logo

ఏళ్ల ఆశ.. నెరవేరక నిరాశ

నగర పాలక సంస్థలో ఎన్నో ఏళ్లుగా పని చేస్తున్న టైంస్కేలు వర్కర్లు (గతంలో ఎన్నెమ్మార్లు), ఒప్పంద కార్మికులు, పొరుగు సేవల సిబ్బందిని ప్రభుత్వం నమ్మించి మోసం చేసింది.

Updated : 17 May 2024 06:02 IST

టైంస్కేలు వర్కర్లకు దక్కని ఊరట
క్రమబద్ధీకరణకూ దూరమే

నగర పాలక సంస్థలో ఎన్నో ఏళ్లుగా పని చేస్తున్న టైంస్కేలు వర్కర్లు (గతంలో ఎన్నెమ్మార్లు), ఒప్పంద కార్మికులు, పొరుగు సేవల సిబ్బందిని ప్రభుత్వం నమ్మించి మోసం చేసింది. ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తామని చెప్పి.. వారందరినీ ఆంధ్రప్రదేశ్‌ అవుట్‌సోర్సింగ్‌ కార్పొరేషన్‌ (ఆప్కాస్‌) కిందకు నెట్టేసింది. ఫలితంగా సమాన పనికి సమాన వేతనం దక్కక వారంతా ఆర్థికంగా అల్లాడిపోతున్నారు.

న్యూస్‌టుడే - విజయవాడ నగరపాలక సంస్థ: నగరపాలక సంస్థలో గతంలో ఎన్నెమార్లుగా 206 మంది పని చేసేవారు. 2008లో నాటి ప్రభుత్వం వీరిని టైంస్కేలు ఉద్యోగులుగా మార్చి కొంత ఉపశమనం కలిగించింది. వీరందరినీ క్రమబద్ధీకరిస్తామని 2019 ఎన్నికలకు ముందు జగన్‌ హామీ ఇచ్చారు. గద్దెనెక్కాక అనేక షరతులను విధించి వారిని గాలికి వదిలేశారు. మూడు దశాబ్దాలుగా విధులు నిర్వర్తిస్తున్న వీరంతా క్రమబద్ధీకరణపై ఆశలు వదిలేసుకోవాల్సి వచ్చింది. వీరిలో దాదాపు 60 మంది మరణించడం, ఉద్యోగ విరమణ కారణాలతో కార్పొరేషన్‌కు దూరమయ్యారు.

న్యాయస్థానం ఆదేశాలు, 11వ పీఆర్‌సీల ప్రయోజనాలను ప్రభుత్వం పట్టించుకోకపోవటంతో మృతుల కుటుంబాలకు మట్టి ఖర్చులు కూడా దక్కక, వారసులకు కారుణ్య నియామకాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. మిగిలిన 146 మంది టైంస్కేలు వర్కర్లకు అద్దె భత్యం, ప్రోత్సాహకాల వంటివి దక్కని దయనీయ పరిస్థితి నెలకొంది.

ఆప్కాస్‌తో అష్టకష్టాలు

వైకాపా ప్రభుత్వ హయాంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఏపీ అవుట్‌ సోర్సింగ్‌ కార్పొరేషన్‌ (ఆప్కాస్‌) వల్ల కార్మికులెవరికీ నయాపైసా ఉపయోగం లేదు. పైగా నగర పాలక సంస్థపై అదనపు భారం పడింది. కార్మికుల వేతనాల సొమ్మును ఆప్కాస్‌కు ప్రతి నెలా జమ చేయాలి. దీనిపై 18 శాతం జీఎస్టీ కింద రూ. 1.50 కోట్లను భరించాలి. మరోవైపు ఆప్కాస్‌కు చెల్లిస్తున్న సొమ్ములో ఒక శాతాన్ని అది తన కమీషన్‌ కింద మినహాయించుకుంటోంది. ఈ భారం కూడా నగర పాలక సంస్థే భరించాల్సి వస్తోంది. కార్మికుల వేతనాల నుంచి ఈఎస్‌ఐ, పీఎఫ్‌ల మొత్తాలను మినహాయించుకుంటున్నా.. సంబంధిత విభాగాలకు సక్రమంగా జమ చేయడం లేదు. దీంతో కార్మికుల ప్రయోజనాలకు విఘాతం కలుగుతోంది.

దక్కని ఫలితం...!

  • నగరపాలక సంస్థ పారిశుద్ధ్య విభాగంలో పని చేస్తున్న 3,274 మంది కార్మికులకు వేతనం, హెల్త్‌ అలవెన్సు కలిపి ఒక్కొక్కరికి రూ. 21 వేలు చెల్లిస్తుండగా.. ఈఎస్‌ఐ, పీఎఫ్‌ల మినహాయింపుతో వారి చేతికి రూ. 18 వేల నుంచి రూ. 19 వేలు అందుతున్నాయి.
  • ఉద్యాన విభాగంలోని 194 మంది కార్మికులు ఆప్కాస్‌ కింద ఉండగా.. వీరికి కత్తిరింపులు పోను చేతికి వచ్చేది రూ. 13 వేలు.
  • వీరు ఆరోగ్యం సరిగా లేక లేదా అత్యవసర పనుల కారణంగా ఒక్క రోజు విధులకు హాజరుకాకపోయినా వేతనంలో కత్తిరింపు తప్పదు.
  • భూగర్భ డ్రైనేజీ, తాగునీటి సరఫరా విభాగాల్లో దాదాపు 500 మంది వరకు కార్మికులు పని చేస్తుండగా.. వీరికి రూ. 15 వేల వేతనం ఇస్తున్నారు.
  • నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయ ప్రాంగణం, తుమ్మలపల్లి కళాక్షేత్రం, క్రీడా ప్రాంగణాలు, జక్కంపూడి కాలనీ వంటి ప్రాంతాల్లో గుత్తేదార్ల ద్వారా 160 మంది కార్మికులు పారిశుద్ధ్య విధులు నిర్వర్తిస్తుండగా.. నెలకు రూ. 9 వేలకు మించి వారికి చెల్లించడం లేదని కార్మిక సంఘ నాయకుడు రంగనాయకులు ఆరోపించారు.
  • వాస్తవానికి సమాన పనికి సమాన వేతనం కింద రూ. 32 వేలు దక్కాల్సి ఉన్నా.. ఆప్కాస్‌తో ఒప్పంద, పొరుగుసేవల కార్మికులు, సిబ్బంది క్రమబద్ధీకరణ అంశం పక్కకుపోయింది.
  • ఒప్పంద, పొరుగు సేవల కార్మికులతోపాటు.. శాశ్వత పారిశుద్ధ్య కార్మికులందరికీ (పీహెచ్‌వర్కర్లు సహా) సొంత ఇళ్లను కేటాయించేందుకు తెదేపా ప్రభుత్వ హయాంలో దరఖాస్తులు స్వీకరించింది. ఐరిస్‌ వంటి ప్రక్రియలనూ పూర్తి చేసింది. 2019లో వైకాపా అధికారంలోకి రావటంతో కార్మికుల కలలు కల్లలైపోయాయి.
  • పారిశుద్ధ్య కార్మికులకు మినహా ఆప్కాస్‌లోని మిగిలిన విభాగాలవారికి ప్రభుత్వ పథకాలు అందకుండా ఆంక్షలు విధించడంతో ఈ విధంగా కూడా వారు నష్టపోయారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని