logo

ఇస్తే సులభం.. కుట్ర చేస్తే కష్టం

ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేయడం సులభం కాదని ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు వల్లె వేసిన మాటలు బూటకమని తేలింది. బ్యాంకు ఖాతాలు లేని 1.13 లక్షల మందికి తొలిరోజే ఇంటివద్దకు వెళ్లి పింఛను సొమ్ము అందజేయడమే ఇందుకు నిదర్శనం. 

Published : 02 May 2024 03:56 IST

తొలిరోజు 1.13 లక్షల మందికి పింఛను సొమ్ము
సిబ్బందిని పూర్తిగా వినియోగిస్తే రెండు రోజుల్లో ప్రక్రియ పూర్తి

ఉరవకొండలోని సచివాలయం-4 వద్ద జాబితాలో పేర్లు వెతుకుతున్న పింఛనుదారులు

ఈనాడు డిజిటల్‌, అనంతపురం: ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేయడం సులభం కాదని ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు వల్లె వేసిన మాటలు బూటకమని తేలింది. బ్యాంకు ఖాతాలు లేని 1.13 లక్షల మందికి తొలిరోజే ఇంటివద్దకు వెళ్లి పింఛను సొమ్ము అందజేయడమే ఇందుకు నిదర్శనం. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిని సమర్థవంతంగా వినియోగించుకుంటే రెండు, మూడు రోజుల్లోనే ప్రక్రియను పూర్తిచేసేవారని వాదనకు బలం చేకూరింది. ఇంటింటికీ పంపిణీ చేసే వ్యవస్థ, సామర్థ్యం ఉన్నా.. జగన్‌ సర్కారు దొంగనాటకం ఆడుతోంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 1.58 లక్షల మంది పింఛనుదారులకు బ్యాంకు ఖాతాలు లేవని తేల్చారు. వారందరికీ సచివాలయాల సిబ్బంది ద్వారా ఇంటివద్దే పింఛన్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మొదటిరోజు పింఛను అందించారు. తొలిరోజే 71 శాతం లక్ష్యాన్ని పూర్తిచేశారు.  తక్కువ మంది సిబ్బందితో సొమ్ము ఇవ్వగలిగారు. ఈ లెక్కన అవకాశం ఇచ్చి ఉంటే మరో రెండు రోజుల్లో ప్రక్రియ మొత్తం పూర్తిచేసేవారు. గతంలో వాలంటీర్లు పంపిణీ చేసే సమయంలోనూ 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు అవకాశం ఇచ్చేవారు. ఈ లెక్కన సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికీ పింఛన్ల పంపిణీ సాధ్యమే అని స్పష్టమవుతోంది. 

సచివాలయాల వద్ద పడిగాపులు

పింఛను సొమ్ము ఎవరి ఖాతాలో వేస్తారు? ఎవరికి ఇంటివద్ద అందజేస్తారు అనే స్పష్టత అధికారులు ఇవ్వలేదు. దీంతో చాలామంది వృద్ధులు గతనెల మాదిరిగానే సచివాలయాల వద్దకు వెళ్లి  ఎదురుచూశారు. తమకు బ్యాంకు ఖాతా ఉన్నట్లు తెలియదని కొందరు వృద్ధులు వాపోయారు. చాలాకాలంగా ఖాతా వాడటం లేదని.. కనీస సొమ్ము లేని కారణంగా సొమ్ము బ్యాంకు వారే జమ చేసుకుంటే తమ పరిస్థితి ఏమిటని ఆవేదన చెందుతున్నారు. మరోవైపు చాలామంది వృద్ధుల పేరుతో బ్యాంకుల్లో వ్యవసాయ రుణాలు ఉన్నాయి. పింఛను సొమ్మును వడ్డీ కింద జమ చేసుకుంటారేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సచివాలయ సిబ్బందిని ప్రశ్నిస్తే తమకు తెలియదని బదులిస్తున్నారు.

పంచాయతీ కార్యదర్శిని నిలదీసిన లబ్ధిదారులు

శెట్టూరు : తాము పింఛనుపైనే ఆధారపడి బతుకున్నాం.. నేరుగా చేతికందించాలని శెట్టూరుకు చెందిన పలువురు మహిళలు పంచాయతీ కార్యదర్శి వ్యాస్‌రావ్‌ను నిలదీశారు. బుధవారం ఉదయమే సచివాలయానికి చేరుకొని తమ గోడు వెల్లబోసుకున్నారు. ‘బ్యాంకు ఖాతాలో పింఛను వేస్తే అప్పునకు జమ చేస్తారు. ఏం తినాలి. మేము పేదవాళ్లం. ఆరోగ్యాలు బాగాలేవు. మందులు కొనుగోలు చేయాలి. బ్యాంకుకు వెళ్లి నగదు డ్రా చేసుకొని తెచ్చుకోలేమన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు