logo

అత్తెసరు బోధన.. అరణ్య రోదన..

జిల్లాలో 17 చోట్ల హైస్కూల్‌ ప్లస్‌ టూ బాలికల జూనియర్‌ కళాశాలలను ప్రభుత్వం రెండేళ్ల కిందట ప్రారంభించింది.

Published : 17 May 2024 05:07 IST

బాలారిష్టాలను దాటని హైస్కూల్‌ ప్లస్‌ టూ కళాశాలలు
పాఠ్య పుస్తకాలు, ల్యాబ్‌లు లేక ఉత్తీర్ణతలో వెనుకంజ

 

  • కాకుమాను మండలం చినలింగాయపాలెం జడ్పీ ఉన్నత పాఠశాలలో హైస్కూల్‌ ప్లస్‌ టూ పేరుతో బాలికల జూనియర్‌ కళాశాలను రెండేళ్ల కిందట ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో మొదటి, రెండో ఏడాది విద్యార్థులు 11 మంది ఉన్నారు. వీరికి తగిన వసతులు, ఉచితంగా పాఠ్య పుస్తకాలు, సైన్స్‌ ల్యాబ్‌లు లేవు. దీంతో ఒక్కరూ ఉత్తీర్ణత సాధించలేకపోయారు.
  • పెదనందిపాడు మండలం కొప్పర్రు జడ్పీ ఉన్నత పాఠశాలలో హైస్కూల్‌ ప్లస్‌ టూ బాలికల జూనియర్‌ కళాశాలకు ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. ఒక్కరు కూడా ప్రథమ ఇంటర్‌లో చేరకపోవడంతో విద్యార్థులే లేరు.
  • మేడికొండూరు మండలం పేరేచర్ల జడ్పీ ఉన్నత పాఠశాల ప్లస్‌ టూ లో ఎంపీసీ గ్రూపులో ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు చెందిన 21 మంది బాలికల్లో 11 మంది ఉత్తీర్ణత సాధించారు. 10 మంది ఫెయిల్‌ అయ్యారు. ఇక్కడ ల్యాబ్‌లు లేవు.

న్యూస్‌టుడే, ప్రత్తిపాడు

జిల్లాలో 17 చోట్ల హైస్కూల్‌ ప్లస్‌ టూ బాలికల జూనియర్‌ కళాశాలలను ప్రభుత్వం రెండేళ్ల కిందట ప్రారంభించింది. వీటిని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేయడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయుడే పర్యవేక్షించాల్సిన పరిస్థితి. ఎంపీసీ, బైపీసీ కోర్సులను ప్రారంభించడంతో ప్రధానోపాధ్యాయుల ఒత్తిడితో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన బాలికలు ప్రవేశాలు పొందారు. విద్యార్థినులకు పాఠ్య పుస్తకాలను ప్రభుత్వం ఉచితంగా అందించలేదు. వీటి ధరలు అధికంగా ఉండి మార్కెట్లో కొరత ఉండడంతో విద్యార్థినులు కొనుగోలు చేయలేకపోయారు. రెండో ఏడాది బాలికలకు భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం, జంతుశాస్త్రం, వృక్షశాస్త్రం సబ్జెక్టులకు సైన్సు ల్యాబ్‌లు ఏర్పాటు చేయలేదు. ల్యాబ్స్‌లో ద్వితీయ ఇంటర్‌ బాలికలతో సాధన చేయించకుండానే పబ్లిక్‌ పరీక్షల ప్రాక్టికల్స్‌కు పంపారు. దీంతో వారంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బాలికలు చదువుకునేందుకు పాఠ్య పుస్తకాలతో కూడిన గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయలేదు. కళాశాలకు కేటాయించిన అధ్యాపకులతో ఇంటర్‌తో పాటు 9, 10వ తరగతి పాఠాలను చెప్పిస్తున్నారు. జాబ్‌ ఛార్ట్‌ లేక అధ్యాపకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

పేరేచర్లలో పూర్తికాని కళాశాల భవనం

క్యాలెండర్‌ గందరగోళం

హైస్కూల్‌ ప్లస్‌ టూ ఇంటర్‌లో ప్రవేశాలు పొందిన బాలికలకు విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి పరీక్షల వరకు గందరగోళం నెలకొంది. సాధారణంగా ఇంటర్‌ బోర్డు పరిధిలో ఉన్న ప్రభుత్వ, ఎయిడెడ్‌ కళాశాలలకు జూన్‌ 1వ తేదీ నుంచి అకడమిక్‌ క్యాలెండర్‌ ప్రారంభం అవుతుంది. ఈలోపే ప్రథమ ఇంటర్‌లో ప్రవేశాలు చేపట్టి, ప్రథమ, ద్వితీయ ఇంటర్‌లో చేరిన విద్యార్థులకు తరగతులు జరుగుతాయి. త్రైమాసిక పరీక్షలు, దసరా సెలవులు, అర్ధ సంవత్సర పరీక్షలు, సంక్రాంతి సెలవులు, ప్రీఫైనల్స్‌, ప్రాక్టికల్స్‌, పబ్లిక్‌ పరీక్షల అనంతరం మార్చి 31తో విద్యా సంవత్సరం ముగుస్తుంది. ఏప్రిల్‌ 1 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ఉంటాయి. కానీ హైస్కూల్‌ ప్లస్‌ టూ లో ఉన్న బాలికల జూనియర్‌ కళాశాలల్లో అకడమిక్‌ క్యాలెండర్‌ అమలు కాని పరిస్థితి నెలకొంది. తరగతుల ప్రారంభం నుంచి దసరా, సంక్రాంతి సెలవుల్లో వ్యత్యాసం ఉంటోంది. జూన్‌ 1 తర్వాత ప్రవేశాలు చేపట్టి ఆలస్యంగా తరగతులు ప్రారంభిస్తున్నారు. దసరా, సంక్రాంతి సెలవులు పాఠశాలకు ఎన్ని రోజులైతే అన్ని రోజులు కళాశాలకు అమలు చేస్తున్నారు. అకడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం దసరా, సంక్రాంతి సెలవులు ఇవ్వడం లేదు. పాఠశాలకు కళాశాల కంటే అధికంగా వారం రోజుల పాటు సెలవులు ఉంటాయి. ఆప్షన్‌, లోకల్‌ సెలవులు కూడా పాఠశాలలకు అధికం. దీంతో తరగతులు సాగక పాఠ్యాంశాలు జనవరి 31 నాటికి కూడా పూర్తికావు. ఫిబ్రవరి నుంచి ప్రారంభమయ్యే ప్రీఫైనల్‌, ప్రాక్టికల్స్‌, పబ్లిక్‌ పరీక్షలకు సన్నద్ధం అయ్యేందుకు విద్యార్థినులకు సమయం లేక ఉత్తీర్ణతపై ప్రభావం పడింది.  


తగిన సౌకర్యాలు కల్పించాలి

ప్లస్‌ టూ కళాశాలల్లో కావాల్సిన సౌకర్యాలు కల్పించి, ఇంటర్‌ బోర్డు ప్రకారం అకడమిక్‌ క్యాలెండర్‌ అమలు చేస్తే మెరుగైన బోధన సాధ్యమవుతుంది. మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. బాలికలకు పాఠ్య పుస్తకాలు ఉచితంగా ఇవ్వాల్సి ఉంది. ఎంపీసీ,   బైపీసీ గ్రూపులకు సైన్స్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలి. 20 ఏళ్ల కిందట పీజీలు పూర్తి చేసిన అధ్యాపకులకు ఇంటర్‌లోని ప్రస్తుత పాఠ్యాంశాలపై ట్రైనింగ్‌ క్లాసులు ఏర్పాటు చేయాలి. 

సుదర్శనం రత్తయ్య, జిల్లా అధ్యక్షుడు, స్కూల్‌ ప్లస్‌ పీజీటీ సంఘం, గుంటూరు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని