logo

విద్యార్థులూ.. తొందరపడొద్దు!

బాపట్ల జిల్లాలో నాలుగు ఇంజినీరింగ్‌ కళాశాలలున్నాయి. ఏటా 3,500 నుంచి నాలుగు వేల మంది కొత్తగా ప్రవేశాలు పొందుతున్నారు.

Published : 21 Jul 2023 01:28 IST

ఇంజినీరింగ్‌ ప్రవేశాలకు 24 నుంచి కౌన్సెలింగ్‌
బ్రాంచి ఎంపికలో జాగ్రత్తలు అవసరమని నిపుణుల సూచన
చీరాల అర్బన్‌, వేటపాలెం, న్యూస్‌టుడే

‘ఏపీ ఈసెట్‌ ఫలితాలు వెలువడ్డాయి... ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌కు ప్రభుత్వం తేదీని ఖరారు చేసింది... ఏ ర్యాంకు వచ్చింది... ఎక్కడ సీటు వస్తోంది... జిల్లాలో ఉన్న కళాశాలల్లో ఏది మంచిది... ఇక్కడ చదవాలా... ఇతర ప్రాంతాలకు వెళ్లాలా... ఏ బ్రాంచి ఎంపిక చేసుకుంటే భవిష్యత్తు బాగా ఉంటోందనే దానిపై విద్యార్థులతోపాటు తల్లిదండ్రులు ఇప్పటికే దృష్టిసారించారు... బ్రాంచి ఎంపికల్లో ఏ మాత్రం తొందర పడొద్దని నిపుణులు సూచిస్తున్నారు.

బాపట్ల జిల్లాలో నాలుగు ఇంజినీరింగ్‌ కళాశాలలున్నాయి. ఏటా 3,500 నుంచి నాలుగు వేల మంది కొత్తగా ప్రవేశాలు పొందుతున్నారు. వీటిల్లో సంప్రదాయ కోర్సులతో పాటు కృత్రిమ మేథ, డేటా సైన్సు, సైబర్‌ సెక్యూరిటీ లాంటి కొత్త కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ప్రారంభంలో వీటిపై చాలా మందికి అవగాహన లేకపోవడంతో వెనుకడుగు వేసిన పరిస్థితి. ప్రస్తుతం వీటికి విపరీతమైన డిమాండ్‌ ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ఆర్థిక శాస్త్రవేత్తల అంచనా ప్రకారం వచ్చే ఐదేళ్లలో ఆటోమెషిన్‌ తరువాత సాంకేతికపరంగా అపారమైన అవకాశాలు రానున్నాయని ప్రచారం సాగుతోంది. అందుకే ఐఓటీ, మెషిన్‌ లెర్నింగ్‌ కోర్సులను ఇప్పటికే పలు కళాశాలల్లో ప్రవేశపెట్టారు.

సాఫ్ట్‌వేర్‌పై దృష్టి: ఇంజినీరింగ్‌ పూర్తిచేసిన తరువాత చాలా మంది సాఫ్ట్‌వేర్‌గా స్థిరపడాలనేది కోరిక. దీనికోసం ఎందరో సీఎస్‌ఈ బ్రాంచిని ఎంపిక చేసుకోవడానికి ముందుకొస్తున్నారు. ఫలితంగా దీనికి విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. అందుకే ఇప్పటికే చాలా కళాశాలల్లో ఈ బ్రాంచి పరిధిలో ఉన్న యాజమాన్య కోటా సీట్లు ముందుగానే భర్తీ కావడం గమనార్హం. విద్యార్థి బ్రాంచి ఎంపిక చేసుకునే సమయంలో ఎవరో చెప్పారని కాకుండా.. ప్రతి ఒక్కరూ ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకుని దాని ప్రకారం ముందుకెళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన వారు బ్రాంచితో సంబంధంలేకుండా సాఫ్ట్‌వేర్‌గా స్థిరపడిన వారు అనేక మంది ఉన్నారు. ప్రధానంగా సీటు ఎంపికతో పాటు కళాశాల ఎంపిక కీలకమేనని పేర్కొంటున్నారు. కళాశాలలో ఉన్న మౌలిక వసతులు, న్యాక్‌, అటానమస్‌, ఎన్‌బీఏ లాంటి వాటి గుర్తింపు, అవసరమైతే కళాశాలకు స్వయంగా వెళ్లి పరిశీలించుకోవడం చేయాలి. దీంతో పాటు ఆ కళాశాలకు చెందిన ప్రస్తుత, పూర్వ విద్యార్థులతో కలిసి బోధనతో పాటు ఇతర వాటి గురించి తెలుసుకోవడం మంచిదనే అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.


ప్రాంగణ ఎంపికలు గమనించాలి

ళాశాలలో చేరే సమయంలో ప్రాంగణ ఎంపికలు గురించి వాకబు చేసుకోవాలి. ఏ రకం కంపెనీలు ఇక్కడ నుంచి విద్యార్థులను ఎంపిక చేసుకుంటున్నాయి. వేతనాల పరిస్థితి ఏమిటీ అనేదానిపై ఆరా తీయాల్సి ఉంది. దీంతో పాటు ఇప్పటి వరకు ఎక్కువ వేతనానికి ఎంతమంది ఎంపికయ్యారు? అసలు ఏడాదికి ఎంతమంది ఇక్కడ నుంచి కంపెనీలకు వెళుతున్నారు. గత ఏడాది అధిక వేతనానికి ఎంపికైన వారి వివరాలు తెలుసుకోవడంతో పాటు ఉద్యోగాల కోసం సంబంధించి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారా? ఇతర శిక్షణలు సైతం ఏమైనా లభిస్తున్నాయా లేదా అనేదానిపై విచారించుకోవడం మంచిదనే వారు పేర్కొంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని