logo

మందులు పక్కదారి..

డయాలసిస్‌ చేయించుకునే కిడ్నీ బాధితులకు ప్రభుత్వం అపోలో ద్వారా సరఫరా చేస్తున్న విలువైన మందులు పక్కదారి పడుతున్నాయి.

Published : 09 Feb 2023 02:01 IST

తిరువూరు, న్యూస్‌టుడే

డయాలసిస్‌ చేయించుకునే కిడ్నీ బాధితులకు ప్రభుత్వం అపోలో ద్వారా సరఫరా చేస్తున్న విలువైన మందులు పక్కదారి పడుతున్నాయి. ఎ.కొండూరు మండలంలో అత్యధికంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. క్రియాటిన్‌ ఎక్కువగా ఉన్న వారికి అవసరమైన డయాలసిస్‌ చేయడానికి వీలుగా తిరువూరు ప్రాంతీయ వైద్యశాలలో రూ.3 కోట్లతో నిర్మించిన డయాలసిస్‌ కేంద్రాన్ని 2021 అక్టోబరు 11న ప్రారంభించారు. మందులను ఇక్కడి కేంద్రంలో పనిచేస్తున్న సాంకేతిక నిపుణుడు పక్కదారి పట్టిస్తున్న వైనం సీసీ కెమెరా ఫుటేజీ ద్వారా వెలుగు చూశాయి. మంగళవారం మధ్యాహ్నం తాను అద్దెకు ఉంటున్న ఇంట్లో ఐదు బాక్సులు, రెండు సంచుల్లో దాచిన మందులను రిక్షాపై బస్టాండ్‌ కూడలి సమీపంలోని ఒక ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. డయాలసిస్‌ కేంద్రంలో సాంకేతిక నిపుణుడి ఉద్యోగాన్ని నెల రోజుల కిందట మానేశాడు. ఈక్రమంలో తన సొంత ఊరుకు వెళ్లేక్రమంలో అద్దెకు తీసుకున్న గదిని ఖాళీ చేయడానికి మంగళవారం వచ్చాడు. తాను ఉంటోన్న గది మొదటి అంతస్తులో ఉంది. అక్కడ నిల్వ ఉంచిన మందులను ప్రైవేటు ఆస్పత్రిలోని మెడికల్‌ షాపు నిర్వాహ   కుడు, రిక్షా కార్మికుడి సాయంతో కిందకు దించడం, వాటిని తరలించడం సీసీ కెమెరాలో నమోదయ్యింది. దీనితో పాటుగా ఇటీవల సంక్రాంతి పండుగ సమయంలో కొన్ని బాక్సులు కారులో తరలించడం కూడా వెలుగులోకి వచ్చింది.  డయాలసిస్‌ కోసం వచ్చే వారికి అవసరమైన పరీక్షలు ఆస్పత్రిలోనే ఉచితంగా చేసి, ప్రభుత్వం నుంచి వచ్చే మందులతో ఉన్నత వైద్యసేవలు అందించాల్సి ఉంది. దీనికి విరుద్ధంగా ప్రైవేట్‌ ఆస్పత్రులతో కుమ్మక్కై వాటాల కోసం కొన్ని పరీక్షలు, మందుల కోసం ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్లాలంటూ రిఫర్‌ చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.

మందుల బాక్సులను రిక్షాలో వేస్తున్న ప్రైవేట్‌ ఆస్పత్రి ఉద్యోగి, డయాలసిస్‌ కేంద్రం టెక్నీషియన్‌

విచారణ జరుపుతాం..

దీనిపై ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ గార్గెయను వివరణ కోరగా డయాలసిస్‌ కేంద్రం బాధ్యత అపోలోకు అప్పగించినట్లు తెలిపారు. మందులు పక్కదారి పట్టిన విషయం తనకు తెలియదని బదులిచ్చారు. అపోలో జిల్లా ఇన్‌ఛార్జి మధుకిరణ్‌ను వివరణ కోరగా సాంకేతిక నిపుణుడు నెల రోజులుగా విధులకు హాజరుకావడం లేదని తెలిపారు. మందులు పక్కదారి పట్టిన వైనంపై విచారణ జరుపుతామని ఆయన వివరించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని