logo

‘యడవల్లి మైనింగ్‌ భూముల్లో మంత్రి ఆటలు సాగనివ్వం’

రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో తెదేపా ఘన విజయం సాధిస్తుందని మాజీమంత్రి, తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు.

Published : 01 Apr 2023 05:38 IST

చిలకలూరిపేట గ్రామీణ, న్యూస్‌టుడే: రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో తెదేపా ఘన విజయం సాధిస్తుందని మాజీమంత్రి, తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. చిలకలూరిపేటలో తన ఇంట్లో శుక్రవారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో మూడుసార్లు హైకోర్టు నుంచి నోటీసులు అందుకున్న ఏకైక మంత్రి విడదల రజిని అని విమర్శించారు. ఇప్పటికే చిలకలూరిపేట మండలం మురికిపూడి గ్రానైట్‌ భూముల విషయంలో రెండుసార్లు, పసుమర్రు ఇళ్ల స్థలాల సేకరణలో ఒక్కసారి మంత్రి రజిని హైకోర్టు నుంచి నోటీసులు అందుకున్నారని చెప్పారు. కదిలితే బీసీ మంత్రినని అంటున్న రజిని మీద హైకోర్టుకు వెళ్లింది బీసీ, దళిత రైతులేనన్నారు. మురికిపూడి గ్రానైట్‌ భూముల విషయంలో హైకోర్టు రెండురోజుల క్రితం యధాతథ స్థితి కొనసాగించమని తీర్పు ఇస్తే దానిని అమలు చేయాలని అక్కడున్న వైకాపాకు చెందిన బీసీ, ఎస్టీ రైతులు పనులు పర్యవేక్షిస్తున్న వారిని అడిగితే దౌర్జన్యం చేయడం దుర్మార్గమన్నారు. యడవల్లి మైనింగ్‌ భూముల్లోనూ మంత్రి రజిని ఆటలు సాగనివ్వమని వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమేనని బీసీ, ఎస్సీ రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. 1200 రోజులుగా పోరాడుతున్న అమరావతి రాజధాని రైతుల పోరాటం దేశ చరిత్రలో మొదటిదని ప్రత్తిపాటి పేర్కొన్నారు. రాజధానికి భూములు ఇచ్చి త్యాగం చేసిన రైతులమీద ఎందుకు ఈ కక్ష అంటూ సీఎం జగన్‌ను ప్రశ్నించారు. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడుసార్లు ఇసుక పాలసీ మార్చినా ఇప్పటికీ సామాన్యుడికి ఇసుక దొరకడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిజంగా ఎన్ని ఇళ్లు కట్టిందో కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందేనన్నారు. పేదవాడిని పూర్తిగా మోసం చేస్తున్న సీఎం నిజస్వరూపం బయటపడిందన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా రాష్ట్రంలో తెలుగుదేశం జెండా ఎగరడం ఖాయమన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని