logo

నాలుగు సార్లు గెలిపించినా.. నీరివ్వరేమని

గుడివాడలో గుక్కెడు మంచినీటి కోసం ప్రజలు అల్లాడిపోతున్నారంటే ఆ పాపం కచ్చితంగా ఎమ్మెల్యే కొడాలి నానిదే. ఈ నియోజకవర్గం నుంచి ఆయన్ను వరుసగా నాలుగుసార్లు శాసనసభకు పంపించిన ప్రజల కష్టాలకు ఏమాత్రం చలించకుండా బెల్లం కొట్టిన రాయిలా మిన్నకుండిపోయారు.

Published : 07 May 2024 05:39 IST

నీళ్లివ్వండి మహాప్రభో అంటూ జనం హాహాకారాలు
ఎక్కడికక్కడ నానిని నిలదీస్తున్న జనం
అమృత్‌ పథకానికీ గండికొట్టిన వైనం
ఈనాడు - అమరావతి

గుడివాడ ప్రజల ప్రాణావసరమైన చెరువుల కట్టలు పూర్తిగా బలహీనపడ్డాయి. వీటి మరమ్మతులకు రూ.    2.50 కోట్లిస్తే చాలని నిపుణులు ఏనాడో చెప్పారు.


ఈ నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన కొడాలి నాని ఒక్క పైసా కూడా తేలేకపోయారు.


ఫలితం ప్రజల గొంతెండిపోతోంది. నీళ్లివ్వండి మహాప్రభో అంటూ మహిళలు రోడ్డెక్కి నినదిస్తున్నా వినిపించుకున్నవారే లేరు

గుడివాడలో గుక్కెడు మంచినీటి కోసం ప్రజలు అల్లాడిపోతున్నారంటే ఆ పాపం కచ్చితంగా ఎమ్మెల్యే కొడాలి నానిదే. ఈ నియోజకవర్గం నుంచి ఆయన్ను వరుసగా నాలుగుసార్లు శాసనసభకు పంపించిన ప్రజల కష్టాలకు ఏమాత్రం చలించకుండా బెల్లం కొట్టిన రాయిలా మిన్నకుండిపోయారు. ఆయన దెబ్బకు గుడివాడ ప్రజల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిపోయింది. వైకాపా ప్రభుత్వ హయాంలో రెండున్నరేళ్లు మంత్రిగానూ అధికారం వెలగబెట్టారు. అయినా.. గుడివాడలో ఒక్కటంటే ఒక్క సమస్యనూ పరిష్కరించలేదు. అత్యంత కీలకమైన ఆర్టీసీ బస్టాండ్‌, ఇళ్ల స్థలాలు, టిడ్కో గృహాలు, రహదారులు, తాగునీటి సమస్య సహా అన్నీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉన్నాయి. గతంలో ఉన్నదానికంటే తాగునీటి వెతలు మరింతగా పెరిగిపోయాయి. అందుకే నాని ప్రచారానికి వెళ్లిన ప్రతిచోటా మహిళలు నిలదీస్తూనే ఉన్నారు.  

గుడివాడ తాగునీటి అవసరాలు తీర్చే రెండు చెరువులను ఎమ్మెల్యే నాని పూర్తిగా వదిలేశారు. పెదఎరుకపాడులో 63 ఎకరాల్లో ఉన్న పాత చెరువుకు మూడేళ్ల క్రితం గండి పడింది. దీన్ని పూడ్చాల్సిన అధికారులు పట్టించుకోలేదు. ఎమ్మెల్యే నాని పత్తా లేకుండాపోయారు. 105 ఎకరాల్లో ఉన్న చెరువు కట్ట బలహీనంగా ఉంది. దీన్ని పూర్తిస్థాయిలో నీటితో నింపితే.. ఏ క్షణమైనా గండి పడే అవకాశం ఉంది. దీంతో అధికారులు నీటితో నింపకుండా వదిలేశారు. ఈ రెండు చెరువులను పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో తాగునీటిని నిల్వ చేసే అవకాశం లేక సమస్య తీవ్రస్థాయికి చేరుకుంది.


నిపుణుల మాట కూడా వినరా?

పెదఎరుకపాడు, ఇందిరానగర్‌, మందపాడు కొత్తకాలనీ, గుడ్‌మెన్‌పేట, ధనియాలపేట, బాపూజీనగర్‌, కార్మికనగర్‌ సహా గుడివాడ పట్టణంలోని చాలా కాలనీల్లో దాహం కేకలు మిన్నంటుతున్నాయి. చెరువుల్లో నీరు లేకపోవడంతో ఇప్పటికే అధికారులు రోజు విడిచి రోజు.. అది కూడా 10-15 నిమిషాలు మాత్రమే నీటిని ఇస్తున్నారు. వేసవి తీవ్రత మరింత పెరిగే కొద్దీ.. నీటి అవసరాలు మరింత ఎక్కువవుతాయి. ఇది తలచుకుని గుడివాడ ప్రజలు హడలిపోతున్నారు. రెండు చెరువుల నిర్వహణకు, పంపుహౌస్‌ల మరమ్మతులకు ఏటా మున్సిపాలిటీ నుంచి నిధులిస్తున్నా..  పనులు మాత్రం చేపట్టడం లేదు. వీటిని కూడా పక్కదారి పట్టిస్తుండడమే దీనికి కారణం. ఇప్పుడే నీళ్లు మురికిగా వస్తున్నాయని, మున్ముందు పరిస్థితి ఇంకెలా ఉంటుందోననే ఆందోళన నెలకొంది. ఈ చెరువులను పరిశీలించిన నిపుణుల బృందం.. ఇప్పటికే కట్టలు బలహీనంగా ఉన్నాయంటూ తేల్చి చెప్పింది. ఈ పనులకు రూ. 2.50 కోట్ల వరకూ వ్యయమవుతుందని అంచనా వేసింది. కానీ.. ఆ దిశగా ఇప్పటివరకూ చేపట్టిన చర్యలు లేవు.


ఇంటింటికీ కుళాయిలను గాలికొదిలేశారు..

మృత్‌ పథకంలో భాగంగా నాటి తెదేపా హయాంలో 2018లో ఇంటింటికీ కుళాయిలు ఏర్పాటు చేశారు. చెరువులున్నా.. ప్రజల తాగునీటి అవసరాల కోసం ఈ కుళాయిలు కూడా ఉండాలని నాటి తెదేపా ప్రభుత్వం భావించి.. నాగవరప్పాడు, గుడ్‌మెన్‌పేటలో రెండు ట్యాంక్‌ల నిర్మాణం తలపెట్టి 80 శాతం పనులను పూర్తి చేసింది. వీటి నుంచి కుళాయిలకు అనుసంధానం చేస్తే చాలు.. ప్రజల నీటి కష్టాలు తీరిపోయేవి. 2019లో ఎన్నికలు రావడం.. వైకాపా గద్దెనెక్కడంతో.. అమృత్‌ నీటి కుళాయిల పథకాన్ని ఎమ్మెల్యే కొడాలి నాని గాలికొదిలేశారు. అటు చెరువులనూ పట్టించుకోక.. ఇటు నల్లాలను వదిలేసి.. ప్రజలకు తీరని ద్రోహం చేశారు. ప్రజలు నీటి కోసం అల్లాడేలా చేశారు. ఇదే అదనుగా.. నీటిని అమ్ముకునే.. ప్లాంట్‌ల పంట పండుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని