logo

మిగులు పనుల పూర్తికి ఐదేళ్లా..!

తెదేపా హయాంలో కానూరు వీఆర్‌ సిద్ధార్థ ఇంజినీరింగ్‌ కళాశాలలో యాజమాన్యం వారు సొంత నిధులు వెచ్చించి వంతెన నిర్మించారు. కొన్ని పనులు మిగిలిపోయాయి. వాటిని పూర్తి చేయడానికి ఇంకా రూ.2.50 కోట్లు అవసరం.

Published : 27 Apr 2024 03:08 IST

వైకాపా నిర్వాకంతో అందుబాబులోకి రాని వారధి
50 వేల జనాభాకు తప్పని అవస్థలు

పూర్తికాని వారధి

నాడు: తెదేపా హయాంలో కానూరు వీఆర్‌ సిద్ధార్థ ఇంజినీరింగ్‌ కళాశాలలో యాజమాన్యం వారు సొంత నిధులు వెచ్చించి వంతెన నిర్మించారు. కొన్ని పనులు మిగిలిపోయాయి. వాటిని పూర్తి చేయడానికి ఇంకా రూ.2.50 కోట్లు అవసరం.
నేడు: వైకాపా ప్రభుత్వం వచ్చిన తరువాత మిగిలిన పనులు పూర్తి చేయడానికి కావాల్సిన నిధులను పురపాలక, సీఆర్‌డీఏలు భరిస్తాయని హామీ ఇచ్చాయి. కానీ అయిదేళ్లవుతున్నా అతీగతీలేదు. వారధి ఇంకా ప్రజలకు అందుబాటులోకి రాలేదు. ప్రజలకు అవస్థలు తప్పడం లేదు.

కానూరు, తాడిగడప, న్యూస్‌టుడే

తెదేపా హయాంలోనే జోరుగా పనులు

2017లో పంట కాలువ రోడ్డును సనత్‌నగర్‌ నుంచి వందడుగుల రహదారి వరకు వేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందులో భాగంగా వీఆర్‌ సిద్ధార్థ కళాశాలలో 350 మీటర్ల రోడ్డు వేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్న తరుణంలో తమ కళాశాలలో వద్దని అందుకు ప్రత్యామ్నాయంగా తామే ఆ ప్రదేశంలో పైవంతెన నిర్మాణం చేస్తామని ప్రతిపాదించారు. దీనికి తెదేపా ప్రభుత్వం అంగీకరించడంతో కళాశాల యాజమాన్యం రూ.11 కోట్లు వెచ్చించి వంతెన నిర్మాణం చేపట్టి 2019లో 80 శాతం పూర్తి చేసింది.

అదిగో.. ఇదిగో అంటూ కాలయాపన

ఇంకా మిగిలి ఉన్న 20 శాతం పనులు పూర్తిచేయడానికి పురపాలక, సీఆర్‌డీఏ అధికారులు ఇదిగో.. అదిగో అంటూ అయిదేళ్లుగా కాలయాపన చేస్తున్నారు. వంతెనకు ఇరువైపులా అప్రోచ్‌ రోడ్లు, డ్రెయిన్లు, సౌండ్‌బ్యారియర్లను ఇంకా ఏర్పాటు చేయాల్సి ఉంది. వీటిని పూర్తి చేయడానికి రూ.2 కోట్లు అవసరం కాగా.. నిధులను పురపాలక, సీఆర్‌డీఏ భరిస్తాయని ఆయా శాఖల అధికారులు అంగీకరించారు. పెండింగ్‌లో ఉన్న డ్రైనేజీ పనులు పూర్తయితే వంతెనపై మరో రూ.10 లక్షలతో రోడ్డు నిర్మించడానికి కళాశాల యాజమాన్యం సిద్ధంగా ఉంది. కానీ ప్రభుత్వం ఇంకా నిర్వహించాల్సిన 20 శాతం పనులు పూర్తి చేయకపోవడంతో వారధి కట్టినా కూడా ప్రజలకు అందుబాటులోకి రాకుండాపోయింది. అలాగే ఈ మొత్తం పనులన్నీ పూర్తయితే వంతెనపై నుంచి వందడుగుల రోడ్డు వరకు రూ.40లక్షలతో సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటుకు నిధులు సిద్ధంగా ఉన్నాయి. కానీ పెండింగ్‌ పనులతో వీటికి లింకు ఉండడంతో ఇది కూడా కార్యరూపం దాల్చలేదు.

పూర్తయితే ట్రాఫిక్‌ సమస్యకు తెర

వెలగపూడి శంకరబాబు

నిత్యం ట్రాఫిక్‌ రద్దీతో బందరు రోడ్డు కిటకిటలాడుతుంది. దీనికి  సమాంతరంగా ఉన్న పంటకాలువ.. ఈ రహదారికి అనుసంధానమై ఉంటుంది. ఎన్టీఆర్‌ సర్కిల్‌ నుంచి ఈ వంతెన మీదుగా వందడుల రోడ్డు వరకు వాహనాలు ప్రయాణించవచ్చు. బందరు రోడ్డు కన్నా ఈ రోడ్డులో ట్రాఫిక్‌ తక్కువగా ఉంటుంది. మొత్తం ఈ వారధి పూర్తయితే దాదాపు 50 వేల మంది ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది.

మరీ ఇంత జాప్యమా?

అనుమోలు ప్రభాకరరావు, పోరంకి

వంతెన పనులు ఎప్పుడో పూర్తి కావాల్సింది. 20 శాతం మిగులు పనులు పూర్తి చేయడానికి అయిదేళ్ల సమయం సరిపోలేదంటే ఇది వైకాపా ప్రభుత్వ వైఫల్యమనే చెప్పాలి. వేలాది మందికి ప్రజలకు ఉపయోగపడే సమస్యను విస్మరించడం దారుణం. ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని