logo

ఫాం-12 ఇచ్చాం.. మా పేర్లు ఏమయ్యాయి

‘ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారమే ఫాం-12 సకాలంలో ఇచ్చాం. మేము పని చేసే చోటే ఆర్‌ఓలకు సమర్పించాం. ఇపుడు ఓటు వేసేందుకు వస్తే.. పేర్లు లేవంటారు.

Published : 06 May 2024 06:41 IST

ఓటు ఏమైందంటూ ప్రశ్నిస్తున్న ఉపాధ్యాయిని

అనంతపురం(శ్రీనివాస్‌నగర్‌), న్యూస్‌టుడే: ‘ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారమే ఫాం-12 సకాలంలో ఇచ్చాం. మేము పని చేసే చోటే ఆర్‌ఓలకు సమర్పించాం. ఇపుడు ఓటు వేసేందుకు వస్తే.. పేర్లు లేవంటారు. ఇది అన్యాయం. కావాలనే చేస్తున్నారు. ఎలాగైనా సరే.. ఓటు వేసి తీరుతాం’.. అంటూ ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్ర ఆక్రోశం, ఆవేశం వెల్లగక్కారు. అనంత డ్వామా కార్యాలయంలో ‘జిల్లా స్థాయి ఫెసిలిటేషన్‌’ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తొలి రోజైన శనివారం ఇక్కడ ఓటింగ్‌ మొదలు కాలేదు. రెండో రోజైన ఆదివారం కూడా గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. జిల్లాలో పని చేస్తున్న ఇతర జిల్లాల ఉద్యోగులు, ఈ జిల్లాలో నివాసం ఉంటూ ఇతర జిల్లాల్లో పని చేస్తున్న టీచర్లు, ఉద్యోగులు ఓటు వేసేందుకు డ్వామా కార్యాలయానికి చేరుకున్నారు.  మా పేర్లు ఏమయ్యాయో చెప్పాలంటూ నిరసన తెలిపారు. ‘మా స్వగ్రామం శింగనమల. శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లి పాఠశాలలో ఎస్‌ఏగా పని చేస్తున్నాం. ధర్మవరం ఆర్‌ఓకు ఫాం-12 ఇచ్చా. ఎక్కడా పేరు రాలేదు. శింగనమలలో అడిగా. ధర్మవరంలో చూశా. ఇపుడు ఇక్కడ (డ్వామా) కూడా లేదు. తన పేరు ఏమైనట్లు’.. అని ఓ మహిళా టీచరు నిలదీశారు. దీనికి ఎవరూ సమాధానం చెప్పలేదు. ఇదే తరహాలోనే ఆళ్లగడ్డకు చెందిన ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ ఓటు కూడా లేదు. ఇలా పదుల సంఖ్యలో పేర్లు రాకపోవడంతో తీవ్ర అసంతృప్తి వెలిబుచ్చారు. జిల్లా స్థాయి ఫెసిలిటేషన్‌ కేంద్రంలో 2 వేలకు పైగా ఓట్లు ఉన్నాయి. కానీ ఒకే బూత్‌ ఏర్పాటు చేశారు. ఓటు వేసేందుకు గంటలకొద్దీ నిరీక్షించారు. అక్కడి హాలు వరండాలోనే కుర్చీలు వేసినా ప్రయోజనం లేదు. ఉక్కపోతతో విలవిల్లాడారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల విషయంలో ఏదో మతలబు జరుగుతోందంటూ ఆరోపించారు. రెండు రోజులుగా ఈ కేంద్రం పని చేస్తున్నా.. ఏ రోజు ఎంత మంది ఓటు వేశారో తగిన సమాచారం వెల్లడించలేదని ప్రశ్నించారు.

అక్కడే ఓటు వేయండి

ఎన్నికల విధులకు నియమితులైన వారు ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం మరొక అవకాశం కల్పించిందని కలెక్టర్‌, డాక్టర్‌ వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు. ఇప్పటి దాకా ఫాం-12 సమర్పించిన వారే కాకుండా.. ఇంకా ఫాం-12 ఇవ్వని వారు కూడా ఓటు వేసేందుకు అవకాశం ఉందన్నారు. ఈనెల 7, 8వ తేదీల్లో ఓటు హక్కు కలిగిన సంబంధిత నియోజకవర్గ ఫెసిలిటేషన్‌ కేంద్రం వద్దకు వెళ్లి.. అక్కడే ఫాం-12 ఇవ్వండి. అప్పటికపుడే పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు వేయవచ్చన్నారు. ఆ రెండు రోజుల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటలు దాకా పోలింగ్‌ సాగుతుందన్నారు.  ఎన్నికల విధుల ఉత్తర్వు పొంది.. ఫాం-12 ఇవ్వని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఓటు ఉన్న సొంత నియోజకవర్గం ఫెసిలిటేషన్‌ కేంద్రంలోనే ఓటు వేయాలన్నారు. గడిచిన మూడు రోజుల్లో పోస్టల్‌ బ్యాలెట్టు ద్వారా 29 శాతం మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు ఓట్లు వేశారు. ఎన్నికల విధులకు మొత్తం 26,150 మంది నియమించగా... ఇప్పటిదాకా 7588 మంది ఓటు వేశారు. పీఓ, ఏపీఓ, ఓపీఓలకు సోమవారం తుది గడువు. ఇతరులకు ఈనెల 8 దాకా గడువు ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని