, న్యూస్‌టుడే : కాకతీయ విశ్వవిద్యాలయ పరిధిలో డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఒకవైపు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ప్రస్తుత తరుణంలో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ తదితర కోర్సుల్లో రెండు, నాలుగు, ఆరో సెమిస్టర్‌ పరీక్షల నిర్వహిస్తుండటం సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ద్వితీయ, తృతీయ సంవత్సర విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ప్రథమ సంవత్సర విద్యార్థులకు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. జిల్లాలో ఆదిలాబాద్‌, ఉట్నూర్‌, ఇచ్చోడ, బోథ్‌, బేల, నేరడిగొండ, బజార్‌హత్నూర్‌  మండల కేంద్రాల్లో 16 కేంద్రాలను ఏర్పాటుచేయగా.. దాదాపు 12 వేల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వసతిగృహాలు, గురుకుల విద్యాలయాల్లో ఉండి పరీక్షలు హాజరవుతున్న విద్యార్థుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. ఉక్కపోతకు తోడు వడగాలులతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వేడిమికి సన్నద్ధమవడం కష్టమవుతోందని, ఉక్కపోతలో పరీక్షలు ఎలా రాయాలో అర్థం కావడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండల తీవ్రతను, విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పరీక్షలు వాయిదా వేయాలని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల బాధ్యులు విజ్ఞప్తులను యూనివర్సిటీ అధికారులు పక్కనబెట్టడం వారి నియంతృత్వ ధోరణికి అద్దం పడుతోంది. బీఎడ్‌, ఐసెట్, పీజీసెట్, లాసెట్ వంటి పోటీ పరీక్షల ప్రవేశాల నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితి పరీక్షలు నిర్వహించాల్సి వస్తోందని అధికారులు చెబుతున్నా.. ఉస్మానియా విశ్వవిద్యాలయం వారు పరీక్షలు ఎలా వాయిదా వేశారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మరోవైపు పరీక్షకు పది నిమిషాల ముందు ప్రశ్నపత్రం ఆన్‌లైన్‌లో కేంద్రాలకు చేరనుండటంతో... వాటిని ప్రింట్ తీసి విద్యార్థులకు ఇవ్వాల్సి ఉంటుంది. ఎండల దృష్ట్యా తరచూ అనధికారిక విద్యుత్తు కోతలు ప్రశ్నపత్రాల ప్రింటింగ్‌కు అవరోధంగా మారే ప్రమాదం లేక పోలేదని ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లు వాపోతున్నారు. ఉక్కపోతలో విద్యార్థులు పరీక్షలు రాయడం కష్టమేనని అధ్యాపకులు అభిప్రాయపడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని