logo

‘మీ డిమాండ్లు కాదు... అన్న చేసినవి చెప్పండి’

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చేసిన పనులు చెప్పకుండా.. మీ డిమాండ్లు చెబుతున్నారని హోంమంత్రి తానేటి వనిత ఆశా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.

Published : 07 Mar 2024 05:21 IST

ఆశాలు, అంగన్‌వాడీలు విస్తుపోయేలా హోం మంత్రి వ్యాఖ్యలు
సభకు వచ్చిన వారికి హాట్‌ బాక్సులతో ఎర

సభకు వచ్చిన వారి చేతిలో ఉన్న హాట్‌బాక్స్‌లు, హాట్‌బాక్స్‌ సెట్‌

గోపాలపురం, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చేసిన పనులు చెప్పకుండా.. మీ డిమాండ్లు చెబుతున్నారని హోంమంత్రి తానేటి వనిత ఆశా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలోని పార్టీ కార్యాలయంలో హోంమంత్రి, రాజమహేంద్రవరం పార్లమెంట్‌ వైకాపా అభ్యర్థి గూడూరి శ్రీనివాసరావులు అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు, ఆశా కార్యకర్తలు, వాలంటీర్లతో బుధవారం రాత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొందరు వాలంటీర్లు అత్యుత్సాహం చూపారు. ఓ మహిళ.. ముఖ్యమంత్రి సభలో చేసే విధంగా మైకును పైకెత్తి అనుకరించారు. ఎంపీ అభ్యర్థి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో మీరే న్యాయనిర్ణేతలని, జగన్‌ను మరోసారి సీఎం చేయాలన్నారు. హోంమంత్రి మాట్లాడుతూ.. వైకాపా ప్రభుత్వం నచ్చిందంటే చేతులు పైకెత్తాలన్నారు. సభలో ఉన్నవారంతా చేతులు పైకెత్తారు. ఇప్పుడేమో ఇలా అంటారు.. అప్పుడేమో జగన్‌పై పాటలు, మాటలు ఏంటని అంగన్‌వాడీ సిబ్బందిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మీ కోసం భోజనాలు ఏర్పాటు చేశామని, ఆ తర్వాత పార్టీ నాయకులను కలిసి వెళ్లాలన్నారు. భోజనాల అనంతరం సభకు వచ్చిన వారికి హాట్‌బాక్సులను ఇచ్చిన నాయకులు.. వైకాపాకు ఓటేసి గెలిపించాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని