logo

ఐదేళ్లూ.. దారిద్య్రమే!

రహదారులు.. ప్రగతికి చిహ్నాలు. వైకాపా అయిదేళ్ల పాలనలో పూర్తిగా వీటిని నిర్లక్ష్యం చేశారు. అడుగుకో గుంత చొప్పున రోడ్డంతా చిల్లులు పడినా వైకాపా ప్రజాప్రతినిధులు, మంత్రులు పట్టనట్లు వదిలేశారు.

Published : 06 May 2024 05:02 IST

నిర్వహణ లేక దారుణంగా మారిన రోడ్లు
గుంతల్లో చిక్కి వాహనదారులు ఆస్పత్రిపాలు
పల్లె వాసులపై ఇంత పగ ఎందుకు జగన్‌?
ఈనాడు, అమరావతి, న్యూస్‌టుడే, మేడికొండూరు, దుగ్గిరాల, పెదకాకాని

హదారులు.. ప్రగతికి చిహ్నాలు. వైకాపా అయిదేళ్ల పాలనలో పూర్తిగా వీటిని నిర్లక్ష్యం చేశారు. అడుగుకో గుంత చొప్పున రోడ్డంతా చిల్లులు పడినా వైకాపా ప్రజాప్రతినిధులు, మంత్రులు పట్టనట్లు వదిలేశారు. బాబోయ్‌ ఏమిటీ రోడ్లు అంటూ పక్క రాష్ట్రాల వారు ఎగతాళి చేసినా ముఖ్యమంత్రి జగన్‌కి చీమకుట్టినట్లుగా కూడా అనిపించలేదు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ రోడ్లు బాగు చేయకపోతే తానే తన కార్యకర్తలతో కలిసి గుంతలు పూడుస్తామంటే ముఖ్యమంత్రి స్పందించారు. గతేడాది వర్షాకాలం పూర్తవగానే రోడ్లు వేసేస్తామంటూ ప్రకటించారు. తీరా ఏడాది గడిచినా రోడ్ల గతి మారలేదు. గోతుల రహదారులు వాహనదారుల ప్రాణాలు తీశాయి. మరికొందరు తీవ్ర గాయాలై జీవచ్ఛవాల్లా మారారు.

మ్యాచింగ్‌ గ్రాంట్లు ఇవ్వలేని దుస్థితి..

పల్లె నుంచి పల్లెకు.. పల్లె నుంచి పట్టణానికి.. మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి అనుసంధానమైన రోడ్లు నిర్వహణ లేక అధ్వానంగా మారాయి. కేంద్రం నుంచి నూరు శాతం గ్రాంటుతో వచ్చే నిధులు మినహా రాష్ట్ర ప్రభుత్వం పైసా విదల్చలేదు. కేంద్రం ద్వారా వచ్చే నిధులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మ్యాచింగ్‌ గ్రాంటు ఇవ్వకపోవడంతో పనులు నిలిచిపోయాయి. తుపానులు, భారీ వర్షాలకు వాగులు ఉప్పొంగి అనుసంధాన రోడ్లు కోతకు గురైనా పట్టించుకునేవారు కరవయ్యారు. జగన్‌ నోరు తెరిస్తే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని పదేపదే చెబుతారు. వీరంతా ఎక్కువగా నివసించే పల్లెల్లో రహదారులు మాత్రం అత్యంత అధ్వానంగా ఉన్నాయి. జగన్‌ ఆర్భాటాలు తప్ప ఆచరణలో లేదని చెప్పడానికి ఉమ్మడి గుంటూరులో పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలోని గ్రామీణ రోడ్ల దుస్థితే నిదర్శనం.

రహదారి: తెనాలి - మంగళగిరి

మొత్తం దూరం 17 కి.మీ.
(దుగ్గిరాల పరిధిలో 13 కి.మీ)

పరిస్థితి: అంతా గోతులమయం. చాలాచోట్ల రోడ్డు ఛిద్రమైంది. సాధారణ రోడ్డు కన్నా గుంతలే ఎక్కువ.ప్రమాదాలు: ఈ రోడ్డు వల్ల ఏడాది కాలంలో దుగ్గిరాల మండలం చుక్కపల్లివారిపాలెం గ్రామానికి చెందిన ఒకరు, దుగ్గిరాల రామానగర్‌కు చెందిన ఒకరు, తెనాలి పట్టణానికి చెందిన ముగ్గురు వేర్వేరు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారైతే ఏడాది కాలంలో పదుల సంఖ్యలో ఉన్నారు.

రహదారి: హరిశ్చంద్రపురం - వైకుంఠపురం

రాజధాని గ్రామం రాయపూడి నుంచి పల్నాడు జిల్లా అమరావతి వరకు ఉన్న రహదారి గోతులు పడి అధ్వానంగా మారింది. చాలాచోట్ల రోడ్డు కుంగి బీటలు వారింది. ఈ మార్గంలో నిత్యం విజయవాడ వైపు నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రం అమరావతి అమరలింగేశ్వరస్వామి ఆలయానికి పెద్ద సంఖ్యలో రాకపోకలు సాగిస్తున్నారు. ఛిద్రమైన రహదారిపై వాహనాల్లో ప్రయాణాలు చేస్తున్న ప్రజలు నరకయాతన పడుతున్నారు. వైకాపా ప్రభుత్వం పతనమయ్యే వరకు ఈ బాధలు తప్పవంటూ స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

రహదారి: మందపాడు - సరిపూడి

మేడికొండూరు మండలం మందపాడు- సరిపూడి మధ్య 3.5 కి.మీ రోడ్డు ఏడేళ్లుగా అభివృద్ధికి నోచుకోలేదు. రోడ్డు పూర్తిగా దెబ్బతింది. దారి పొడవునా కంకర రాళ్లు పైకి లేచి తారు ఆనవాళ్లు లేకుండా పోయింది. రోడ్డు అక్కడక్కడా కోతకు గురైంది. వర్షం కురిసినప్పుడు గుంతల్లో నీరు నిలుస్తోంది. ఆ సమయంలో రోడ్డు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయి.


04-05-24

బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలం ముట్టుపల్లికి చెందిన ఎస్‌.ఉదయ్‌కుమార్‌రెడ్డి సైనికుడిగా పనిచేస్తున్నారు. ఇటీవల సెలవులకు ఇంటికి వచ్చిన ఆయన విధుల్లో చేరేందుకు శనివారం ద్విచక్ర వాహనంపై గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరారు. తెనాలి-మంగళగిరి రోడ్డులోని మోరంపూడి దగ్గరకు వచ్చేసరికి ఆయన బైక్‌ గుంతలో పడి ముఖానికి, కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. తెనాలి నుంచి మంగళగిరి వరకూ 24 కి.మీ దారిలో అన్నీ గుంతలే.

05-05-24

అదే ప్రాంతం.. అదే గుంత.. కారణంగా ఆదివారం ఉదయం చుండూరు మండలానికి చెందిన భార్యాభర్తలు కె.విష్ణు, విజయనిర్మల ద్విచక్ర వాహనంపై వస్తూ అదుపు తప్పి కిందపడిపోయారు. మోకాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. వీరిని 108లో తెనాలి జిల్లా ఆస్పత్రికి తరలించారు.


పల్లెదారులు.. పడరాని పాట్లు

ప్రతి మండలంలో 30 నుంచి 35 వరకు పంచాయతీరాజ్‌ రోడ్లు ఉంటాయి. ఇవన్నీ 12 అడుగుల బీటీ, మెటల్‌, మట్టి రోడ్లతో కూడిన సింగిల్‌ రోడ్లు. గ్రామంలో మాత్రం సీసీ రోడ్లు ఉంటాయి. వీటి నిర్వహణతో పాటు ఏటా కొన్ని రోడ్లు అభివృద్ధి చేసి ప్రయాణాలు సాఫీగా చూడాలి. కానీ ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసింది.


ఆటో డ్రైవర్లు నరకం చూస్తున్నారు

బుస్సా నాగరాజు, ఆటో డ్రైవర్‌, తుమ్మపూడి

ఆటో డ్రైవర్లు నరకం చూస్తున్నారు. చక్రం గోతుల్లో పడితే ప్రయాణికులు అల్లాడిపోతున్నారు. వేగంగా వెళ్లడానికి లేదు. గుంతల వల్ల వెనుక కమ్మీలు విరిగిపోతున్నాయి. దుగ్గిరాల ఊళ్లోకి అంటేనే ఆటోలు రావడమే మానేశారు. చక్రాలు దెబ్బతింటున్నాయి. రాళ్లు గుచ్చుకుని టైర్లకు పంచర్లు పడుతున్నాయి. మరమ్మతులకే సంపాదనంతా పోతోంది. గుంతల్లో పడడం వల్ల హబ్‌సెట్ విరిగితే రూ.3 వేలు, కమ్మీ విరిగితే రూ.2500, టైరుకు రూ.2500 అవుతోంది. ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి.


వెన్నెముక సమస్యలు వస్తున్నాయి

సూర్యదేవర వెంకటేశ్వరావు, మందపాడు గ్రామం

మందపాడు- సరిపూడి దారిలో పొలం పనికి వెళ్లి వస్తుంటాం. భారీ గుంతలు పడ్డాయి. పట్టించకునేవారు లేకపోవడంతో గోతులుగా మారాయి. వర్షం కురిసినప్పుడు నీరు నిలుస్తోంది. గుంతల కారణంగా ద్విచక్ర వాహనంపై వెళ్లినప్పుడు వెన్నెముక సమస్యలు వస్తున్నాయి.


వాహనం అదుపు తప్పి చేతికి గాయమైంది

చలంశెట్టి శ్రీనివాసరావు, జడవల్లి

మాది పొన్నూరు మండలం జడవల్లి గ్రామం. రోజూ వ్యక్తిగత పనుల నిమిత్తం ద్విచక్ర వాహనంపై పొన్నూరుకు రాకపోకలు నిర్వహిస్తా. పొన్నూరు-చందోలు రహదారి గోతులమయంగా మారడంతో రాకపోకలు నిర్వహించడం ఇబ్బందికరంగా మారింది. వాహన పరికరాలతో పాటు టైర్లు దెబ్బతింటున్నాయి. కొంతకాలం కిందట వాహనం అదుపు తప్పి బొల్తా పడడంతో చేతికి గాయమైంది. రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు చేశామని చెప్పారు కానీ పనులు నిర్వహించడంలో ప్రభుత్వం విఫలమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని