logo

సమస్యాత్మక కేంద్రాల్లోనూ..స్వేచ్ఛా పతాకం

రాష్ట్ర రాజకీయాల్లో చిత్తూరు జిల్లా ప్రత్యేక స్థానంలో నిలిచింది. ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు, ముగ్గురు మంత్రులు, ప్రస్తుత ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు మాజీమంత్రి బరిలో నిలవడం.

Published : 23 May 2024 02:11 IST

ఈసీ ప్రత్యేక దృష్టి ఫలితం

పుంగనూరు: పోలింగ్‌ కేంద్రంలో ఓటర్లను విచారిస్తున్న ఎస్పీ 

పుంగనూరు, న్యూస్‌టుడే: రాష్ట్ర రాజకీయాల్లో చిత్తూరు జిల్లా ప్రత్యేక స్థానంలో నిలిచింది. ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు, ముగ్గురు మంత్రులు, ప్రస్తుత ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు మాజీమంత్రి బరిలో నిలవడం. మరోవైపు రాష్ట్రంలో రెండో స్థానంలో ఉన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత జిల్లా. ఆదినుంచి మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డిలతో వైరివర్గం. ఈ నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయోనని కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘం చిత్తూరు జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించింది. ఎన్నికలు సజావుగా జరగాలని, ఓటర్లు ప్రశాంత వాతావరణంలో ఓటువేయాలని ఆయా రాజకీయ పార్టీల నాయకులకు, గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించారు. ఫలితంగా ఈ నెల 13న జరిగిన సార్వత్రిక ఎన్నికలలో జిల్లాలో చెదురుమదురు సంఘటనలే తప్ప హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోలేదు. పోలింగ్‌ శాతం గత ఎన్నికలతో పోల్చితే ఈ పర్యాయం 2.07శాతం పెరిగింది.

1309 కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌

జిల్లాలోని నగరి, గంగాధరనెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం, పుంగనూరు నియోజకవర్గాల్లో 1771 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 415 సమస్యాత్మకం, తీవ్ర సమస్యాత్మకం పోలింగ్‌ కేంద్రాలను గుర్తించారు. సాధారణంగా అత్యంత సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లోనే వెబ్‌కాస్టింగ్‌ ఏర్పాటు చేసేవారు. ఈ పర్యాయం 1309 పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ ఏర్పాటు చేయడం విశేషం. అలాగే రాష్ట్ర, పొరుగు రాష్ట్రాలకు చెందిన పోలీసులతో పాటు కేంద్ర బలగాలతో కలిసి 2,936 మందిచే బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రత్యేకించి పుంగనూరు, పలమనేరు, కుప్పంలో ప్రతి పోలింగ్‌ కేంద్రంలో వెబ్‌కాస్టింగ్‌ ఏర్పాటు చేశారు. జిల్లాలో ఉద్దండుల మధ్య పోటీ జరగనుండడం, వారికి కొన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ఏకపక్షంగా పోలింగ్‌ జరుగుతోందని, ఏజెంట్లను సైతం కూర్చోపెట్టరనే ఫిర్యాదులు కేంద్ర ఎన్నికల సంఘానికి వెళ్లడంతో ఈసీ పటిష్ఠమైన చర్యలు చేపట్టింది.

పెరిగిన శాతం ఇలా..

సమస్యాత్మక, ఏకపక్ష గ్రామాల్లో పోలింగ్‌ శాతం పెరిగింది. పుంగనూరు నియోజకవర్గంలోని యర్రాతివారిపల్లెలో 93.59 శాతం, దిన్నెపాటివారిపల్లెలో 94.04శాతం, మర్రిమాకులపల్లెలో 93.23శాతం, సుగాలిమిట్టలో 86.30 శాతం ఇలా జిల్లా వ్యాప్తంగా తీవ్ర సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లోనూ పోలింగ్‌ శాతం పెరిగింది.

పోలింగ్‌ రోజున..

జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన బందోబస్తు, పోలింగ్‌ కేంద్రాల వద్ద వీడియో కవరేజీ, వెబ్‌కాస్టింగ్‌ ఏర్పాటు చేశారు. కానీ సోమల మండలంలో ఆవులపల్లె, కందూరులో వైకాపా-తెదేపా నాయకుల మధ్య గొడవలు చోటు చేసుకొన్నాయి. సదుం మండలం బూరగమందలో 14 మంది తెదేపా ఏజెంట్లను వైకాపా నాయకులు కిడ్నాప్‌ చేయడం జిల్లా ఎన్నికల అధికారి చొరవతో గంటల వ్యవధిలో విడిపించారు. యాదమరి మండలం 14కండ్రిగ ముస్లింవాడలో, రామకుప్పం మండలం ననియాలలో ప్రధాన పార్టీల కార్యకర్తల మధ్య రగడ నెలకొంది. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, తెదేపా అభ్యర్థి థామస్‌ల అన్నూరులో వాగ్వాదం, చిత్తూరు పట్టణం మిట్టూరులో మాజీ ఎమ్మెల్యే సీకేబాబు, వైకాపా అభ్యర్థి విజయానందరెడ్డిల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

నియోజకవర్గాలు : నగరి, గంగాధర నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం, పుంగనూరు

పోలింగ్‌ కేంద్రాలు : 1,771
వెబ్‌ కాస్టింగ్‌      : 1,309
బందోబస్తు      : 2,936
బైండోవర్‌       : 4000
సమస్యాత్మకం, తీవ్ర సమస్యాత్మక పీఎస్‌లు: 415

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు