logo

అమరావతిపై జగన్‌ వ్యాఖ్యలు అహంకారానికి నిదర్శనం

‘అమరావతి అంటే ఏంటి..అది ఎక్కడ ఉంది’ అని ఓ జాతీయ మీడియా ఇంటర్వ్యూలు సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యలపై రాజధాని మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published : 02 May 2024 06:41 IST

ఇంతకాలం ఎక్కడ కూర్చొని పరిపాలన చేశారు
నిలదీసిన రాజధాని మహిళలు, రైతులు

తుళ్లూరు, న్యూస్‌టుడే: ‘అమరావతి అంటే ఏంటి..అది ఎక్కడ ఉంది’ అని ఓ జాతీయ మీడియా ఇంటర్వ్యూలు సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యలపై రాజధాని మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతిలో అన్నదాతలు చేస్తున్న నిరసనలు బుధవారం 1597వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా అనంతవరంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న మీడియాతో మాట్లాడడం చేతకాక జగన్‌ దొంగచాటుగా జాతీయ మీడియాలో అమరావతిపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రానికి మేటి రాజధాని ఉండాలని చంద్రబాబు అమరావతి నిర్మాణాన్ని ప్రారంభిస్తే.. వైకాపా ప్రభుత్వం వచ్చాక మూడు ముక్కలాటతో నాశనం చేశారన్నారు. ప్రస్తుతం ఏపీకి రాజధాని లేదు.. అమరావతిని ఎందుకు అభివృద్ధి చేయడం లేదని జాతీయ మీడియా ప్రతినిధి అడిగితే జగన్‌ అమరావతిని చులకన చేస్తూ వికృతంగా మాట్లాడడం ఆయన అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. అమరావతిని గుంటూరు, విజయవాడ నగరాలకు దూరంగా పనికిరాని భూమిలో ఎలా కడతారు అని జగన్‌ దుర్మార్గంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సచివాలయం, శాసనసభ ఎక్కడ ఉన్నాయో.. ఆయన ఐదేళ్లు ఎక్కడ కూర్చొని పరిపాలన చేశారో అవగాహన లేదా అని నిలదీశారు. హైటెక్‌ సిటీ కూడా ఒకప్పుడు కొండలు, గుట్టలుగానే ఉండేదని, కానీ దూరదృష్టితో చంద్రబాబు దాన్ని ఐటీ హబ్‌గా అభివృద్ధి చేశారన్నారు. మూడు పంటల పండే బంగారు భూమిని రాజధాని కోసం త్యాగం చేస్తే..జగన్‌ అపహాస్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంకటపాలెం, మందడం, వెలగపూడి, ఉద్దండరాయునిపాలెం, దొండపాడు, తుళ్లూరు, నెక్కల్లు, అనంతవరం, తాడికొండ తదితర గ్రామాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని