logo

కూటమి అభ్యర్థులను గెలిపించండి : మందకృష్ణమాదిగ

తెదేపా అధినేత చంద్రబాబు, దేశ ప్రధాని మోదీ, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సారథ్యంలో ఎన్డీఏ కూటమి ఏర్పాటైంది.

Published : 07 May 2024 05:05 IST

అంబికా లక్ష్మీనారాయణ, మందకృష్ణమాదిగ, దగ్గుపాటి ప్రసాద్‌లను గజమాలతో సత్కరిస్తున్న కార్యకర్తలు

అనంతపురం (కళ్యాణదుర్గంరోడ్డు), న్యూస్‌టుడే: తెదేపా అధినేత చంద్రబాబు, దేశ ప్రధాని మోదీ, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సారథ్యంలో ఎన్డీఏ కూటమి ఏర్పాటైంది. అన్ని వ్యవస్థలను చక్కదిద్దడం కూటమితోనే సాధ్యం. మాదిగలంతా కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. సోమవారం అనంతపురం రాయల్‌ ఫంక్షన్‌ హాలులో ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటిప్రసాద్‌లతో కలిసి నిర్వహించిన సమావేశంలో మందకృష్ణమాదిగ మాట్లాడుతూ.. వైకాపా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను రద్దు చేసి దళితులకు దూరం చేయడం దుర్మార్గమన్నారు. దళితులతోపాటు అన్ని వర్గాలకు తీరని నష్టం మిగిల్చారన్నారు. ఐదేళ్ల పాలనలో వైకాపా నాయకులు దళితులపై దాడులు, బెదరింపులు, దౌర్జన్యాలు అధికమయ్యాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. చివరికి ఏపీ రాజధాని లేని రాష్ట్రంగా జగన్‌ మార్చేశాడని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జగన్‌కు ఎందుకు ఓటు వేయాలని ఆయన ప్రశ్నించారు. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కోసం వైకాపా నాయకులు నాటకాలు ఆడారని, కూటమి గెలిస్తే ఎస్సీ వర్గీకరణను తప్పకుండా సాధించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూటమి అభ్యర్థులకు ఆదరించి, అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. అనంతరం అభ్యర్థులు అంబికా లక్ష్మీనారాయణ, దగ్గుపాటిప్రసాద్‌ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులు దారి మళ్లించి మాదిగలను జగన్‌ మోసం చేశారన్నారు. ఓటు వేసిన పాపానికి దళితులపై దాడులు చేయడం దుర్మార్గమన్నారు. దళిత ద్రోహి జగన్‌ను ఇంటికి పంపాలంటే ఓటుతోనే బుద్ది చెప్పాలన్నారు. అనంతరం అంబికా లక్ష్మీనారాయణ, దగ్గుపాటి,  మందకృష్ణమాదిగలను గజమాలతో అభిమానులు, కార్యకర్తలు సత్కరించారు. తెదేపా జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్‌, ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌చౌదరి, రాష్ట్ర కార్యదర్శి తలారి ఆదినారాయణ, తెలుగుయువత రాష్ట్ర అధికార ప్రతినిధి లక్ష్మీనరసింహ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని