logo

పొట్టి వీడియోలతో వినోదాల విందు!

యూట్యూబ్‌లో నవ్వులను పంచే పొట్టి వీడియోలను అందరూ చూస్తుంటారు. వీటిని తీసే వారిలో కాస్తా చదువుకున్నవారు, సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉన్న ఔత్సాహిక యువతీయువకులు ఎక్కువగా ఉంటారు.

Published : 05 Oct 2022 01:56 IST

పనులు చేసుకుంటూనే.. కామెడీ షాప్‌ పేరుతో నెటిజన్లకు చేరువ

చిత్రీకరణ సమయంలో తన మిత్రులకు సూచనలిస్తున్న వీరా

ఉరవకొండ న్యూస్‌టుడే: యూట్యూబ్‌లో నవ్వులను పంచే పొట్టి వీడియోలను అందరూ చూస్తుంటారు. వీటిని తీసే వారిలో కాస్తా చదువుకున్నవారు, సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉన్న ఔత్సాహిక యువతీయువకులు ఎక్కువగా ఉంటారు. దీనికి భిన్నంగా ఉరవకొండకు చెందిన కొందరు చిన్న చిన్న పనులు చేసుకునే కార్మికులు ఒక బృందంగా ఏర్పడి, ఆ పొట్టి వీడియోలను తమ చరవాణుల ద్వారా తీస్తూ ఎంతోమంది నెటిజన్ల ఆదరణను పొందుతున్నారు. వీరి విభిన్న ప్రస్థానంపై ‘ఈనాడు- ఈటీవీ’ కథనం..
క్లిక్‌ అయింది అప్పుడే...
2016లో ప్రారంభమైన ఛానల్‌ మొదట్లో అంతగా ఆదరణ పొందలేదు. 2019లో కరోనా మహమ్మారి అందరి జీవితాల్లో అల్లకల్లోలం సృష్టించటం తెలిసిందే. ఆ సమయంలో ప్రజలు అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. అప్పుడే వారుచేసే హాస్య వీడియోలకు ఊహించని స్థాయిలో వీక్షణలు పెరిగాయి. వకీల్స్‌ాబ్‌, అఖండ, వాట్సాప్‌పే తదితర వీడియోలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. కరోనా సమయం నుంచి వారి నవ్వుల వీడియోలకు ఆదరణ పెరుగుతోంది. ఇదే ఉత్తేజంతో ఇంకా మెరుగైన వీడియోలు చేసి ప్రజలను అలరించటానికి ముందుకు సాగుతున్నారు.


అందరి ముఖాల్లో నవ్వులు పూయించాలని..

ఉరవకొండలో పేద కుంటుంబానికి చెందిన వీరాంజనేయులు కష్టాలు పడుతూ డిగ్రీ వరకు చదివాడు. తనకు చిన్ననాటి నుంచే సినిమాలంటే అమితమైన ఆసక్తి. దీంతో ఎలాగైనా యాక్టర్‌ కావాలనుకునేవాడు. తల్లి తన చిన్న వయసులోనే మరణించగా.. బంధువులు ఎవరూ ఆదరించలేదు. ఈ క్రమంలో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. రోజూ జీవితంలో బాధలను తలచుకుంటూ దిగులు పడుతుండే ఇరుగుపొరుగు వారిని చూసి చలించాడు. తనకు తెలిసిన కళతో వారి ముఖంలో ఆనందం చూడాలనుకున్నాడు. దానికి మార్గం నవ్వులను పంచాలనీ.. అందులో వారిని భాగస్వాములను చేయాలన్న ఆలోచన చేశాడు. అలా తన మిత్రులతో కలిసి 2016లో వీరూ కామెడీ షాప్‌ పేరుతో యూట్యూబ్‌లో ఛానల్‌ను ప్రారంభించాడు. మిత్రబృందం మల్లికార్జున, ఆరిఫ్‌, సుంకరాజు, ప్రదీప్‌, ఓబుళపతి, నూర్‌బాషా, సిద్దు, సోము, మల్లికార్జునతో కలిసి సందేశాత్మక, హాస్యాన్ని పంచే 400 పైగా వీడియోలు తీశారు. వీటికి 30 లక్షలకు పైగా వీక్షణలు వచ్చాయి. బృందంలో బారా మసాలా విక్రేత, మెకానిక్‌, క్యాబ్‌ డ్రైవరు, వంట మాస్టర్‌, భవన నిర్మాణ కార్మికుడు.. ఇలా అందరూ రోజువారీ సంపాదనతో జీవనం సాగించేవారే. ఈ బృందంలో ఎవరికీ సాంకేతిక పరిజ్ఞానం లేదు. పైగా సంపాదన అంతంతమాత్రమే. కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు ఇవేవీ వారి వద్ద లేవు. అందుబాటులో ఉన్న చరవాణితో సాయంతో వీడియోలను తీస్తున్నారు.


విమర్శల నుంచి ప్రశంసల వైపు..

ఛానల్‌ను ప్రారంభించిన మర్నాటి నుంచి ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాం. సొంత పనులతో కార్మికులుగా ఉంటూనే వీడియోలు చేస్తున్నప్పుడు కొందరు మమ్మల్ని మాటలతో గాయపర్చారు. అడుగడుగునా ఆటంకాలు వచ్చాయి. మా వీడియోల ద్వారా పంచుతున్న హాస్యం, వాటికి లభిస్తున్న ఆదరణను చూసి మొదట్లో తమను విమర్శించినవారే పొగుడుతున్నారు. దాతలు సహకరించి కెమెరాలు, సాంకేతిక పరికరాలు అందిస్తే మరింత హాస్యాన్ని పంచే వీడియోలను తీసి వీక్షకులను ఆనందపరుస్తాం.

- వీరాంజనేయులు, ఆరిఫ్‌

రాజుల వేషధారణలో ఓ వీడియోలో..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని