logo

Hyderabad: ప్లాస్టిక్‌కు చెక్‌.. బాటిల్‌ తెచ్చిస్తే రూ.10

ప్లాస్టిక్‌ బాటిళ్లు పోగుపడకుండా సరికొత్త ఆలోచన చేసింది నగరానికి చెందిన రీసైకల్‌ సంస్థ. ఉత్తరాఖండ్‌ కేదార్‌నాథ్‌లో చేసిన ఈ ప్రయోగానికి సంస్థ ‘డిజిటల్‌ ఇనిషియేటివ్స్‌ ఇన్‌ కొలాబరేటింగ్‌ విత్‌ స్టార్టప్స్‌’ విభాగంలో ‘డిజిటల్‌ ఇండియా అవార్డు’ లభించింది.

Updated : 07 Jan 2023 09:45 IST

నగర సంస్థకు డిజిటల్‌ ఇండియా పురస్కారం

ఈనాడు, హైదరాబాద్‌: ప్లాస్టిక్‌ బాటిళ్లు పోగుపడకుండా సరికొత్త ఆలోచన చేసింది నగరానికి చెందిన రీసైకల్‌ సంస్థ. ఉత్తరాఖండ్‌ కేదార్‌నాథ్‌లో చేసిన ఈ ప్రయోగానికి సంస్థ ‘డిజిటల్‌ ఇనిషియేటివ్స్‌ ఇన్‌ కొలాబరేటింగ్‌ విత్‌ స్టార్టప్స్‌’ విభాగంలో ‘డిజిటల్‌ ఇండియా అవార్డు’ లభించింది. దిల్లీలో శనివారం అవార్డుల ప్రదానోత్సవం జరగనుండగా.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా ఈ సంస్థ అవార్డును అందుకోబోతున్నారు.

1,63,000 బాటిళ్లు.. కేదార్‌నాథ్‌ వెళ్లే ప్రయాణికులతో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం అది. 50కిలోమీటర్ల దారిపొడవునా దుకాణాల్లో శీతలపానీయాలు, నీళ్లసీసాలు పోగుపడిపోయి ఉన్నాయి. దీనికి చెక్‌ పెట్టాలంటూ అక్కడి జిల్లా పాలనా విభాగం.. నగరానికి చెందిన రీసైకల్‌ సంస్థను సంప్రదించింది. ఈ క్రమంలోనే ‘డిజిటల్‌ డిపాజిట్‌ రీఫండ్‌ సిస్టమ్‌’(డీడీఆర్‌ఎస్‌) ఆలోచనకు శ్రీకారం చుట్టి సుమారు 1,63,000 ప్లాస్టిక్‌ బాటిళ్లు సేకరించి రికార్డు సృష్టించారు.

ఏమిటీ డీడీఆర్‌ఎస్‌..: డీడీఆర్‌ఎస్‌లో భాగంగా పర్యాటకులు, పౌరులు ప్లాస్టిక్‌ వస్తువు ఏది కొనుగోలు చేసినా ఎమ్మార్పీపై రూ.10 అదనంగా చెల్లించాలి. ఇలా చెల్లించినందుకు వారికి ఓ క్యూర్‌కోడ్‌ స్టిక్కర్‌ను అతికించి ఇస్తారు. ఆ బాటిళ్లను మళ్లీ తిరిగి తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి అదనంగా తీసుకున్న డబ్బును యూపీఐ పేమెంట్‌ ద్వారా రీఫండ్‌ చేస్తారు. ఈ కార్యక్రమం ప్రారంభమైన నాటి నుంచి పౌర స్పృహ పెరిగింది. బాటిళ్లు పారేయట్లేదు. అక్కడి చెత్త ఏరుకునేవారు ఈ క్యూఆర్‌ కోడ్‌ బాటిళ్లను తీసుకొచ్చి ఆదాయం ఆర్జిస్తుండటం విశేషం.

జాతీయ స్థాయి గుర్తింపు వచ్చింది
అభయ్‌ దేశ్‌పాండే, సీఈవో, రీసైకల్‌

డీడీఆర్‌ఎస్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం సంతోషంగా ఉంది. చాలా వరకు ప్లాస్టిక్‌ను హిమాలయాల సమీపంలోని జలాశయాల్లోకి వెళ్లకుండా అడ్డుకోగలిగాం. ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం, అక్కడి స్థానిక యూనియన్లు, అసోసియేషన్లు, పౌరుల సహకారం ఎంతో ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని