logo

అమ్మా.. నేనేమీ చేశాను పాపం..

అమ్మా... ఎన్నో కష్టాలకోర్చి నవ మాసాలు మోశావు.. ఎందుకమ్మా నా ప్రాణాలు తీయాలని చూశావు.. అమ్మ పాలు అమృతంలా ఉంటాయని అంటారు.. అలాంటి పాల వాసన కూడా చూపించలేక పోయావు..

Published : 07 May 2024 04:00 IST

అమ్మా... ఎన్నో కష్టాలకోర్చి నవ మాసాలు మోశావు..
ఎందుకమ్మా నా ప్రాణాలు తీయాలని చూశావు..
అమ్మ పాలు అమృతంలా ఉంటాయని అంటారు..
అలాంటి పాల వాసన కూడా చూపించలేక పోయావు..
కానీ అమ్మ ముఖం ఎలా ఉంటుందో చూపించలేక పోయావు..
పురిటి నొప్పులు భరించి రక్తపు ముద్దగా చేసి..
నన్ను చెత్త కుప్పలో పడేసి..
నీ దారిన నీవు వెళ్లిపోతే నాకు దారి చూపించేదెవరమ్మా..
ఆడ పిల్లననేకదా అమ్మా..
ఇలాంటి శిక్ష విధించావు..
చెత్తలో ఉన్న రాళ్లు నా పక్కటెముకలకు గుచ్చుకుంటూ ఉంటే..
అమ్మా అని నేను చేసిన ఆర్తనాదాలు విని..
పక్క ఇంట్లో ఉన్న ప్రవీణ్‌ అంకుల్‌ నా కోసం పరితపించాడు..
100కు డయల్‌ చేస్తే పోలీసు సార్లు స్పందించి..
నన్ను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు..
నా కంటూ ఓ గమ్యాన్ని చూపించేందుకు కొందరు తల్లులూ కదిలి వచ్చారు..
అమ్మా నేను కోరుకునేది ఒక్కటేనమ్మా..
ఇక ముందు ఏ తల్లీ పుట్టిన బిడ్డను ఇలా చెత్తకుప్పల్లో విసిరివేయద్దని కోరుకుంటున్న అమ్మా..
ఓ అనాథ ఆడ పసికందు మనోవేదనకు అక్షర రూపం ఇదీ.

జన్నారం, న్యూస్‌టుడే

పసికందును పడేసిన చెత్తకుప్ప ఇది

మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని శ్రీలంక కాలనీలో సోమవారం సాయంత్రం ఓ పసికందును గుర్తు తెలియని తల్లి పడేసిపోయింది. చెత్త కుప్పలో నుంచి చిన్నారి ఏడుపు విన్న ప్రవీణ్‌ అనే యువకుడు చూసి తక్షణమే 100కు డయల్‌ చేశాడు. దీంతో హెడ్‌ కానిస్టేబుల్‌ తుకారాం, కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గుడ్డలో చుట్టి చెత్తలో పడేసిన పసికందును పోలీసులే చేతుల్లోకి తీసుకొని జన్నారంలో ఉన్న పిల్లల ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ముక్కుపచ్చలారని ఆడ పసికందును పడేసి వెళ్లిపోయిన వారిని తిట్టని వారు లేరు. అనంతరం ఐసీడీఎస్‌ అధికారులకు పసికందును అప్పగించినట్లు జన్నారం ఎస్సై రాజవర్ధన్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని