logo

ఇళ్లన్నారు.. కన్నీళ్లు మిగిల్చారు..

కాలనీలోకి వెళ్లాలంటే దారీతెన్నూ కనపడదు.. గుక్కెడు నీటి కోసం గొంతెండి పోవాల్సిందే.. వీధి దీపాలు పూర్తిస్థాయిలో లేక రాత్రయితే అంధకారం.. సరైన కాలువల వ్యవస్థ లేక వీధులను వీడని దుర్గంధం..

Updated : 21 Apr 2024 06:14 IST

మౌలిక వసతులకు దూరంగా జగనన్న కాలనీలు

కాలనీలోకి వెళ్లాలంటే దారీతెన్నూ కనపడదు.. గుక్కెడు నీటి కోసం గొంతెండి పోవాల్సిందే.. వీధి దీపాలు పూర్తిస్థాయిలో లేక రాత్రయితే అంధకారం.. సరైన కాలువల వ్యవస్థ లేక వీధులను వీడని దుర్గంధం.. ఇదీ జగనన్న కాలనీల్లో పరిస్థితి. ఇళ్లు కాదు.. ఊర్లే నిర్మిస్తున్నాం అన్నారు. ప్రభుత్వం ఇచ్చే సొమ్ము కనీసం శ్లాబ్‌ వేయడానికి కూడా చాలకపోయినా అప్పోసప్పో చేసి కొందరు గూడు నిర్మించుకున్నారు. కాలనీల్లో మౌలిక సదుపాయాలు కనుచూపుమేర కానరాక పలువురు ఇప్పటికీ అడుగుపెట్టడానికే భయపడుతున్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించిన కాలనీలోనూ అదే అవస్థ. ఆశించిన లక్ష్యం నెరవేరకున్నా ప్రచార ఆర్భాటానికే వైకాపా ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది.

న్యూస్‌టుడే, తూర్పుగోదావరి జిల్లా బృందం


జగనన్న కాలనీల్లో ఇళ్లు కట్టుకునేందుకు లబ్ధిదారులు పలువురు సాహసం చేయలేక పోతున్నారు. ఇల్లు కట్టుకున్నవారు సమస్యలతో సతమతమవుతున్నారు. మౌలిక వసతులు లేక కొందరు తిరిగెళ్లిపోతున్నారు.


  • గొల్లప్రోలు పట్టణంలో జగనన్న కాలనీలో రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేయ లేదు.
  • పిఠాపురం మండలంలోని జగనన్న కాలనీల్లో తాగునీరు లేక దూర ప్రాంతాల నుంచి తెచ్చుకుంటు న్నారు.
  • జగ్గంపేట కాలనీలో చదును, రహదారుల ఏర్పాటుకు రూ.4 కోట్లకు పైగా నిధులు వెచ్చించినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగానే ఉంది. జరిగిన పనులలో సగానికి పైగా నిధులు పక్కదారి పట్టాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
  • తాళ్లపూడి మండలం అన్నదేవరపేటలో తాగునీటి వసతికి మోటారు బోర్లు ఏర్పాటు చేశారు.నీటిని నిల్వ చేసే ట్యాంకులు లేవు. విద్యుత్తు సరఫరా ఉంటేనే నీరందుతుంది. నాసిరకం కొళాయిలతో క్లార్క్‌లు విరిగిపోయాయి.
  • ద్రాక్షారామ మండలంలో 26 లేఔట్లలో 2,186 మంది లబ్ధిదారులకు స్థలాలు కేటాయించారు. ఇప్పటి వరకు ఇంటి నిర్మాణాలు పూర్తయినవి కేవలం 623 మాత్రమే. మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి. మౌలిక సదుపాయాల ఊసేలేదు.
  • పునాదుల నుంచి ఇంటి నిర్మాణం పూర్తయ్యే వరకు వివిధ దశల్లో(సిమెంటు, ఐరన్‌, ఇసుక సామగ్రి, ఉపాధి పనులతో కలిపి)   రూ.1.80 లక్షలు అందిస్తున్నారు. అనువుగా లేని స్థలాలు, మౌలిక వసతుల లేమితో పునాది వేయడానికే రూ.1.50 లక్షల వరకు ఖర్చయ్యి లబ్ధిదారులు అప్పుల పాలవుతున్నారు.
  • సెంటున్నర స్థలంలో ఇళ్ల నిర్మాణానికి తక్కువలో తక్కువ రూ.10 లక్షలైనా అవసరం. కేవలం స్థలం కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇంటి నిర్మాణానికి రూ.1.50 లక్షలు కేంద్ర ప్రభుత్వ నిధులిచ్చి చేతులు దులుపుకొంది. ఈ కాలనీల్లో ఇల్లు నిర్మించుకున్న పలువురికి ఇప్పటికీ బిల్లు చేతికందని దుస్థితి.

రాజానగరం నియోజవకర్గం చినకొండేపూడి లేఔట్‌కు దారిది

కొవ్వూరు పట్టణ పరిధిలో స్థలం మెరక, రహదారుల నిర్మాణం కన్నా ముందు బోర్లు ఏర్పాటు చేశారు. నిర్మాణ సామగ్రి తెచ్చే లారీలు, స్థలాన్ని ఎత్తు పెంచే పనులతో పైపులైన్లు దెబ్బతింటున్నాయి.


పెద్దాపురం మండలం జి.రాగంపేట లబ్ధిదారులకు నిర్మించిన కాలనీలో సరైన కాలువ వ్యవస్థ లేక ఇళ్ల ముందు సిమెంట్‌ తూరలతో గుంతలను ఏర్పాటు చేసుకున్నారు.


నిడదవోలు పట్టణంలో నిర్మించిన కాలనీలో ఇంతవరకు పూర్తిస్థాయిలో రహదారులు లేవు. కాలువల్లేక ఎవరి ఇంటి ముందు వారే వాడుక నీటిని బయటకు తోడుకోవాల్సిన దుస్థితి.


తాగునీటికి  ఇక్కట్లు పడుతున్న ప్రజలు

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించిన జగనన్న కాలనీలో ఏడు నెలలు గడవక ముందే సమస్యలతో ప్రజలు అల్లాడుతున్నారు. సామర్లకోట-జి రాగంపేట రోడ్డులోని ఈటీసీ లేఔట్‌లో 2,412 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి గృహ నిర్మాణాలను చేపట్టారు. ఇప్పటికి సుమారు 1,300 కుటుంబాలు గృహాలు ఏర్పాటు చేసుకుని నివాసముంటున్నాయి. రక్షిత మంచినీరు అందక ఇబ్బంది పడుతున్నారు. హడావుడిగా కాలనీ ప్రారంభోత్సవం సందర్భంగా గ్రావెల్‌, క్రషర్‌ బూడిదతో వీధుల్లో తాత్కాలిక రోడ్డు వేశారు.  వర్షాలకు రోడ్లు కొట్టుకుపోవడంతో పరిస్థితి అధ్వానంగా మారింది. కాలువలు లేకుండా సోక్‌ పిట్‌లు ఏర్పాటు చేశారు. దీంతో మురుగు రోడ్డెక్కుతోంది. విద్యుత్తు స్తంభాలు నివాసాలకు ఆనుకుని ఏర్పాటు చేయడంతో ప్రమాదకరంగా మారాయి. ఇటీవల ఓ పెయింటింగ్‌ కార్మికుడు విద్యుదాఘాతంతో మృతి చెందాడు.


మామిడికుదురు మండలం పాశర్లపూడిలంక-1 జగనన్న కాలనీలో తాగునీటి సరఫరాకు పైపులు వేసినా కనెక్షన్లు ఇవ్వక ప్రయోజనం నెరవేరడం లేదు.


నీటిని కొనుక్కుని ఇల్లు నిర్మించుకుంటున్నాం

దేవరపల్లి పంచాయతీ పరిధిలోని సుమారు 1,100 మంది లబ్ధిదారులకు 25 ఎకరాల్లో ఇళ్లస్థలాలు పోలవరం కాలువ గట్టు సమీపంలో కేటాయించారు. నీటి సదుపాయం ఏర్పాటు చేయకపోవడంతో అనేక అవస్థలు పడ్డాం. ట్యాంక్‌ నీటిని రూ.500 చొప్పున కొనుక్కొని ఇంటిని నిర్మించుకుంటున్నాం. భారమైనవాళ్లు 200 లీటర్ల నీటిని రూ.50 కొనుక్కుని ఒబ్బిడిగా వాడుకున్నారు. విద్యుత్తు దీపాలు, రహదారులు, కాలువలు, తాగునీరు ఏర్పాటు చేస్తేనే మా సమస్యలు పరిష్కారం అవుతాయి. 

రాపాక నాగరాజు, దేవరపల్లి


రెండేళ్లవుతున్నా  స్థలం స్వాధీనం చేయలేదు

మాది నిరుపేద కుటుంబం. గ్రామంలో రహదారి చెంతన చిన్నపాటి షెడ్డులో ఉంటున్నాం. పట్టా ఇచ్చి రెండేళ్లవుతోంది. ఇంతవరకు స్థలం స్వాధీనం చేయలేదు. పట్టాలు ఇచ్చినంతమాత్రాన మాకు ఫలితంలేదు. లేఔట్‌ స్థలాన్ని కూడా మెరకచేయలేదు. రహదారులు, వసతులు కల్పించలేదు.  

లూటుకుర్రు నాగలక్ష్మి, ఆర్‌.ఏనుగుపల్లి, పి.గన్నవరం మండలం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని