logo

ఓటరు జాబితాలో మీ పేరుందా?

‘సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైంది... త్వరలో జరగబోయే ఎన్నికల్లో 18 ఏళ్లు నిండిన వారి దగ్గర నుంచి ఓటున్న ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకోవాలి... ఎవరికి వారు తాము వేయకపోతే ఏమవుతుందనే భావన విడనాడాలి.

Published : 29 Mar 2024 04:04 IST

లేకపోతే ఏప్రిల్‌ 15లోపు దరఖాస్తుకు చివరి అవకాశం
చీరాల అర్బన్‌, వేటపాలెం, న్యూస్‌టుడే

‘సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైంది... త్వరలో జరగబోయే ఎన్నికల్లో 18 ఏళ్లు నిండిన వారి దగ్గర నుంచి ఓటున్న ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకోవాలి... ఎవరికి వారు తాము వేయకపోతే ఏమవుతుందనే భావన విడనాడాలి... ఒక్కొక్కసారి అభ్యర్థుల గెలుపు ఓటమిలను ఒక్క ఓటే తారుమారు చేసే అవకాశం ఉంది... ఎన్నికల సంఘం విడుదల చేసిన ఓటరు జాబితాలో మీ పేరుందో లేదో చూసుకోవాలి... ఒకవేళ లేకపోతే వెంటనే ఓటును ఫారం-6 ద్వారా నమోదు చేసుకోవాలి... ఇలా చేసుకుంటే ఈ ఎన్నికల్లో మీరు ఓటు వేయడానికి అవకాశం కలుగుతోంది.

జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో 12,75,540 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 6,22,526, మహిళలు 6,52,941, ఇతరులు 73 మంది ఉన్నారు. ఈ ఏడాది జనవరిలో ఎన్నికల సంఘం విడుదల చేసిన ఓటరు జాబితాలో పలువురి పేర్లు గల్లంతయ్యాయి. దీంతో ప్రతి ఓటరు జాబితాలో తమ పేరు ఉందో లేదో సరిచూసుకోవాలి. ఒకవేళ లేకపోతే వెంటనే దరఖాస్తు చేసుకోవాలి. దీంతో పాటు 18 నుంచి 19 సంవత్సరాల వయసున్న యువతీ, యువకులు చాలామంది ఓటు కోసం అర్జీ చేసుకునే వారు ఉన్నారని ఒక అంచనా. అంతే కాకుండా యువత ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నా వారి పేర్లు జాబితాలో ఎక్కడున్నాయో తెలియని స్థితి నెలకొంది. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పిస్తామని ఇప్పటికే ఎన్నికల సంఘం ప్రకటించింది. దీనికోసం ఓటులేని వారు తమ గ్రామ, వార్డు సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి లేదా సమీపంలో ఉన్న పోలింగ్‌ కేంద్రం బీఎల్వోను సంప్రదించి నమోదు చేయమని అడగవచ్చు. వీరందరికి త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసే అవకాశాన్ని సంఘం కల్పిస్తోంది. ఆన్‌లైన్‌లోనూ నమోదు చేసుకునే వెసులుబాటు ఉంది. కొత్తగా నమోదు చేసుకునే వారు ఫారం-6, చిరునామా మార్పునకు ఫారం-8లు వినియోగించాలి. వీటిని పూర్తి చేసి బీఎల్వోలకు అందజేయవచ్చు. ఆన్‌లైన్‌లో https:// ceoandhra.nic.in,  ఓటరు యాప్‌ ద్వారా https:// voters eci.gov.in లో అర్జీ చేసుకోవచ్చు. ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైనది. ఇటువంటి దాన్ని అర్హత ఉండి పొందలేకపోయిన వారికి ఎన్నికల కమిషన్‌ చివరిగా ఈ అవకాశాన్ని ఏప్రిల్‌ 15వ తేదీ వరకు కల్పించింది. తుది జాబితాలో కుటుంబంలో ఉన్న నలుగురి ఓట్లు ఒక్కొక్క పోలింగ్‌ బూత్‌ల్లోకి మార్పులు జరిగాయి. అంతే కాకుండా కొందరి ఓట్లు నివాస ప్రాంతాలకు దూరంగా ఉండే పోలింగ్‌ కేంద్రాలకు బదిలీ కావడం వల్ల ఎన్నికల్లో వీరందరూ ఓటింగ్‌కి దూరంగా ఉండే అవకాశం కనపడుతోంది. దీనికితోడు చాలా మంది ఈ రోజు వరకు ఓటరు జాబితాలు చూసుకోలేదు. ఒకే కుటుంబంలో ఉన్న వారి ఓట్లు వేర్వేరు బూత్‌ల్లోకి మార్పు జరిగి ఉంటే ఆవిషయాన్ని బీఎల్వోలు వారికి తెలియజేసి, వెంటనే వారిచేత ఫారం-8ని పెట్టించి, మళ్లీ బదలాయించేలా చర్యలు చేపట్టాలి. కానీ చాలా మంది బీఎల్వోలు మాకెందుకులే అనే ధోరణిలో ఉండడం గమనార్హం. ఇటువంటి వారు చిరునామా మార్పు కోసం దరఖాస్తులు సమర్పించవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని