logo

‘రెక్కలు’ విప్పిన విమానయానం

సులువుగా, తక్కువ సమయంలో, సురక్షితంగా గమ్యస్థానం చేరుకునేందుకు ప్రయాణికులు విమానయానాన్ని ఆశ్రయిస్తున్నారు. కొవిడ్‌ మహమ్మారి కారణంగా అంతర్జాతీయ ఆంక్షలతో విమానయాన రంగం....

Published : 28 Jun 2022 02:56 IST

రెండున్నరేళ్ల తర్వాత పెరిగిన రద్దీ

ఈనాడు, హైదరాబాద్‌: సులువుగా, తక్కువ సమయంలో, సురక్షితంగా గమ్యస్థానం చేరుకునేందుకు ప్రయాణికులు విమానయానాన్ని ఆశ్రయిస్తున్నారు. కొవిడ్‌ మహమ్మారి కారణంగా అంతర్జాతీయ ఆంక్షలతో విమానయాన రంగం తీవ్ర ఒడుదొడుకులకు లోనైంది. కొన్ని నెలలుగా ప్రయాణికుల నుంచి వస్తున్న స్పందనను అందిపుచ్చుకుని మళ్లీ పూర్వ స్థితికి చేరుకుంది. అటు దేశీయ సర్వీసులకు డిమాండ్‌ పెరగడం.. ఇటు అంతర్జాతీయంగా ఆంక్షలు ఎత్తివేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రయాణికుల రాకపోకలు బాగా పెరిగాయి.

ఒకే రోజు 53వేల మంది రాకపోకలు.. మే 15న దేశీయ ప్రయాణికుల సంఖ్య 53 వేలు దాటింది. ఆరోజు 401 విమానాలు రాకపోకలు సాగించాయి. ఇది కొవిడ్‌ ముందు రోజువారీ సగటుతో పొల్చితే 103 శాతం అధికమని విమానాశ్రయ ప్రతినిధులు చెప్పారు. కొవిడ్‌కు ముందు రోజూవారీ సగటు ప్రయాణికుల సంఖ్య 51 వేల వరకు ఉండేది. ఎక్కువగా దిల్లీ, గోవాకు డిమాండ్‌ ఉంటోంది. ఈ నెల 10న అంతర్జాతీయ ప్రయాణికులు పది వేల మంది రాకపోకలు సాగించారు. కరోనా ప్రబలిన రెండున్నరేళ్లలో ఒకరోజు ప్రయాణించిన వారి సంఖ్య ఇదే అత్యధికం కావడం విశేషం.


దేశంలోనే అత్యధిక రికవరీ రేటు

ప్రదీప్‌ ఫణికర్‌, ఎయిర్‌పోర్టు సీఈవో

దేశంలోని ఇతర విమానాశ్రయాల కంటే శంషాబాద్‌ విమానాశ్రయం ప్రయాణికుల పరంగా అత్యధిక రికవరీ రేటు సాధించింది.త్వరలోనే కొవిడ్‌కు ముందున్న స్థితికి చేరుకుంటామన్న నమ్మకం ఉంది. ప్రయాణికుల సంఖ్య, అవసరాలకు అనుగుణంగా టెర్మినల్‌ విస్తరణ పూర్తయింది. త్వరలో తూర్పుభాగాన్ని అందుబాటులోకి తెస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని