logo

చెరువులపై వైకాపా నాయకుల పంజా

కరవునేల కదిరి ప్రాంతంలో అధికారపార్టీకి చెందిన కొందరు కబ్జా రాయుళ్ల కళ్లు చెరువులపై పడ్డాయి.

Published : 07 May 2024 05:29 IST

కదిరి పట్టణం, న్యూస్‌టుడే: కరవునేల కదిరి ప్రాంతంలో అధికారపార్టీకి చెందిన కొందరు కబ్జా రాయుళ్ల కళ్లు చెరువులపై పడ్డాయి. ప్రజాప్రతినిధులతో అధికారులపై ఒత్తిడి తెచ్చి నీటి వనరుల పరిసరాలను ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. చెరువులను ఆక్రమించుకుని పొలాల్లోకి కలిపేసుకుంటున్నా అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. శాఖల మధ్య సమన్వయలోపాన్ని అనుకూలంగా మార్చుకున్న కబ్జాదారులు యథేచ్ఛగా ఆక్రమణలకు పాల్పడుతున్నారు. వీరిపై చర్యలు తీసుకోకపోతే చెరువుల భద్రతకే ముప్పువాటిల్లే ప్రమాదముందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దేవరచెరువును పూడ్చేస్తున్నా పట్టింపేదీ?

కదిరి మండలం కౌలేపల్లి వద్ద ఉన్న దేవరచెరువులోని కొంతభాగాన్ని మట్టితో పూడ్చేసి అధికారపార్టీ నాయకులు ఆ భూమిని కబ్జా చేసేందుకు సిద్ధమయ్యారు. చెరువుభూమి ఆక్రమణపై స్థానికుల ఫిర్యాదుతో వెళ్లిన రెవెన్యూ, నీటిపారుదలశాఖ అధికారులపై అధికారపార్టీ నాయకుడు ఒత్తిడి తెచ్చాడు. కబ్జాదారుడికి వంతపాడుతూ ఆ భూమి విషయంలో ముందుకెళ్లొద్దంటూ హెచ్చరించడంతో అధికారులు చేసేదిలేక వెనుదిరిగారు. ఫిర్యాదును పరిష్కరించలేక, చెరువుభూమి కబ్జాను అడ్డుకోలేని స్థితిలో ఒక తహసీల్దార్‌ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోయారు.

పరిసరాలు కబ్జా

కదిరి మండలం పట్నం గ్రామం వద్ద ఉన్న రంగనాయునిచెరువు సర్వేనంబరు 836లో సుమారు 345 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ చెరువు ద్వారా దాదాపు 500 ఎకరాలకు సాగునీరు అందుతోంది. దీనిపై అధికారపార్టీ నాయకుడి కన్నుపడింది. సమీపంలో భూమిని కొనుగోలు చేసిన తాడిపత్రివాసి చెరువునీరు పొలంలోకి రాకుండా ఎత్తు పెంచుతున్నాడంటూ చెరువులోని కొంతభాగంతోపాటు ఆనుకొని ఉన్న గుట్టను ఆక్రమించుకుని పొలంలో కలిపేసుకున్నాడు. ఫలితంగా భారీ వర్షాలు వస్తే చెరువుకట్టకే ముప్పు ఏర్పడేలా పరిస్థితి ఉంది. స్థానికులు రెవెన్యూ, నీటిపారుదలశాఖ అధికారులు, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. చెరువు స్థలం ఆక్రమించినట్లు సర్వేయర్లు నివేదిక ఇచ్చినా కబ్జాదారుడిపై నీటిపారుదలశాఖ అధికారులు చర్యలు తీసుకోలేదు. అధికారపార్టీ నేతల అండదండలు ఉన్నందునే ఆక్రమణదారుడిపై చర్యలు తీసుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

చెరువుకట్టనూ వదలని అక్రమార్కులు

చెరువుకట్టను ఆక్రమించుకుని నాటిన మొక్కలు

కదిరి మండలం కౌలేపల్లి వద్ద దేవరచెరువుకట్టకు ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమిని కాజేసేందుకు వైకాపా నాయకులు రకరకాల విన్యాసాలు చేశారు. చెరువుకుస£మీపంలో బాహ్యవలయ రహదారి ఏర్పాటు కానుండటంతో స్థలాల ధరలు అమాంతం పెరిగాయి. దీంతో సర్వేనంబరు 174లోని అరెకరం భూమిని కబ్జా చేసేందుకు నానా ప్రయత్నాలు చేశారు. ఆ భూమిలో రాత్రికి రాత్రే పునాదులు తవ్వారు. చెరువుకట్ట ఆక్రమణపై ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు రెవెన్యూ కార్యాలయాల ఎదుట ఆందోళన చేపట్టడంతో స్పందించిన అధికారులు పునాదులు పూడ్చేశారు. తమ ప్రభుత్వంలో అధికారుల పెత్తనమేంటని భావించి భూమిని ఆక్రమించుకునేందుకు సిద్ధమైన నాయకులు పండ్ల మొక్కలు నాటేశారు. ఆ తరువాత అధికారులు అటువైపు కన్నెత్తి చూడలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని