logo

కుమార్తె మృతి తట్టుకోలేక గృహిణి బలవన్మరణం

కుమార్తె మృతిని తట్టుకోలేని ఓ గృహిణి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన కూకట్‌పల్లి ఠాణా పరిధిలో జరిగింది.

Published : 06 Feb 2023 03:57 IST

సుశీల

మూసాపేట, న్యూస్‌టుడే: కుమార్తె మృతిని తట్టుకోలేని ఓ గృహిణి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన కూకట్‌పల్లి ఠాణా పరిధిలో జరిగింది. కుమార్తె చనిపోయిన మూడు వారాలకే తల్లీ మృతిచెందడంతో ఆ కుటుంబంలో అంతులేని విషాదం అలుముకుంది. సీఐ టి.నర్సింగ్‌రావు తెలిపిన ప్రకారం.. కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం మల్యాల గ్రామానికి చెందిన దండుగుల సూర్యప్రకాష్‌ కుమార్‌, సుగుణ సుశీల (38) దంపతులు కొన్నాళ్ల క్రితం వలసొచ్చి కూకట్‌పల్లి ఎల్లమ్మబండలోని మహంకాళీనగర్‌లో ఉంటున్నారు. వీరికి కుమారుడు, కుమార్తె సంతానం. భర్త క్యాటరింగ్‌ చేస్తుండగా భార్య కిరాణా నిర్వహిస్తోంది. గతనెల 12న వీరి కుమార్తె (16) ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి సుగుణ సుశీల కుమార్తెను తలుచుకుంటూ కుమిలిపోతుండేదని కుటుంబికులు చెబుతున్నారు. శనివారం రాత్రి భర్త పనులకు వెళ్లిపోగా.. సుశీల 11 గంటలకు దుకాణం మూసేశారు. ఇంట్లోకి వెళ్లి తలుపులు పెట్టుకుని బయటకు రాలేదు. ఆమె కుమారుడు యిర్మియా, అన్న అశోక్‌ తలుపు తట్టినా తీయకపోవడంతో బద్దలు కొట్టి చూడగా.. ఉరేసుకొని చనిపోయింది. ఘటనా స్థలంలో మృతురాలు రాసిన లేఖ లభించింది. అందులో ‘నా కుమార్తె లేకుండా నేను ఉండలేకపోతున్నాను.. అందుకే చనిపోవాలని నిర్ణయించుకున్నాను. యిర్మియా.. మామయ్య చెప్పినట్లు విను.. అన్నయ్యా నీ రుణం తీర్చుకోలేనిది.. నన్ను క్షమించు.. చెప్పటానికి చాలా విషయాలున్నా సమయం లేనందున రాయలేకపోతున్నాను.’ అని ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని