logo

కన్నేస్తే కొట్టేస్తాం.. కనిపిస్తే కట్టేస్తాం!

గత ఐదేళ్లుగా ప్రజలకు అవసరమైన రహదారులు, భవనాల నిర్మాణాల కంటే.. వైకాపా కార్యాలయాలు, నేతల సొంత అవసరాల కోసం ఉపయోగపడే వాటిపైనే పాలకులు అధిక శ్రద్ధ పెట్టారు. గుంతలదారులతో ఇబ్బంది పడుతున్నామని.. ప్రజలు గగ్గోలు పెడుతున్నా..

Published : 07 Mar 2024 05:42 IST

ప్రజావసరాలకు గజం స్థలం కూడా ఇవ్వరు
వైకాపా కార్యాలయాలకు మాత్రం అడ్డుండదు
ఈనాడు, అమరావతి - విద్యాధరపురం, న్యూస్‌టుడే

త ఐదేళ్లుగా ప్రజలకు అవసరమైన రహదారులు, భవనాల నిర్మాణాల కంటే.. వైకాపా కార్యాలయాలు, నేతల సొంత అవసరాల కోసం ఉపయోగపడే వాటిపైనే పాలకులు అధిక శ్రద్ధ పెట్టారు. గుంతలదారులతో ఇబ్బంది పడుతున్నామని.. ప్రజలు గగ్గోలు పెడుతున్నా.. స్పందించేవాళ్లు లేరు. అదే.. ఆ ప్రాంతంలో ఓ వైకాపా కార్యాలయం ప్రారంభిస్తే చాలు.. రాత్రికి రాత్రి రోడ్లు వేసేస్తున్నారు. వైకాపా ప్రజాప్రతినిధులు, నేతలు ఏం చెబితే.. అదే తమకు వేదవాక్కులా అధికారులు వ్యవహరిస్తున్నారు. ప్రజాధనాన్ని అధికార పార్టీ నేతల స్వప్రయోజనాల కోసమే వెచ్చిస్తూ.. వారి సేవలో తరిస్తున్నారు. విజయవాడ, మచిలీపట్నం నగరాల్లో ప్రధాన రహదారుల్లో 90 శాతం గత తెదేపా ప్రభుత్వంలో వేసినవే. రెండు జిల్లాల్లో కొత్తగా వెలసిన కాలనీల్లో.. ఈ ఐదేళ్లలో కనీసం రహదారులు, మంచినీటి పైప్‌లైన్లు, డ్రెయినేజీ వేసేవాళ్లు కూడా లేకుండాపోయారు. విజయవాడకు నాలుగు వైపులా.. శివార్లలో కొత్త కాలనీలు అనేకం ఉన్నాయి. ఈ కాలనీల్లో వేల మంది నివసిస్తున్నారు. వీళ్లంతా గత ఐదేళ్లుగా మట్టి దారుల్లో పడుతూ లేస్తూ ప్రయాణించాల్సిన దుస్థితి.

జనం బాధలు మాకెందుకు?..

విజయవాడ డెయిరీకాలనీలో నిరుపయోగంగా ఉన్న నగరపాలక సంస్థకు చెందిన 300 గజాల స్థలాన్ని.. వేలమందికి ఉపయోగపడే భవనం కట్టేందుకు కేటాయించాలని.. ఏళ్లుగా స్థానికులు వేడుకుంటున్నా, అర్జీలు పెట్టినా అధికారులు స్పందించలేదు. కానీ.. ఓ వైకాపా నేత సిఫార్సులతో ఇదే స్థలాన్ని లీజు పేరుతో ఓ ప్రైవేటు సంస్థకు ఎలాంటి అద్దె చెల్లించకుండానే వాడుకునేలా కట్టబెట్టేశారు.


విజయవాడ సెంట్రల్‌ వైకాపా ఇన్‌ఛార్జిగా ఎమ్మెల్యే వెలంపల్లిని నియమించడంతో ఇటీవల తన కార్యాలయాన్ని ఆరంభించారు. ఇలా కార్యాలయం పెట్టగానే.. ఆ ముందు రోజే.. అధికారులు చకచకా మట్టిరోడ్డు చదును చేసి కంకర పోశారు. అక్కడ రహదారి వేయాలని.. స్థానికులు చాలాకాలంగా కోరుతున్నా.. ఎవరూ పట్టించుకోలేదు. వైకాపా కార్యాలయం రాగానే.. ఆగమేఘాల మీద స్పందించి, ప్రస్తుతం సీసీ రోడ్డు వేసే పనిలో ఉన్నారు.


విజయవాడలో ప్రజోపయోగ నిర్మాణాల కోసం ఒక్క గజం స్థలం ఇవ్వడానికి కూడా నగరపాలక సంస్థ, వైకాపా ప్రజాప్రతినిధులు ముందుకురావడం లేదు. అదే.. వైకాపా కార్యాలయం కోసం విజయవాడ పశ్చిమ పరిధిలో లేబర్‌కాలనీలో ఎకరంపైగా స్థలాన్ని.. నామమాత్ర లీజు చెల్లించేలా 33 ఏళ్లకు రాయించుకున్నారు. ఆ స్థలాన్ని పార్కు నిర్మాణానికి గత పాలకులు దాచి ఉంచారు. కనీసం గజం స్థలం కూడా పార్కు కోసం ఉంచకుండా.. అంతా మాకే కావాలని లాగేసుకున్నారు.


మొత్తం తమకే కావాలని..

ఆర్టీసీ స్థలం ప్రహరీని ఇలా కూల్చేసినా పట్టింపు లేదు

విజయవాడ పశ్చిమ పరిధి విద్యాధరపురం సితార జంక్షన్‌ వద్ద లేబర్‌కాలనీలో 1.10 ఎకరాల స్థలాన్ని గత పాలకులు ప్రజావసరాల కోసం దశాబ్దాలుగా కాపాడుతూ వచ్చారు. ఇక్కడ పార్కు కట్టాలని గతంలో నిర్ణయించారు. కానీ.. వైకాపా అధికారంలోకి వచ్చాక స్థలంపై ఎమ్మెల్యే వెలంపల్లి కన్నుపడింది. అడ్డదారిలో అనుమతులన్నీ తెప్పించుకుని వైకాపా కార్యాలయం కట్టడం ఆరంభించారు. ఇది దారుణమని.. స్థానికులు గగ్గోలు పెడుతున్నా.. వినేవారే లేరు. రూ.50 కోట్ల విలువైన స్థలాన్ని ఏటా రూ.వెయ్యి నామమాత్ర అద్దెతో 33 ఏళ్లు లీజుకు రాయించుకున్నారు. తొలుత లేబర్‌కాలనీలో 3,041.27 చదరపు గజాల స్థలాన్ని వైకాపా కార్యాలయానికి కావాలన్నారు. ఆ తర్వాత.. ఖాళీగా ఉన్న మొత్తం స్థలం తమకే కావాలని.. 1.10 ఎకరాలు లీజు పేరుతో సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం వైకాపా కార్యాలయం కట్టడానికి అడ్డుగా ఉందని పక్కనే ఉన్న ఆర్టీసీ స్థలంలో ప్రహరీని కూల్చేశారు. అయినా.. ఒక్క అధికారీ స్పందించలేదు. అదే సాధారణ ప్రజలు ఇటు నడవడానికి కూడా వీల్లేదని.. చెరువు సెంటరు వద్ద, ఆర్టీసీ వర్కుషాపు సమీపంలో రెండు గేట్లను గతంలో ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఏకంగా ప్రహరీ కూల్చేసినా అధికారులు నోరు తెరవడం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని