logo

జడ్పీ బడ్జెట్‌ రూ.175.88 కోట్లు

2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.175.88 కోట్ల బడ్జెట్‌కు జడ్పీ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ ఆమోదం లభించింది.

Published : 30 Mar 2023 03:09 IST

మాట్లాడుతున్న ఛైర్‌పర్సన్‌ హారిక, వేదికపై వైస్‌ ఛైర్మన్‌లు, సీఈవో

కలెక్టరేట్‌(మచిలీపట్నం), న్యూస్‌టుడే: 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.175.88 కోట్ల బడ్జెట్‌కు జడ్పీ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ ఆమోదం లభించింది. ఛైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక అధ్యక్షతన బుధవారం జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో  ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ప్రతిపాదనలను సభ్యులు ఆమోదించారు. ఈ సందర్భంగా ఛైర్‌పర్సన్‌ మాట్లాడుతూ గడచిన ఆర్థిక సంవత్సరం మిగులు రూ.175.88 కోట్లను రాబోయే ఆర్థిక సంవత్సరానికి ప్రారంభ అంచనాగా చెబుతూ ఆదాయ అంచనా 1,354.25 కోట్లు, ఖర్చు సవరణ అంచనా రూ.1,389.24 కోట్లుగా వివరించి రూ.140.88 కోట్లు మిగులు అంచనాగా చూపారు. ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 15, 438 ప్రకారం బడ్జెట్‌ అంచనాలు రూపొందించామన్నారు.

సర్వ సభ్య సమావేశానికి ముందు స్థాయీ సంఘ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఛైర్‌పర్సన్‌ మాట్లాడుతూ రాబోయే వేసవిలో జిల్లాలో ఎక్కడా తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు చేయాలని చెబుతూ సమావేశాల్లో సభ్యులు ఎత్తిచూపిన సమస్యలకు తక్షణ పరిష్కారాలు చూపాలని అధికారులకు స్పష్టం చేశారు. గ్రామదర్శిని కార్యక్రమం నిర్వహించే రోజున స్థానిక జడ్పీటీసీ సభ్యులకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. డ్వాక్రా సంఘాల రుణాల పేరుతో బుక్‌కీపర్లు, సీసీలు, ఏపీఎంలు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారంటూ సభ్యులు చేసిన ఫిర్యాదుపై స్పందిస్తూ అధికారులు ఇటువంటి చర్యలను ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించవద్దని హెచ్చరించారు. ఆరోపణలున్న చోట విచారణ నిర్వహించి బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలని డీఆర్డీఏ పీడీకి సూచించారు. అకాల వర్షాల కారణంగా నూజివీడు పరిసర ప్రాంతాల్లో మామిడి పంట దెబ్బతిందని స్థానిక జడ్పీటీసీ సభ్యుడు చెప్పగా,  పంట నష్టంపై ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించినట్లు అధికారులు తెలిపారు. ఆఫ్‌లైన్‌లో తోలిన ధాన్యానికి నగదు చెల్లించలేదని, కొన్ని పాఠశాలల్లో ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారని, పునాదిపాడు, ఈడ్పుగల్లు పాఠశాలల పరిధిలో కొందరు విద్యార్థులు గంజాయి తాగి తోటి విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ సంబంధిత సభ్యులు సమావేశం దృష్టికి తీసుకువచ్చి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయా స్థాయీ సంఘాల పరంగా స్థానికంగా ఉన్న సమస్యలను సభ్యులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. వైస్‌ ఛైర్‌పర్సన్‌లు గరికపాటి శ్రీదేవి, గుడిమళ్ల కృష్ణంరాజు, జడ్పీ సీఈవో జి.శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు, జడ్పీటీసీ సభ్యులు సమావేశంలో పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని