logo

నిధులు, నీళ్లు ఇవ్వకుండా.. ఊళ్లెలా నిర్మిస్తావు జగన్‌

ఇళ్లుకాదు.. ఊర్లే నిర్మిస్తున్నామంటూ పదేపదే గొప్పలు చెప్పుకొనే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తన పేరుపై నిర్మిస్తున్న కాలనీల్లో సమస్యలు తాండవం చేస్తున్నా పట్టించుకోవడం లేదు.

Updated : 07 May 2024 06:01 IST

తన పేరుమీదున్న కాలనీలనూ గాలికొదిలేసిన సీఎం

ఇళ్లుకాదు.. ఊర్లే నిర్మిస్తున్నామంటూ పదేపదే గొప్పలు చెప్పుకొనే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తన పేరుపై నిర్మిస్తున్న కాలనీల్లో సమస్యలు తాండవం చేస్తున్నా పట్టించుకోవడం లేదు. నిధులు విడుదల చేయకపోవడంతో మూడేళ్లుగా నిర్మాణాలు పునాదులకే పరిమితమయ్యాయి. ఇళ్లు నిర్మించకపోతే రద్దుచేసి మరొకరికి కేటాయిస్తామంటూ కొన్నిచోట్ల లబ్ధిదారులను భయపెట్టడంతో కొంతమంది అష్టకష్టాలుపడి అప్పులు చేసి ఇళ్లు పూర్తి చేసుకున్నారు. తీరా.. అక్కడికివెళ్లి నివసిస్తే మౌలిక వసతులు అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మళ్లీ పాత స్థలాలకు వచ్చి అద్దె ఇంట్లో చేరుతున్నారు. నీటి సమస్యతో నిర్మాణాలు సైతం ఎక్కడికక్కడ ఆగిపోతున్నాయి.

న్యూస్‌టుడే అనంతపురం(రాణినగర్‌)


తూతూమంత్రంగా ట్యాంకుల ఏర్పాటు

గుత్తి: గుత్తి శివారులోని నేమితాబాద్‌ జగనన్న కాలనీలో నీటిపథకం అధ్వానంగా ఉంది. రూ.10 లక్షలు వెచ్చించి గుంతకల్లు ప్రజాఆరోగ్య విభాగం ఇంజినీర్లు 14 మినీ ట్యాంకులు ఏర్పాటు చేశారు. కాలనీలో బోరు వేసి పైపులైన్‌ అమర్చి ట్యాంకులను అనుసంధానం చేశారు. గృహనిర్మాణానికి అవసరమైన నీటికోసం పథకాన్ని ప్రభుత్వం మంజూరు చేయగా అధికారులు తూతూ మంత్రంగా ట్యాంకులు ఏర్పాటు చేసి చేతులు దులుపుకొన్నారు. ట్యాంకులకు ఏర్పాటు చేసిన పైపులు ఊడిపోయాయి. పైపులైన్‌ ఎక్కడపడితే అక్కడ లీకేజీ అవుతోంది. నిధుల్లేక పనులు ముందుకు సాగడం లేదు. కాలనీలో చేరినవారికి నీటి వసతి లేక అల్లాడిపోతున్నారు.

నెరవేరని సొంతింటి కల

ఓబుళదేవరచెరువు: మండలంలో 14 పంచాయతీలున్నాయి. ప్రభుత్వ భూములున్న చోట మాత్రమే జగనన్న కాలనీలు ఏర్పాటు చేశారు. మిగిలిన గ్రామాల్లో స్థలాలు కొనుగోలు చేయలేక చేతులెత్తేశారు. ఇచ్చినవి కూడా ఊరికి దూరంగా ఉండటంతో ఇల్లు కట్టుకోవడానికి వెనుకడుగు వేస్తున్నారు. ఓబుళదేవరచెరువు పంచాయతీలో ఊరికి 2 కి.మీ. దూరంలో గుట్టలో 40 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఇందులో ఒక ఇల్లు మాత్రమే నిర్మాణం చేపట్టి గోడల వరకు పూర్తైయిన తర్వాత అర్ధాంతరంగా అపివేశారు. కొండకమర్ల, గాజుకుంటపల్లిలో ఊరికి దూరంగా గుట్టలో ఇవ్వడంతో సగం మందికి పైగా ఇళ్లు నిర్మించుకోవడానికి వెనుకడుగు వేశారు. ఇల్లు నిర్మించుకోవాలంటే లబ్ధిదారులు ఒక్కొక్క ట్యాంకరుకు రూ.500 వెచ్చించాల్సి వస్తోంది.

రూ.3 కోట్ల ఖర్చు వృథానే!

గుంతకల్లు: పట్టణ శివారులో గుంతకల్లు - పామిడి రహదారికి ఇరువైపులా ఉన్న జగనన్న కాలనీల్లో ఇళ్లను నిర్మించుకోవడానికి లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలనీల్లో నీటిని అందించడానికి ప్రభుత్వం రూ.3 కోట్ల వరకు ఖర్చు చేసి పలుచోట్ల బోర్లు తవ్వించారు. కుళాయిల నీటిని సరఫరా చేయడానికి 40 వరకు ట్యాంకులు ఏర్పాటు చేశారు. ఆ బోర్లలో నీరు లభించక, విద్యుత్తు మోటార్లు పనిచేయక ట్యాంకులు వృథాగా దర్శనమిస్తున్నాయి. కొన్నిచోట్ల ట్యాంకులకు పైపులు, కుళాయిలు అమర్చలేదు. సగానికి పైగా ట్యాంకులు నీటిని అందించడం లేదు. జగనన్న కాలనీలో మొత్తం లేఅవుట్లు 11 ఉండగా 3,442 ఇళ్లు మంజూరుకాగా 1142 మాత్రమే పూర్తయ్యాయి.

నాలుగు నెలలుగా సమస్య

కళ్యాణదుర్గం గ్రామీణం: పట్టణంలోని కురాకులతోట వద్ద జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. నాలుగు నెలలుగా నీటి సమస్య పట్టి పీడిస్తోంది. బోరుబావులు ఉన్నా అందులో నీటిమట్టం తగ్గి నీరు రావడం లేదు. 2021 జనవరి 6వ తేదీన శిలాఫలకాన్ని ప్రారంభించారు. ఆ కాలనీలో 1,590 ఇళ్ల స్థలాలకుగాను 1,563 మంజూరయ్యాయి. ఇందులో లబ్ధిదారులు నిర్మించుకొన్నవి 365, రూప్‌లెవెల్‌ 103, లెంటెల్‌ లెవెల్‌లో 82, పునాదుల దశలో 518, బీబీఎల్‌ దశలో 115 ఇళ్లు ఉన్నాయి. 100 మంది వరకు నివాసం ఉంటున్నారు. ట్యాంకర్లకు అద్దె చెల్లించి ఐదారు రోజులకోసారి నీటిని తెచ్చుకొంటున్నారు.

అరకొర నీరే దిక్కు

ఉరవకొండ: ఉరవకొండలోని జగనన్న కాలనీల్లో తాగునీటికి లబ్ధిదారులకు ఇక్కట్లు ఎదురవుతున్నాయి. పట్టణంలో కొలిమి ప్రాంతంలోనూ, రాయంపల్లి దారిలోనూ, బాలికల గురుకులం సమీపంలో జగనన్న కాలనీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వాటిలో 2,860 మంది లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు చేసింది. కాలనీల పరిధిలో సరైన వసతులు లేకపోయినా, ఇళ్లను నిర్మించుకోకుంటే పట్టాలు రద్దు చేస్తామంటూ వైకాపా నాయకులు, అధికారులు బెదిరించి లబ్ధిదారులతో ఇళ్లను నిర్మాణం చేసుకునేలా చేశారు. చాలామంది నీటి సదుపాయం లేక పోయినా నీటిని కొని ఇళ్లు నిర్మించుకున్నారు. ఆ తరువాత కొన్నాళ్లకు ఆ కాలనీల్లో ప్రభుత్వం బోర్లను వేసి, తాగునీటి పైపులైన్లు, కుళాయిలను ఏర్పాటు చేయించింది. ఆ ప్రక్రియ ముగిసి కూడా ఏడాది గడిచిపోయినా, కుళాయిలకు అరకొరగా నీరు వస్తున్నాయి. అవి కూడా తాగడానికి పనికి రావు. దీంతో కుళాయిలు అలంకార ప్రాయంగా మారాయి.

ట్యాంకరు నీటికి రూ.500 వెచ్చించాల్సిందే..

ధర్మవరం: జగనన్న కాలనీల్లో ఇల్లు నిర్మించుకునేందుకు సరైన వసతులు కల్పించలేదు. ఇళ్ల నిర్మాణానికి నీటి సౌకర్యం ఏర్పాటు చేయలేదు. పట్టణ శివార్లలోని పోతులనాగేపల్లి జగనన్న కాలనీ వద్ద బోర్లు వేయించారు. బోర్ల నుంచి ట్యాంకులకు నీరు అందకపోవడంతో ఇళ్ల నిర్మాణం చేపట్టేవారు ట్యాంకరు రూ.500 వెచ్చించి నీటిని కొనుగోలు చేస్తున్నారు. రేగాటిపల్లి, ఎల్‌1, ఎల్‌3, రేగాటిపల్లి లేఅవుటË్ ప్రాంతాల్లోనూ నీటిసౌకర్యం లేదు. ఒక్కో ఇంటి నిర్మాణానికి నీటి కొనుగోలుకే రూ.5వేలు వరకు వెచ్చించాల్సి వస్తోంది. కుణుతూరు జగనన్న కాలనీలో 2 బోరుబావులు తవ్వించారు. వాటిలోనూ అరకొర నీరు వస్తుండడంతో ఇళ్ల నిర్మాణానికి ఏమాత్రం చాలడం లేదు. కాలనీలో 1356 గృహాలు మంజూరు కాగా ఇప్పటివరకు 67 ఇళ్లు మాత్రమే నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. రేగాటిపల్లి లేఅవుటË్లో 1,850 గృహాలు మంజూరు కాగా 209 మాత్రమే నిర్మాణం పూర్తి అయ్యాయి. పోతులనాగేపల్లి, జగనన్న కాలనీ వద్ద 5,319 గృహాలు మంజూరు కాగా 1,184 మాత్రమే పూర్తయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని