logo

గోల్డ్‌ స్కీం పేరుతో టోకరా

గొలుసు కట్టు వ్యాపారంతో రూ. కోట్లలో ప్రజలను మోసం చేసి బోర్డు తిప్పేసిన సంకల్ప సిద్ధి వ్యవహారం ఇంకా కొలిక్కి రాకముందే నగరంలో గోల్డ్‌ స్కీం పేరుతో మరో మోసం బయటకు వచ్చింది.

Published : 22 Mar 2023 05:26 IST

అధిక వడ్డీ ఆశ చూపి కోట్లు వసూలు

ఈనాడు - అమరావతి, న్యూస్‌టుడే : సూర్యారావుపేట (విజయవాడ)  : గొలుసు కట్టు వ్యాపారంతో రూ. కోట్లలో ప్రజలను మోసం చేసి బోర్డు తిప్పేసిన సంకల్ప సిద్ధి వ్యవహారం ఇంకా కొలిక్కి రాకముందే నగరంలో గోల్డ్‌ స్కీం పేరుతో మరో మోసం బయటకు వచ్చింది. నెలకు రూ. 2 వేల చొప్పున 11 నెలలు కడితే 12వ నెల వాయిదా వారు కట్టి, తదుపరి నెలలో మొత్తం సొమ్ము లేదా దాని విలువకు సరిపడా బంగారం ఇస్తామంటూ ఆభరణ జ్యువెలర్స్‌ అనే సంస్థ వందలాది ఖాతాదారులను చేర్చుకుంది. ఆ సంస్థ వాయిదాలన్నీ కట్టినా తమకు డబ్బులు చెల్లించడం లేదంటూ కొంత మంది ఆరోపిస్తున్నారు. దీనిపై పలువురు సోమవారం సాయంత్రం పోలీస్‌ కమిషనర్‌ కాంతిరాణాను కలిసి ఫిర్యాదు చేశారు. గుంటూరు కేంద్రంగా ఈ సంస్థ నడుస్తోంది.  రెండు తెలుగు రాష్ట్రాల్లో పలువురు ఏజెంట్లను నియమించుకుని బంగారం స్కీం పేరిట వసూళ్లు చేసినట్లు సమాచారం.  

గుంటూరు కేంద్రంగా కార్యకలాపాలు..  గుంటూరు ప్రధాన కేంద్రంగా ఉన్న ఆభరణ జ్యువెలర్స్‌, సురక్ష ట్రేడింగ్‌ కంపెపీ పేరిట ఏపీ, తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో శాఖలను ఏర్పాటు చేసింది. ఖాతాదారులను స్కీంల పేరిట చేర్చుకుంది. విజయవాడ నగరంలోని సీతారాంపురంలో ఒక శాఖ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా పలువురు ఈ సీoలో చేరారు. వాయిదాలన్నీ చెల్లించారు. కొంత మందికి ఈ ఏడాది జనవరితో గడువు ముగిసినా వారికి ఇంకా డబ్బులు చెల్లించలేదని సమాచారం. సంస్థ భాగస్వాముల మధ్య అభిప్రాయ బేధాలున్నాయని అందుకే దీనిపై రాద్ధాంతం జరుగుతోందని కొందరు అంటున్నారు. విజయవాడలో ఒక శాఖ ఉండటంతో బాధితులు కొందరు విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ను కలుసుకుని జరిగిన మోసంపై ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఫిర్యాదుపై విచారణ చేయాలంటూ సూర్యారావుపేట పోలీసులకు పంపించారు.

గతంలోనే కేసుల నమోదు.. గుంటూరు కేంద్రంగా నడుస్తున్న ఆ సంస్థపై గతంలో స్థానికంగా నమోదైన కేసులు వెలుగులోకి వచ్చాయి,. లాలాపేటకు చెందిన బాలాజీసింగ్‌ అనే వ్యాపారి ఏడాది క్రితం తాను తొలుత ఆ సంస్థకు రూ.10 వేలు చెల్లించగా దానికి నెలకు రూ.2 వేల చొప్పున ఎనిమిది తొమ్మిది నెలలు క్రమం తప్పకుండా చెల్లించారని దీంతో ఆ సంస్థను నమ్మి రూ.10.30 లక్షలు పెట్టుబడి పెట్టానన్నారు. ఆ తర్వాత వాటిని తిరిగి చెల్లించలేదు. పలుమార్లు దాని నిర్వాహకులతో మాట్లాడినా పలితం లేకపోవటంతో సుమారు రెండు మాసాల క్రితం ఆ సంస్థ మోసంపై అరండల్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన ‘ఈనాడు’కు వెల్లడించారు. తాను కేసు పెట్టాననే అక్కసుతో ఆ సంస్థ ఉద్యోగులను కులం పేరుతో దూషించినట్లు మహిళా ఉద్యోగి ఒకరితో ఎస్సీ, ఎస్టీ ఫిర్యాదు ఇప్పించారని దాన్ని స్వీకరించిన అరండల్‌పేట పోలీసులు తనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నారని తెలిపారు. తానిచ్చిన ఫిర్యాదుపై సంస్థ మీద ఛీటింగ్‌కేసు నమోదు చేశారని వివరించారు. కేసులో పురోగతి లేదని ఆ తర్వాత గుంటూరు ఎస్పీకి స్పందనలోనూ ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. తాడికొండకు చెందిన కల్యాణి అనే ఏజెంటు తనను ఈ సంస్థలో చేర్పించారని తనకు రకరకాల స్కీంలు ఆశ జూపినట్లు వివరించారు. బ్రాడీపేట, లక్ష్మీపురంలో ఈ సంస్థకు చెందిన కార్యాలయాలు ఉన్నాయని తెలిపారు.  కొందరు ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు కూడా ఈసంస్థ బారినపడి మోసపోయారని చెప్పారు. తనకు ఆ సంస్థ చెల్లింపులు చేసినప్పుడు రశీదులు ఇచ్చిందని, తాను చేసిన చెల్లింపులకు సంబంధించి తన వద్ద వీడియో ఆధారాలు ఉన్నాయని చెప్పారు. ఆ సంస్థ మోసంపై చర్యలు తీసుకోవాలని బాధితులకు న్యాయం చేయాలని కోరారు.

వివరాలపై ఆరా.. సీపీ కార్యాలయం నుంచి వచ్చిన ఫిర్యాదు ప్రకారం సూర్యారావుపేట పోలీసులు ఆరా తీశారు. విజయవాడలోని నిర్వాహకులను పిలిపించి వారి నుంచి వివరాలు నమోదు చేసుకున్నట్లు తెలిసింది. కొంత మందికి డబ్బులు చెల్లించాల్సి ఉందని వాటిని చెల్లిస్తున్నామంటూ నిర్వాహకులు పోలీసులకు తెలియజేసినట్లు సమాచారం. అధిక వడ్డీ ఆశచూపి, మహిళలు, క్రైస్తవ బోధకులను లక్ష్యంగా చేసుకుని రూ. కోట్లలో డబ్బులు వసూలు చేసినట్లు బాధితులు సీపీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు