logo

నిన్నుమించిన ఘనులు.. నీతిమాలిన పనులు!

ఇందు కలదు.. అందు లేదనే సందేహం వలదు.. ఏ నియోజకవర్గంలో చూసినా మట్టి అక్రమార్కులే. నాకేం తక్కువ.. నేనెందుకు తినకూడదని ఒకరిని మించి ఒకరు మట్టిని బొక్కారు.

Published : 21 Apr 2024 06:29 IST

రూ.వేల కోట్ల మట్టిని బొక్కేశారు
ఉమ్మడి జిల్లాలో వైకాపా నేతల దందా
ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి
ఈనాడు, అమరావతి- న్యూస్‌టుడే, గన్నవరం గ్రామీణం

‘‘గనుల అక్రమ తవ్వకాలపై పూర్తి నివేదిక ఇవ్వండి. బాధ్యులపై కలెక్టర్‌, ఎస్పీ (ఎన్టీఆర్‌ జిల్లా సీపీ) క్రిమినల్‌ కేసులు పెట్టాలి. పోలవరం కాలువ కట్టలపైనా నివేదిక ఇవ్వండి’’

ఎన్జీటీ ఆదేశించింది ఇలా..

ఈ మేరకు అక్రమ దందాపై ఒక్క క్రిమినల్‌ కేసూ లేదు. కానీ రూ.వేల కోట్ల సంపద ఆవిరైందనడానికి నిదర్శనం పై చిత్రమే. కొన్ని లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి రెండు తాటిచెట్ల లోతున తవ్వారు. ఇలాంటి ఉదాహరణలు ఉమ్మడి జిల్లాలో అనేకం.!

కొత్తూరు తాడేపల్లి పరిసరాల్లో, అటవీభూముల్లో అక్రమ మైనింగ్‌

ఇందు కలదు.. అందు లేదనే సందేహం వలదు.. ఏ నియోజకవర్గంలో చూసినా మట్టి అక్రమార్కులే. నాకేం తక్కువ.. నేనెందుకు తినకూడదని ఒకరిని మించి ఒకరు మట్టిని బొక్కారు. మట్టి దాహంతో వీరు... జాతీయ రహదారి ప్రాజెక్టుల నిర్మాణ గుత్త సంస్థలతో బేరాలాడి.. బెదిరించి మరీ సరఫరా చేశారు. తప్పని పరిస్థితుల్లో బడా సంస్థలూ తలూపాయి. ఖజానాకు కన్నమేసి.. రూ.కోట్లు వెనకేశారు. అధికార పార్టీ మంత్రులు, ప్రజాప్రతినిధులు, మాజీలు, ఇతర జిల్లాల నేతలు, వారి బంధుగణం.. అనుచరులు, బినామీలు.. జిల్లాను కమ్మేసి కుమ్మేశారు. అవినీతి, అరాచకాల్లో అధినేతను మించిన వీరంతా ఇప్పుడు ఓట్ల కొనుగోలుకు నోట్లు కుమ్మరిస్తున్నారు.

భార్య పదవే అర్హత...

అతను.. గుత్తేదారు. అతని భార్య విజయవాడ నగరపాలిక ప్రజాప్రతినిధి. ఇంకేం గుబ్బలగుట్టపై కన్నేశారు. అనుమతి లేకుండా జిలిటెన్‌ స్టిక్స్‌తో పేలుళ్లు చేపట్టగా సమీప ఇళ్లు బీటలు వారాయి. జగనన్న లేఔట్‌ల మెరకకు, ఇళ్ల పునాదులకు మట్టి కావాలని వీఎంసీ అనుమతితో గుట్ట తవ్వి.. లక్షల క్యూబిక్‌ మీటర్ల గ్రావెల్‌ ప్రైవేటు వెంచర్లకు పంపారు.

ముఖ్య నేతకు సన్నిహితుడు మరి

పెనమలూరు పరిధిలో ఓ గుత్తేదారుకు టిప్పర్లు ఉన్నాయి. ప్రజాప్రతినిధికి సన్నిహితుడు. అంతే.. చెరువుల వేలం లేదు.. గుడ్‌విల్‌ లేదు. అనధికారికంగా గత నాలుగైదు నెలలుగా మట్టితవ్వకాలు జరిపి ప్రైవేటు వెంచర్లకు తరలిస్తున్నారు.

ఇలా కూడా వేలం వేస్తారు..

సాధారణంగా చేపలు పట్టడానికి చెరువులు వేలం వేస్తారు. కానీ.. పమిడిముక్కల మండలం గురజాడలో మట్టి తవ్వకానికి వేలం వేశారు. రూ.8 లక్షలకు వైకాపా నాయకుడు పాడుకున్నారు. అక్కడ రూ.30 లక్షల విలువైన మట్టి వస్తుందని గ్రామస్థుల వాదన. ఇలాంటి చెరువులు ఎన్నో..!

నెలకే కళ్లు తిరిగేలా...

మట్టే కదా ఏముందిలే.. అని ఓ ఎమ్మెల్యే తన అనుచరులను తవ్వుకోమన్నారు. కేవలం నెలరోజుల్లోనే ఓ చోటా నాయకుడు రూ.కోట్లు వెనకేసి... నాలుగు జేసీబీలు.. పది టిప్పర్లు కొనేశారు. విషయం తెలిసి వైకాపా ఎమ్మెల్యే షాక్‌ అయ్యారు. నాటి నుంచి తన అనుమతి లేనిదే.. తవ్వొద్దని అధికారులకు అనధికార ఆదేశాలిచ్చారు.

కన్నేయడం.. కొల్లగొట్టడం..

ఉమ్మడి కృష్ణా జిల్లాలో చిన్నాచితకా కలిపి... మొత్తంగా 650 చెరువుల్లో తవ్వకాలు సాగిస్తున్నారు. గుడివాడ, బందరు, పెడన, అవనిగడ్డ, పామర్రు, గన్నవరం, పెనమలూరులో వైకాపా నాయకులు, ఎమ్మెల్యేల బినామీలదే మట్టి దందా. మైలవరం, నందిగామ, జగ్గయ్యపేటల్లోనూ వారిదే ఆధిపత్యం.

కొత్తూరు తాడేపల్లిలో..!

కొత్తూరు తాడేపల్లిలో గుంటూరు జిల్లా ప్రజాప్రతినిధుల అనుచరులు పడ్దారు. అనుమతులు ఉన్నాయని ఇష్టారీతిన తవ్వారు. ఇక్కడ కొండలన్నీ దాదాపు కరిగాయి. ఇటీవల ఓ మంత్రి అనుచరుడు కాగిత ఇన్‌ఫ్రా పేరుతో జగనన్న కాలనీల మెరక అని తహసీల్దారు అనుమతులతో జక్కంపూడి కొండలను తవ్వేశారు. షాబాద్‌వాసులకు నెలకు రూ.5 లక్షలు గుడ్‌విల్‌ ఇచ్చేలా మాట్లాడారు. జక్కంపూడి కొండలను ఖాళీ చేస్తున్నారు. రెవెన్యూ, జల వనరుల అధికారులు వెళితే తవ్వకాలు కనిపించవు. తవ్విన ఆనవాళ్లు, పొదల్లో యంత్రాలు ఉన్నా.. తవ్వుతుంటేనే పట్టుకుంటామని తేల్చేస్తున్నారు. అక్రమ తవ్వకందారులు తాను మంత్రి ఓఎస్డీనని చక్రం తిప్పుతున్నారు. ఎస్సీ భూములు లీజుకు తీసుకుని మట్టి దందా సాగిస్తున్నారు. అటవీ భూములనూ తవ్వేస్తున్నారు.

వెదురుపావులూరులో మట్టి దందా..

కొండలన్నీ మాయం..!

గన్నవరం పరిధిలో భారీ కొండలన్నీ మాయమయ్యాయి. ప్రభుత్వ బంజరులు భారీ చెరువుల్లా మారాయి. అయిదేళ్లలో కొన్ని రూ.వందల కోట్ల విలువైన మట్టి కొల్లగొట్టి.. కొండపావులూరు, వెదురుపావులూరు, ఇతర చిన్నగుట్టలకు గుండ్లు కొట్టారు. నాడు జిల్లా మంత్రిగా ఉన్న ఓ నేత ఇష్టానుసారం అనుమతి తీసుకుని అనుచరులకు పందేరం జరిపారు. గన్నవరం, బాపులపాడు, ఉంగుటూరు పరిధిలో ప్రభుత్వ బంజరులో మట్టి కొల్లగొట్టారు.

50 వేల క్యూబిక్‌ మీటర్ల చొప్పున అనుమతి తీసుకుని లక్షల క్యూబిక్‌ మీటర్లు లేపారు. ఇక్కడే నాటి మంత్రి, మరో ఇద్దరు ఎమ్మెల్యేలు, వారి అనుచరులతో తవ్వేశారు. పక్క నియోజకవర్గ ఎమ్మెల్యే సోదరుడు లారీలు కొని తోలారు. జాతీయ రహదారులకు, ప్రైవేటు వెంచర్లకు రూ.వెయ్యి కోట్ల విలువైన మట్టి తరలించారు.

మంత్రి ఆధ్వర్యంలోనే అరాచకం... బఫర్‌ జోన్‌గా ఉన్న జలవనరుల శాఖ భూముల్లోనూ తవ్వేశారు. పోలవరం కట్టలు 64 కిమీ విస్తరించి ఉన్నాయి. కట్టల్లో మట్టి ఉందని నామమాత్ర అనుమతులతో రూ.కోట్లు స్వాహా చేశారు. తొలి రెండేళ్లలో మట్టి తరలింపునకు అనుమతి ఇచ్చిన జలవనరుల శాఖ తర్వాత ఆపింది. గుంటూరు జిల్లా మంత్రి తన ఓఎస్డీ అధికారులపై ఒత్తిడి పెంచి అనధికార అనుమతి ఇచ్చేశారు. ఎవరైనా ఇంజినీర్లు అడ్డుకుంటే బదిలీ వేటు వేశారు. వెలగలేరు నుంచి ఏలూరు జిల్లా వరకు ఉన్న కట్ట మొత్తం మాయమైంది. కట్టపై తవ్వకాలు స్పష్టంగా ఉన్నా ఫిర్యాదులు లేవు. పోలీసులు కనిపెట్టరు. గనుల శాఖ రాయల్టీ వసూలు చేయదు.

రాజీలేని పోరాటం...: జములయ్య, కొత్తూరు తాడేపల్లి

మా ఊళ్లో మట్టి తవ్వకాలు అడ్డుకునేందుకు పోరాటం చేశాం. సబ్‌ కలెక్టర్‌ పరిశీలనకు వచ్చారు. కలెక్టర్‌నూ తీసుకురాగా.. కొంత నియంత్రించాం. ఇంకా మట్టి దందా సాగుతోంది. వైకాపా నాయకులు అడ్డగోలుగా ఎన్జీటీ ఆదేశాలు ధిక్కరించారు. లోకాయుక్తకు ఫిర్యాదు చేశాం. అటవీ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినా అమలు చేయలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని