logo

జాతీయ రహదారిపై ప్రమాదం

నల్గొండ జిల్లా కేతేపల్లి మండలంలోని ఇనుపాముల గ్రామ బస్‌ స్టేజీ వద్ద 65వ నెంబరు జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌లోని తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ ఆచార్య భట్టు రమేష్‌, ఆయన సోదరుడు రమణ తీవ్రంగా గాయపడ్డారు.

Published : 10 Dec 2022 03:22 IST

తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌కు తీవ్ర గాయాలు

కేతేపల్లి, న్యూస్‌టుడే: నల్గొండ జిల్లా కేతేపల్లి మండలంలోని ఇనుపాముల గ్రామ బస్‌ స్టేజీ వద్ద 65వ నెంబరు జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌లోని తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ ఆచార్య భట్టు రమేష్‌, ఆయన సోదరుడు రమణ తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్షులు, బాధితులు తెలిపిన ప్రకారం వివరాల ప్రకారం.. రిజిస్ట్రార్‌ రమేష్‌ అత్త కమల అనారోగ్యంతో శుక్రవారం హైదరాబాద్‌లో మృతి చెందింది. ఆమె మృతదేహాన్ని అంతిమ సంస్కారాల కోసం స్వస్థలమైన ఖమ్మం పట్టణానికి అంబులెన్స్‌ వాహనంలో తీసుకెళ్తున్నారు. అంబులెన్స్‌ వాహనంతోపాటు బంధువుల వాహనాలు బయలు దేరాయి. రిజిస్ట్రార్‌ భట్టు రమేష్‌, ఆయన సోదరుడు రమణ తమ కుటుంబ సభ్యులతో కారులో ప్రయాణిస్తున్నారు. వాహన శ్రేణి కేతేపల్లి మండలంలోని ఇనుపాముల బస్‌ స్టేజీ వద్దకు రాగానే రిజిస్ట్రార్‌ రమేష్‌ ప్రయాణిస్తున్న వాహనం నిలిపి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రమేష్‌, రమణలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని 108 అంబులెన్స్‌ వాహనంలో నకిరేకల్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేసిన అనంతరం నార్కట్‌పల్లిలోని కామినేని ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రిజిస్ట్రార్‌ రమేష్‌ను తెలుగు విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్స్‌లర్‌ తంగెడ కిషన్‌రావు తమ విశ్వవిద్యాలయ అధికారులు, సిబ్బందితో కలిసి పరామర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని