logo

కొనుగోళ్లు చేయరు.. కన్నీళ్లు తుడవరు

నిత్యం ఆకాశం కారుమబ్బులతో నిండి ఉండటం, తరచూ వర్షం పడటంతో ధాన్యం రైతులు పంట విక్రయించడానికి తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. తేమ పేరుతో కేంద్రాల నిర్వాహకులు కొర్రీలు పెట్టడం, మరోవైపు వీడని వర్షంతో ధాన్యాన్ని ఎలా అమ్మాలో, ఎట్లా రక్షించుకోవాలో తెలియని దుస్థితిలో అన్నదాతలున్నారు.

Published : 18 May 2024 02:00 IST

సిర్పూర్‌(టి) మండలం గంగాయిగూడలో వర్షం కురుస్తుండటంతో ధాన్యం సంచులపై టార్ఫాలిన్‌ కప్పుతున్న రైతులు

ఈనాడు, ఆసిఫాబాద్‌ : నిత్యం ఆకాశం కారుమబ్బులతో నిండి ఉండటం, తరచూ వర్షం పడటంతో ధాన్యం రైతులు పంట విక్రయించడానికి తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. తేమ పేరుతో కేంద్రాల నిర్వాహకులు కొర్రీలు పెట్టడం, మరోవైపు వీడని వర్షంతో ధాన్యాన్ని ఎలా అమ్మాలో, ఎట్లా రక్షించుకోవాలో తెలియని దుస్థితిలో అన్నదాతలున్నారు. తూకం పేరుతో సైతం మోసాలు జరగడంతో కర్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో అతి తక్కువ ధరకు ప్రైవేటులో ధాన్యాన్ని విక్రయిస్తూ నష్టపోతున్నారు. లారీలు సైతం అందుబాటులో లేకపోవడంతో రెండు, మూడు వారాలపాటు కేంద్రాల్లోనే ధాన్యం నిల్వలు పేరుకుపోయి ఉంటున్నాయి. 

జిల్లావ్యాప్తంగా 37 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. 19,700 ఎకరాల్లో వరి సాగు చేయగా 46,894 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలనేది లక్ష్యం. ధాన్యం కొనుగోలు ప్రారంభం నుంచే వర్షాలు, ఈదురుగాలులు వీస్తున్నాయి. ధాన్యం తడిసి పోవడంతో తేమ తప్పనిసరిగా ఉంటుంది. పగలు కాస్త ఎండ రాగా ఆరబెట్టేలోపు మళ్లీ వరుణుడు విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో తడిచిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేసి ఆదుకోవాలని అన్నదాతలు వేడుకుంటున్నారు. ప్రభుత్వం సైతం ఈ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సూచిస్తున్నా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని అన్నదాతలు అంటున్నారు. 

కోతలు, తూకంలో మోసాలు

దహెగాం మండలంలోని ఒడ్డుగూడలో సహకారం సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్లు చేపట్టారు. నిర్వాహకులు ఎలక్ట్రానిక్‌ కాంటాలో ఏకంగా మార్పులు చేశారు. ఒక్కో బస్తాకు అర కిలో అదనంగా తీసుకుంటున్నామని చెప్పి, ఏకంగా రెండున్నర, మూడు కిలోల ధాన్యం అదనంగా తీసుకున్నారు. రైతుకు అనుమానం వచ్చి వేరొక కాంటాలో తూకం వేయగా ఈ బండారం బయటపడింది. రైతుల ఫిర్యాదుతో కదిలిన అధికారులు విచారణ చేయగా కాంటాలో మోసంతో నాలుగు క్వింటాళ్ల ధాన్యం పక్కదారి పట్టించినట్లు గుర్తించారు. మరోవైపు రైస్‌మిల్లుల్లో సైతం కోతలు పెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కేంద్రాల్లో తూకానికి సంబంధించి రైతులకు ఎలాంటి రశీదులు ఇవ్వకపోవడం, రైస్‌మిల్లర్లు ఎంత చెబితే అంతే అనే విధానం ఉండటంతో కర్షకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఇబ్బందులు లేకుండా చూస్తాం

నరసింహారావు, మేనేజర్, పౌరసరఫరాలశాఖ

ప్రతీ కొనుగోలు కేంద్రానికి రెండు లారీల చొప్పున అందుబాటులో ఉంచాం. ధాన్యాన్ని వెంట వెంటనే రైస్‌మిల్లులకు తరలిస్తున్నాం. తేమ ఉన్నా కొనుగోలు చేస్తాం. రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం. 

ధాన్యం తెచ్చి ఇరవై రోజులు

ఎల్కరి సంతోష్, కర్జీ, దహెగాం మండలం

కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని తెచ్చి ఇరవై రోజులవుతోంది. తరుచూ వర్షం పడటంతో ధాన్యం ఎండటం లేదు. అధికారులు ఈ ధాన్యాన్ని సైతం కొనుగోలు చేసి ఆదుకోవాలి. మళ్లీ వరుసగా వర్షాలు కురుస్తున్నాయి.

తేమ ఉందని కొనడం లేదు

శోభ, సాండ్‌గాం, కౌటాల మండలం

ధాన్యాన్ని నిత్యం ఆరపెడుతున్నా.. వర్షాల కారణంగా తేమ పోవడం లేదు. అధికారులు 17 మించి తేమశాతం ఉండకూడదని అంటున్నారు. ఎండలు వస్తే తప్ప ఈ తేమ పోయే పరిస్థితి లేదు. మా గ్రామంలో రైతులందరిదీ ఇదే పరిస్థితి.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని