logo

సర్వే అన్నారు.. భూవిస్తీర్ణం తగ్గించారు

భూ సంబంధిత సమస్యలన్నింటినీ శాశ్వతంగా పరిష్కరించడంతోపాటు వివాదాలు తలెత్తకుండా హద్దులు ఏర్పాటు చేసి అందరికీ మళ్లీ భూహక్కు పత్రాలు అందిస్తాం. దీని కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వినియోగిస్తున్నాం.

Published : 27 Apr 2024 02:59 IST

గందరగోళంగా జగనన్న శాశ్వత భూహక్కు - భూరక్ష

భూమికి హద్దులు ఏర్పాటు చేస్తున్న సిబ్బంది

భూ సంబంధిత సమస్యలన్నింటినీ శాశ్వతంగా పరిష్కరించడంతోపాటు వివాదాలు తలెత్తకుండా హద్దులు ఏర్పాటు చేసి అందరికీ మళ్లీ భూహక్కు పత్రాలు అందిస్తాం. దీని కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వినియోగిస్తున్నాం. ఈ ప్రక్రియ పూర్తయితే భూ సమస్యలే ఉండవు

సీఎం జగన్‌మోహన్‌రెడ్డితోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పిన మాటలు ఇవి.

ఏం సర్వేనో ఏమో...మా దస్తావేజుల్లో ఉన్న భూములు కంటే తగ్గించి ఇవిగో పత్రాలు అంటున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా ఇదిగో డిప్యూటీ తహసీల్దారును పంపిస్తున్నాం. సమస్య పరిష్కరిస్తారు అని చెప్పడమే తప్ప ఇంతవరకు పట్టించుకున్న దాఖలాలు లేవు.

ఇది రైతుల ఆవేదన

మచిలీపట్నం(గొడుగుపేట), న్యూస్‌టుడే: ప్రభుత్వం  చేపట్టిన భూహక్కు...భూరక్ష పథకం అమల్లో తలెత్తుతున్న సమస్యలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించే క్రమంలో చూపుతున్న నిర్లక్ష్యం కారణంగా పలువురు రైతులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయడంతోపాటు స్పందనలో అర్జీలు కూడా అందజేశారు. అయినా వారి గోడు పట్టించుకున్న వారు లేరు.

కొందరికే పత్రాలు

బందరు, పెడన నియోజకవర్గాల్లోని మండలాల్లో మూడు విడతలుగా పలు గ్రామాలను ఎంపిక చేసి సర్వే పూర్తి చేసినా అందరికీ భూహక్కు పత్రాలు పంపిణీ చేయలేదు. బంటుమిల్లి మండలంలోని కొర్లపాడు, రామవరపుమోడి, సాతులూరు, బర్రిపాడు, పెద పాండ్రాక, మద్దేటిపల్లిలోసర్వే పూర్తి చేయగా కొర్లపాడులో మాత్రమే భూహక్కు పత్రాలు పంపిణీ చేశారు. గూడూరు మండలంలో మొత్తం 10 గ్రామాల్లో సర్వే పూర్తి చేయగా ఇప్పటివరకు 5 గ్రామాల్లో మాత్రమే పూర్తిస్థాయిలో భూహక్కు పత్రాలు పంపిణీ చేశారు. కృత్తివెన్ను మండలంలో కొమళ్లపూడి, నీలిపూడి, ఎండపల్లి, మాట్లాం, చందాల, గరిశపూడి, తాడివెన్ను గ్రామాల్లో సర్వే పూర్తి చేయగా ఇక్కడ కూడా పూర్తిస్థాయిలో పత్రాలు పంపిణీ జరగకపోగా వివిధ సమస్యలు కూడా పరిష్కరించలేదని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. బందరు మండలంలోని పొట్లపాలెం, కొత్తపూడి గ్రామాల్లో సర్వే పూర్తి చేసినా హుస్సేన్‌పాలెంలో ఇంకా 13వ నోటిఫికేషన్‌ జారీ చేయకపోవడంతో ప్రక్రియ ఆగిపోయింది. పెడన మండలంలోని వివిధ గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.

ఫిర్యాదులకు పరిష్కారం ఏదీ?..

సర్వే పూర్తయిన గ్రామాల్లో ప్రజల నుంచి వస్తున్న అభ్యంతరాలను అధికారులు పట్టించుకోవడం లేదని వివిధ ప్రాంతాల ప్రజలు వాపోతున్నారు. బందరు మండలం పొట్లపాలెంలో నెలకొన్న సమస్యలపై ఇప్పటికీ పలువురు తమ సమస్యలపై అదికారులకు అర్జీలు అందిస్తూనే ఉన్నారు.ఇటీవల కూడా ఆ గ్రామానికి చెందిన వారు కలెక్టరేట్‌లో నిర్వహించిన స్పందనలో అర్జీ అందించి నిరసన తెలియజేశారు. బంటుమిల్లి మండలంలోని పలువురు రైతులు సర్వే అనంతరం తమ భూమి విస్తీర్ణం తగ్గిందని అధికారులకు ఫిర్యాదు చేశారు. పెడన మండల పరిధిలోని కమలాపురం, కొంగంచర్ల తదితర గ్రామాల్లో రైతులు కూడా ఇదే సమస్యలతో ఆందోళన చెందుతున్నారు. కొన్ని చోట్ల భూ యజమానులు లేకుండానే వారి కుటుంబ సభ్యులో తెలిసినవాళ్లనో పిలిచి హద్దులు ఏర్పాటు చేసేస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.

48 సెంట్లు తగ్గింది

మా కుటుంబ సభ్యుల్లో ఒకరికి తొమ్మిది ఎకరాలకుపైగా వ్యవసాయభూమి ఉంటే సర్వే అనంతరం 48 సెంట్లు తగ్గింది. అదేంటి అంత విస్తీర్ణం తగ్గిందని అధికారులను అడిగితే ఇంతవరకు స్పందించిన దాఖలాలు లేవు. ఇదిగో వస్తాం మళ్లీ కొలతలు వేస్తామని కొందరు అంటుంటే, ఇంకొంతమంది సిబ్బంది ఎకరానికి 5సెంట్లు తగ్గడం సాధారణమే మీకున్న భూమి అంతే అని చెబుతున్నారు. ఏం చేయాలో తెలియడం లేదు.

రైతు, సాతులూరు, బంటుమిల్లి మండలం

సమస్య పరిష్కరించ లేదు

మాకున్న భూమిలోని ఓ సర్వే నెంబర్‌లో ఎకరం లోపు భూమి 26 సెంట్ల విస్తీర్ణం తగ్గించి హద్దులు ఏర్పాటు చేసి వెళ్లిపోయారు. అదేమని అడిగితే అధికారులు మాట్లాడడం లేదు. పలుమార్లు వచ్చి పొలం పరిశీలించి వెళ్లారు. మిగిలిన భూమి అప్పగించలేదు. సర్వే నెంబరులో ఉన్న భూమి మొత్తాన్ని కొలతలు వేసి మాది మాకు కేటాయించాలని కలెక్టరేట్‌లో కూడా అర్జీ అందించాం. అయినా సమస్య పరిష్కారం కాలేదు.

రైతు, పొట్లపాలెం, బందరు మండలం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని