logo

అర్జున్‌ తెందూల్కర్‌ వీర విహారం..

Published : 19 May 2024 04:48 IST

యునైటెడ్‌ జట్టు విజయం

అర్జున్‌ తెందూల్కర్‌కు అవార్డు అందజేస్తున్న శిక్షకుడు వెంకటేశ్‌

అనంతపురం క్రీడలు, న్యూస్‌టుడే: అనంత క్రికెట్‌ లీగ్‌ పోటీల్లో అర్జున్‌ తెందూల్కర్‌ బ్యాటింగ్‌లో కదంతొక్కడంతో యునైటెడ్‌ ఛాంపియన్స్‌ క్రికెట్‌ క్లబ్‌ జట్టు 56 పరుగుల తేడాతో ఫ్యామిలి క్లబ్‌ జట్టును చిత్తుచేసింది. అనంత క్రీడా గ్రామంలో శనివారం టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన యునైటెడ్‌ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లకు 174 పరుగుల భారీ స్కోరు సాధించింది. అర్జున్‌ తెందూల్కర్‌ (85; 54 బంతుల్లో) స్వైర విహారం చేయడంతో జట్టు భారీస్కోరు నమోదు చేసింది. పి.మణిదీప్, కుళ్లాయప్పలు చెరో 25 పరుగులు చేసి అలరించారు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన ఫ్యామిలి క్లబ్‌ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 118 పరుగులు చేసి ఓడిపోయింది. అర్జున్‌ తెందూల్కర్‌ ప్లేయర్‌ ఆఫ్‌ మ్యాచ్‌ అవార్డును క్రికెట్‌ శిక్షకుడు వెంకటేశ్‌ చేతుల మీదుగా అందుకున్నాడు. మరో పోటీలో అనంత రైజింగ్‌ స్టార్‌ జట్టు దినేష్‌ గ్రానైట్స్‌ జట్టును 6 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన దినేశ్‌ గ్రానైట్స్‌ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 123 పరుగులు చేయగా అనంత రైజింగ్‌ స్టార్‌ జట్టు 19.1 ఓవర్లలో 4 వికెట్లకు 128 పరుగులు చేసి ప్లే ఆఫ్‌లో స్థానం సాధించింది. బ్యాటర్‌ వై.తేజారెడ్డి (63) ఒంటరిపోరు కొనసాగించి జట్టును విజయతీరాలకు చేర్చాడు. 4 వికెట్లు తీసిన బి.భార్గవ్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డును మ్యాక్స్‌ లైఫ్‌ ప్రతినిధి రామాంజనేయులు చేతుల మీదుగా అందజేశారు. ఆదివారం క్వాలిఫైర్‌ జట్ల మధ్య పోటీలు జరుగుతాయని జిల్లా క్రికెట్‌ సంఘం కార్యదర్శి మధుసూదన్‌ తెలిపారు.

అవార్డు అందుకుంటున్న బి.భార్గవ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని