logo

సంక్షేమ వసతి గృహాలు... కానరాని సౌకర్యాలు

జిల్లాలో బీసీ సంక్షేమ వసతిగృహాలు మొత్తం 23 ఉన్నాయి. వీటిలో పాఠశాల విద్యార్థుల వసతి గృహాలు(ప్రీ మెట్రిక్‌ హాస్టళ్లు) పది ఉండగా కళాశాల విద్యార్థుల వసతిగృహాలు(పోస్టుమెట్రిక్‌ హాస్టళ్లు) 13 ఉన్నాయి.

Published : 28 Nov 2022 05:47 IST

వసతిగృహం గది కిటికీ మెష్‌ పాడై ఇలా..

న్యూస్‌టుడే, వి.ఎల్‌.పురం (రాజమహేంద్రవరం): జిల్లాలో బీసీ సంక్షేమ వసతిగృహాలు మొత్తం 23 ఉన్నాయి. వీటిలో పాఠశాల విద్యార్థుల వసతి గృహాలు(ప్రీ మెట్రిక్‌ హాస్టళ్లు) పది ఉండగా కళాశాల విద్యార్థుల వసతిగృహాలు(పోస్టుమెట్రిక్‌ హాస్టళ్లు) 13 ఉన్నాయి. కోరుకొండ మండలం కోటికేశవరం వసతిగృహం మినహా మిగతా అన్ని హాస్టళ్లలో కలిపి మొత్తం 1,311 మంది విద్యార్థులు ఉన్నారు.

ఇదీ పరిస్థితి..

* మరమ్మతులేవీ?: ఒకవైపు శీతకాలం చలిగాలులు... మరోపక్క దోమల బెడద. కొన్ని హాస్టళ్లలో కిటికీలకు మెష్‌లు సక్రమంగాలేవు. తలుపులు, కిటికీలు పాడైనప్పటికీ మరమ్మతులకు నోచుకోవడంలేదు.

* మరుగుదొడ్ల నిర్వహణ ఇలా: నిర్వహణ నిధులు లేకపోవడంతో కనీసం మరుగుదొడ్లు కూడా శుభ్రం చేయించలేని పరిస్థితి నెలకొంది. గతంలో మరుగుదొడ్ల నిర్వహణకు నెలకు రూ.వెయ్యి చొప్పున ప్రభుత్వం మంజూరు చేసేది. కొన్నేళ్లుగా అవికూడా లేవని సిబ్బంది చెబుతున్నారు. కొన్నిచోట్ల విద్యార్థులే గదులు, మరుగుదొడ్లు శుభ్రం చేసుకుంటుండగా, మరికొన్నిచోట్ల వార్డెన్‌లే సొంత డబ్బుతో స్వీపర్లను పెట్టి శుభ్రం చేయిస్తున్నారు. పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా మెనూ ఛార్జీలను ప్రభుత్వం సవరించకపోవడంతో మెనూ అమలులోనూ ఇబ్బందులు తప్పడంలేదు.

* సిబ్బంది కొరత: 23 బీసీ వసతి గృహాలకుగాను 19 మంది వార్డెన్‌లే ఉన్నారు. నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అనపర్తి, కడియం, గోపాలపురం, రాజంపాలెం వసతిగృహాలు ఇన్‌ఛార్జిలతో సాగుతున్నాయి. ఒక్కొక్క వసతిగృహంలో వంటమనిషి(కుక్‌), సహాయకుడు(కమాటీ), వాచ్‌మేన్‌ ఉండాలి. ప్రస్తుతం ఒక్కొక్క ప్రీ మెట్రిక్‌ హాస్టల్స్‌కు ఒక వంట మనిషి, వాచ్‌మేన్‌ చొప్పున మాత్రమే ఉన్నారు. ఇక పోస్టు మెట్రిక్‌ హాస్టల్‌లో అసలు రెగ్యులర్‌ సిబ్బందిలేరు. అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బందితోనే కొనసాగుతున్నాయి.

12 అద్దె భవనాల్లోనే: జిల్లాలోని 23 వసతిగృహాలకుగాను 12 అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. అనపర్తి, రాజంపాలెం, కొవ్వూరు పాఠశాల బీసీ బాలుర వసతిగృహాలు, నిడదవోలులోని బాలిక వసతిగృహం, అనపర్తిలోని కళాశాల బాలుర వసతి గృహం, రాజమహేంద్రవరం లలితానగర్‌లోని అర్బన్‌ కళాశాల బాలికల వసతిగృహం అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. కొవ్వూరు, దేవరపల్లి నిడదవోలులోని కళాశాల బాలుర, బాలికల హాస్టళ్లు ఆరూ అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి.  


అధికారి ఏమంటున్నారంటే..?

వసతిగృహాల్లో సమస్యలను జిల్లా బీసీ సంక్షేమాధికారి పి.సత్యరమేష్‌ వద్ద ప్రస్తావించగా... ‘నాడు- నేడు’లో అయిదు హాస్టళ్లు ఎంపికయ్యాయని, త్వరలో పనులు ప్రారంభం కానున్నాయన్నారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న హాస్టళ్లకు సొంత భవనాల కోసం, ఖాళీ పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు పంపించామన్నారు. వసతి గృహాల్లో మరుగుదొడ్ల నిర్వహణ ఖర్చులకు నిధులు విడుదలయ్యాయని, బిల్లులు పెట్టమని వార్డెన్లకు చెప్పామని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని