logo

ఉద్యోగుల ఓట్లకూ వైకాపా గాలం..!

ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలట్‌ వినియోగంలో తీవ్ర గందరగోళం నెలకొంది. వందల సంఖ్యలో ఉపాధ్యాయులు ఇబ్బందులకు గురయ్యారు. వారికి బ్యాలట్‌ విడుదల కాలేదు.

Updated : 06 May 2024 05:04 IST

రూ.5 వేల వరకు పంపిణీ
ఓటు వేసి వాట్సప్‌లో పెట్టాలని షరతు
ఈనాడు, అమరావతి

గూడూరుకు చెందిన ఉపాధ్యాయిని ఫారం-12 కింద పోస్టల్‌ బ్యాలట్‌ కోసం దరఖాస్తు చేశారు. ఆమె ఓటు విజయవాడలో ఉంది. ఆమె ఓటేసేందుకు ఆదివారం ఇందిరాగాంధీ స్టేడియానికి రాగా బ్యాలట్‌ రాలేదని అధికారులు సెలవిచ్చారు. గూడూరు మండలం ఉన్న నియోజకవర్గంలోనే విడుదల అవుతుందని చెప్పడంతో ఆమె తీవ్ర నిరాశతో వెనుదిరిగారు.


పామర్రులో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగి గన్నవరంలో ఎన్నికల విధులకు హాజరుకావాల్సి ఉంది. ఆ ఉద్యోగి ఫారం-12 కింద ఓటు హక్కు కోసం దరఖాస్తు చేశారు. విజయవాడ సెంట్రల్‌ పరిధిలో ఉంది. కానీ అక్కడి తహసీల్దార్‌ ఆయన బ్యాలట్‌ పంపలేదు. దీంతో ఆ ఉద్యోగి అటుతిరిగి తిరిగి బందరు పోవాలని అధికారులు సూచించారు.

ద్యోగుల పోస్టల్‌ బ్యాలట్‌ వినియోగంలో తీవ్ర గందరగోళం నెలకొంది. వందల సంఖ్యలో ఉపాధ్యాయులు ఇబ్బందులకు గురయ్యారు. వారికి బ్యాలట్‌ విడుదల కాలేదు. ఎన్నికల విధుల్లో ఉన్న వారు ఆదివారం పోస్టల్‌ బ్యాలట్‌ వేయాల్సి ఉండడంతో భారీగా పోటెత్తారు. అత్యవసర సేవలు అందించే శాఖల ఉద్యోగులూ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎన్టీఆర్‌ జిల్లాలో ఒక విధానం, కృష్ణా జిల్లాలో ఒక విధానం పాటించడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

నందిగామలో తెదేపా అభ్యర్థి తంగిరాల సౌమ్యను పోస్టల్‌ పోలింగ్‌ కేంద్రంలోకి అనుమతించలేదు. మరోవైపు వైకాపా ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్‌ను కేంద్రంలోకి వదలగా.. ఆయన అనుచరులతో వచ్చి హల్‌చల్‌ చేశారు. విజయవాడలో ఇందిరాగాంధీ క్రీడా మైదానంలో కేంద్రానికి, సిద్ధార్థ, కేబీఎన్‌ కళాశాల వద్దకు అధిక సంఖ్యలో ఉద్యోగులు వచ్చారు. ఎన్టీఆర్‌ జిల్లాలో రెండో రోజు దాదాపు 5 వేల మంది ఓటు వేశారు. ఒక్క ఐజీఎం కేంద్రంలోనే 1,500 మంది పైగాఓట్లు వేశారు. తమ బ్యాలట్‌ రాలేదని పలువురు ఉద్యోగినులు కలెక్టర్‌ డిల్లీరావుకు ఫిర్యాదు చేశారు. ఎండలో ఇబ్బంది పెడుతున్నారనీ.. సాంకేతిక సమస్యలని చెబుతున్నారని కంటతడి పెట్టారు.

భారీగా బేరసారాలు...

విజయవాడ సెంట్రల్‌లో పోస్టల్‌ కాలనీలో ఓ ఉద్యోగికి వైకాపా నాయకులు రూ.5 వేలు ఇవ్వబోగా.. అతను వద్దనడంతో వైకాపా శ్రేణులు తీవ్రంగా దాడి చేసి గాయపరిచాయి. ఈసారి ఉద్యోగులు ఎక్కువ శాతం మంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. దీంతో వారిని మభ్య పెట్టి ఓట్లు కొనాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటుకు రూ.5 వేలు చొప్పున వైకాపా వారు పంపిణీ చేసినట్లు తెలిసింది. కొంతమంది దీన్ని తిరస్కరించారు. పోస్టల్‌ బ్యాలట్‌లో ఎక్కువ శాతం ఉపాధ్యాయులు ఉండటం, సీపీఎస్‌ నేపథ్యంలో జరిగిన ఆందోళనలో వారిపై వైకాపా ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంతో తమకు అనుకూలంగా ఉండరనే నెపంతో బ్యాలట్‌ ఇవ్వడంలేదని ఆరోపిస్తున్నారు. వారినే ఇబ్బందులకు గురి చేశారు. విజయవాడ లయోలా కళాశాలలో ఉద్యోగులకు వైకాపా నాయకులు డబ్బులు పంచినట్లు తెలిసింది. ఇందిరాగాంధీ స్టేడియం బయట వైకాపా నాయకులు కనిపించారు. విజయవాడ సెంట్రల్‌కు సిద్ధార్థ ఆడిటోరియం వద్ద పంచారని తెలిసింది. నందిగామలోనూ ప్రలోభాలకు గురి చేశారు.

ఫొటో తీసి పంపాల్సిందే..

అధికార పార్టీకే ఓటు వేసినట్లు చరవాణిలో ఫొటోలు తీసి తమకు పంపాలని కొంతమంది సంఘాల నాయకులు ఉద్యోగులను ఆదేశించినట్లు తెలిసింది. బందరు నియోజకవర్గంలో వైకాపా నేతలు ఈ నిబంధన విధించినట్లు తెలిసింది. ఇక్కడ అధికార పార్టీ నేతల ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాల నేతలతో కలిసి రూ.5వేలు చొప్పున పంచినట్లు తెలిసింది. చిత్రాలు తీసి వాట్సప్‌ ద్వారా పంపేదుకు అంగీకరించిన వారికే పంపిణీ చేసినట్లు సమాచారం. దీనిపై కృష్ణా జిల్లా కలెక్టర్‌ డికే బాలాజీకి ఫిర్యాదు అందింది. సెంటర్‌లో పోలింగ్‌ ప్రక్రియ వీడియోగ్రఫీ చేయించాలని, ఉద్యోగుల సెల్‌ఫోన్లు అనుమతించవద్దని తెదేపా కార్యకర్త దిలీప్‌కుమార్‌ విజ్ఞప్తి చేశారు. రహస్య ఓటింగ్‌కు అవకాశం లేకుండా పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కొంతమంది నేతలు దగ్గరుండి ఓట్లు వేయించుకున్నారు. పెనమలూరులో ఓటుకు రూ.5వేల చొప్పున వైకాపా నేతలు పంపిణీ చేశారని తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని