logo

అనంత మనవడినంటావు..గేట్లు గ్రీజుకూ డబ్బుల్లేవంటావు!

మా అమ్మ వాళ్లది పెద్దపప్పూరు మండలం.. అనంతపురం జిల్లా మనవడిని అన్నావు.. సెంటుమెంట్‌తో ఓట్లు వేయించుకున్నావు. అదే పెద్దపప్పూరు మండలంలోని ప్రాజెక్టులను గాలికి వదిలేశావు.

Published : 07 May 2024 05:44 IST

పూర్తవ్వని పెండేకల్లు జలాశయం
చాగల్లుకు దక్కని నీటి కేటాయింపు
ఇదేనా నీ ప్రేమ.. ఐదేళ్లలో ఏమి చేశావు జగన్‌

రైతున్నల సమస్యలను దగ్గరగా చూశా. అధికారంలోకి రాగానే సాగు, తాగు నీటి కష్టాలు లేకుండా చేస్తా. పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేసి అన్నదాతల కళ్లల్లో ఆనందం చూస్తా.

తాడిపత్రిలో 2019లో జరిగిన ఎన్నికల ప్రచారసభలో ప్రతిపక్ష నేతగా జగన్‌ ఇచ్చిన హామీ

అంతా కపట ప్రేమే..

మా అమ్మ వాళ్లది పెద్దపప్పూరు మండలం.. అనంతపురం జిల్లా మనవడిని అన్నావు.. సెంటుమెంట్‌తో ఓట్లు వేయించుకున్నావు. అదే పెద్దపప్పూరు మండలంలోని ప్రాజెక్టులను గాలికి వదిలేశావు. మాట తప్పి.. మడమ తిప్పి...ఐదేళ్లు గడిపావు. నవ్విపోదురు నాకేటి సిగ్గు... అన్నీ వదిలేసి మళ్లీ ఓట్లు అడుగుతున్నావు. అనంత రైతులపై ఎంతో ప్రేమ ఉన్నట్లు నటించావు. అధికారం దక్కాక నీ నిజస్వరూపం బయటపెట్టుకున్నావు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న పెండేకల్లు, చాగల్లు ప్రాజెక్టుల్ని పూర్తిగా విస్మరించావు

న్యూస్‌టుడే, పెద్దపప్పూరు


పెండేకల్లు ప్రాజెక్టు

ప్రాజెక్టు : పెండేకల్లు
నిర్మాణ వ్యయం : రూ.122 కోట్లు
లక్ష్యం : 18,500 ఎకరాలకు సాగునీరు
సమస్య : ఆగిపోయిన ప్రధాన కాలువ,
ఏడు ఉపకాలువల పనులు
ప్రస్తుత స్థితి : ఆయకట్టుకు నీరందలేదు

కనీస మరమ్మతులు ఏవీ?

గేటు పనిచేయక, మరమ్మతులకు నోచుకోక దారుణంగా మారిన తూము

పెండేకల్లు గ్రామం నుంచి తాడిపత్రి మండలంలోని ఆలూరు గ్రామం వరకు రూ.30 కి.మీ ప్రధాన కాలువ నిర్మాణం చేపట్టారు. పనులు 26.5 కి.మీ మేర పూర్తి అయ్యాయి. 16 ఉప కాలువలు నిర్మించాల్సి ఉండగా 9 వరకు పూర్తి చేశారు. భూసేకరణ ప్రక్రియలో భాగంగా సీతారాంపురం, సజ్జలదిన్నె సమీపంలో 3.5 కి.మీ ప్రధాన కాలువ నిర్మాణం ఆగిపోయింది. రైతులను ఒప్పించి ప్రధాన కాలువ నిర్మించేందుకు తెదేపా ప్రజాప్రతినిధులు ప్రయత్నిస్తున్న సమయంలో 2019 ఎన్నికలు రావడంతో కాలువ నిర్మాణానికి ఆటంకం ఏర్పడింది. జగన్‌ ప్రభుత్వం వచ్చాక పనులు నిలిచిపోయాయి. ప్రధాన కాలువను పూర్తి చేసి రైతులను ఆదుకుంటామని ఇచ్చిన హామీని జగన్‌ సర్కారు విస్మరించింది. కనీసం తూము గేటు మరమ్మతులకు నోచుకోలేదు. మూడేళ్ల కిందట కురిసిన వర్షాలకు ప్రాజెక్టులోకి పెద్దఎత్తున నీరు చేరినా.. తూము గేటు సరిగా లేని కారణంగా పెన్నానదిలోకి వృథాగా కలిసిపోయింది.

చాగల్లు జలాశయం

ప్రాజెక్టు : చాగల్లు
నిర్మాణ వ్యయం : రూ.244 కోట్లు
లక్ష్యం : 6,500 ఎకరాలకు సాగునీరు
సమస్య : రూపు కోల్పోతున్న కాలువలు
ప్రస్తుత స్థితి: నీరు అడుగంటింది

ఏదీ నిర్వహణ?

కాలువ దుస్థితి

చాగల్లు జలాశయం నుంచి పెండేకల్లు జలాశయానికి నీరందించేందుకు ఎడమ కాలువను నిర్మాణం చేపట్టి పూర్తి చేశారు. తాడిపత్రి నియోజకవర్గంలోని పలు గ్రామాలకు సాగునీరు అందించేందుకు 10 కి.మీ మేర కుడి కాలువ నిర్మాణంతో పాటు 11 ఉప కాలువలను నిర్మించారు. 2015 నుంచి 2018 వరకు తెదేపా ప్రభుత్వంలో హెచ్చెల్సీ నీటిని చాగల్లుకు ఇచ్చారు . అక్కడి నుంచి పెండేకల్లుకు తరలించారు. సాగునీటి అవసరాలకు చాగల్లు కుడి కాలువకు వదిలారు. వైకాపా అధికారంలోకి వచ్చాక చాగల్లు నిర్వహణను గాలికివదిలేశారు. గేట్లకు గ్రీజు పూసేందుకు కూడా నిధులు కేటాయించకపోవడం గమనార్హం. కాలువలు శిథిలావస్థకు చేరుకున్నాయి. మట్టికట్టపై ముళ్లచెట్లతో నిర్వహణ అధ్వానంగా మారింది.

వైకాపా నాయకుల బరితెగింపు

2022లో వర్షాలు బాగా పడ్డాయి. చాగల్లుకు ఆశించిన స్థాయిలో నీరు చేరింది. ముందుచూపుతో ప్రాజెక్టులో నీటిని నిల్వ చేశారు. గతేడాది పెద్దపప్పూరు పెన్నానదిలో ఇసుక రేవు పేరుతో దోపిడీకి శ్రీకారం చుట్టారు. నిబంధనలకు విరుద్ధంగా కి.మీ. మేర 20 నుంచి 30 అడుగుల లోతు వరకు నదిలో తవ్వకాలు జరిపారు. అక్రమాలను గుర్తించేందుకు అధికారులు వస్తున్నారని వైకాపా నాయకులు బరితెగించి ఇసుక గుంతలు కనిపించకుండా ఉండేందుకు ప్రాజెక్టు నీటిని పెన్నానదికి వదిలేశారు. ఇలా పలుమార్లు విడుదల చేసి రైతులకు అన్యాయం చేశారు. ప్రస్తుతం జలాశయం అడుగంటిపోయింది.

చేతకాని ప్రభుత్వం

నారాయణస్వామి, రైతు, ఇడుగూరు

ఇది చేతకాని ప్రభుత్వం. 18,500 ఎకరాలకు ఆయకట్టుకు నీరందించే పెండేకల్లు జలాశయ కాలువ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు వైకాపా సర్కారు కనీస ప్రయత్నం చేయలేదు. ఐదేళ్లుగా రైతులకు చేసిందేమీ లేదు. గత ప్రభుత్వంలో 90 శాతం పనులు పూర్తయినా, మిగిలిన వాటిని పూర్తి చేయకపోవడం దారుణం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని