logo

సంక్షేమానికి విస్తరే...నగరానికి కొసరే!

పథకాలకు పెద్దపీట వేస్తూ.. సొంతింటి కల నెరవేర్చేందుకు ముందుకు సాగుతూ.. సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి బాటలు పరుస్తూ.. మెట్రో ప్రాజెక్ట్‌లకు ఊతమిస్తూ.. తెలంగాణ సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు అన్నివర్గాల నుంచి హర్షం వ్యక్తం అవుతోంది. 

Updated : 07 Feb 2023 06:47 IST

జీహెచ్‌ఎంసీకి నిరాశ కలిగించిన పద్దు
సంక్షేమ పథకాలకు గతేడాది కంటే ఎక్కువ కేటాయింపు
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి,
ఈనాడు, హైదరాబాద్‌

పథకాలకు పెద్దపీట వేస్తూ.. సొంతింటి కల నెరవేర్చేందుకు ముందుకు సాగుతూ.. సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి బాటలు పరుస్తూ.. మెట్రో ప్రాజెక్ట్‌లకు ఊతమిస్తూ.. తెలంగాణ సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు అన్నివర్గాల నుంచి హర్షం వ్యక్తం అవుతోంది.  జీహెచ్‌ఎంసీకి ప్రాధాన్యం అంతంత మాత్రం దక్కడమే కొంత నిరాశపరుస్తోంది. ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టిన 2023-24 బడ్జెట్‌లో  రైతుబంధు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, పింఛన్లు, తదితర పథకాలకు గతేడాది కంటే కేటాయింపులు పెంచారు. నగరంలో రోడ్లు, నాలాలు, పైవంతెనలు, అండర్‌పాస్‌లు, ఆర్‌యూబీల నిర్మాణ పనులపై  కరుణ చూపలేదు.


ఉచిత నీటికి.. సుంకిశాలకు నిధులు

జలమండలికి ఈసారి అడిగినంత కాకపోయినా కొంతమేర  సర్కారు కేటాయింపులు చేసింది. ముఖ్యంగా నగరంలో తాగునీరు, మురుగు నీటి వ్యవస్థ విస్తరణ ఇతర అభివృద్ధి పనులకు రూ.300 కోట్లు అందిస్తున్నట్లు ప్రకటించింది. గ్రేటర్‌లో అమలు చేస్తున్న ఉచిత నీటి పథకానికి ఈ బడ్జెట్‌లో రూ.300 కోట్లు కేటాయించింది. కృష్ణా జలాలను నగరానికి తరలించే సుంకిశాల ప్రాజెక్టుకూ నిధులు కేటాయించింది.  రుణాల చెల్లింపునకు రూ.635 కోట్లతో కలిపి మొత్తం రూ.1960 కోట్లు అందిస్తున్నట్లు పేర్కొంది.

*  జలమండలికి నెలకు రూ.80 కోట్ల విద్యుత్తు బిల్లులు వస్తున్నాయి.  మెట్రో మాదిరిగా జలమండలికి విద్యుత్తు ఛార్జీల్లో సబ్సిడీ ఇవ్వాలని గతంలో కేబినెట్‌ నిర్ణయించింది. దీనికి కూడా  పైసా విదల్చలేదు. కొత్త ఎస్టీపీలకు రూ.1400 కోట్లతో ప్రతిపాదనలు చేసినా ఇవ్వలేదు.


ప్రాజెక్ట్‌లు పూర్తయ్యేదెలా?

* గ్రేటర్‌ నగరంలో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం(ఎస్సార్డీపీ) మొదటి దశలో ఇప్పటివరకు 33 పనులు పూర్తయ్యాయి.  కానీ.. ప్రాజెక్టు పురోగతి కోసం జీహెచ్‌ఎంసీ చేసిన రూ.3,500 కోట్ల అప్పులను, ఎస్సార్డీపీ రెండో దశ ప్రతిపాదనలకు ఎదురవుతోన్న నిధుల కేటాయింపులను బడ్జెట్‌లో ప్రస్తావించలేదు. ప్రాజెక్టు కోసం బల్దియా రూ.500 కోట్ల సాయాన్ని కోరగా, స్పందన లేదు.

* గ్రేటర్‌ పరిధిలో వరద ముంపు సమస్యను నివారించేందుకు రూ.958 కోట్లతో రూపుదిద్దుకున్న మొదటి దశ ఎస్‌ఎన్‌డీపీ(వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమం) పనులు ఏడాదిన్నర కిందట మొదలయ్యాయి.బ్యాంకు రుణం ద్వారా జీహెచ్‌ఎంసీ రూ.650 కోట్ల నిధులను సమీకరించింది. మొదటి దశలో చేపట్టిన పనులకు రూ.300కోట్ల సాయం కోరగా, స్పందన లేదు.

*  జీహెచ్‌ఎంసీ రోడ్లను ప్రైవేటు ఏజెన్సీల నిర్వహణకు ఇచ్చింది. ఒప్పందం ప్రకారం ఇప్పటి వరకు  రూ.950కోట్ల మేర వెచ్చించింది.ఆర్థిక సాయంగా రూ.500కోట్లు అడగ్గా, రూపాయి కూడా దక్కలేదు.

* హైదరాబాద్‌ రహదారుల అభివృద్ధి సంస్థ (హెచ్‌ఆర్‌డీసీఎల్‌) ఆధ్వర్యంలో రోడ్ల విస్తరణ కోసం భూసేకరణకు రూ.250కోట్లు ఇవ్వాలని జీహెచ్‌ఎంసీ సర్కారును కోరింది. ఫలితం శూన్యం.

* గతేడాది పద్దులో హైదరాబాద్‌ అర్బన్‌ అగ్లొమరేషన్‌(హెచ్‌యూఏ) పేరుతో రూ.150.94కోట్లు కేటాయించింది. కానీ నిధులు విడుదల కాలేదు. ప్రస్తుతమూ అంతే  కేటాయించారు.  ఈసారైనా నిధులు విడుదలయ్యేనా అనేప్రశ్న తలెత్తుతోంది.


ఈసారీ కొత్త బస్సులు కరవే

టీఎస్‌ఆర్టీసీ గ్రేటర్‌ జోన్‌ అత్యవసరంగా 1500 బస్సులను సమకూర్చుకోవాల్సి ఉంది. ఈసారి బడ్జెట్‌లో రూ.3 వేల కోట్లు అందితే కొత్త బస్సులు  సమకూరే అవకాశం లభిస్తుందని అందరూ భావించినా కేటాయింపులు లేవు. ప్రస్తుతం విమానాశ్రయానికి 39 ఎలక్ట్రిక్‌ బస్సులు అద్దె ప్రాతిపదికన నడుస్తున్నాయి. మరో 300 ఎలక్ట్రిక్‌ బస్సులు రావాల్సి ఉంది.  10 డబుల్‌ డెక్కర్‌ బస్సులను కూడా అద్దె ప్రాతిపదికన సమకూరుస్తున్నారు. ఈ నేపథ్యంలో  300 డీజిల్‌ బస్సులు సొంతంగా సమకూర్చుకోవాలని టీఎస్‌ఆర్టీసీ గత ఆర్థిక సంవత్సరంలో ప్రయత్నించినా నిధుల కొరత అడుగు ముందుకు వేయనివ్వలేదు. తాజా బడ్జెట్‌లోనూ రాయితీలు పోగా మిగిలినవి అప్పులు తీర్చడానికే సరిపోతాయని కార్మిక సంఘాల జేఏసీ ఛైర్మన్‌ రాజిరెడ్డి చెబుతున్నారు.


సొంతింటికి ఊతం

రెండు పడక గదుల ఇళ్ల కోసం గ్రేటర్‌లోని మూడు జిల్లాల కలెక్టరేట్లకు 7లక్షలకుపైగా దరఖాస్తులు చేరాయి. అందులో మీ సేవా కేంద్రాల్లోని దరఖాస్తులు 5లక్షలకుపైగా ఉండటం గమనార్హం. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న లక్ష ఇళ్లను అందరికీ సర్దుబాటు చేయడం సాధ్యపడదు. అందువల్ల.. సొంత స్థలం ఉంటే.. అందులో ఇంటి నిర్మాణానికి సర్కారు ఇచ్చే ఆర్థిక సాయం ఉపయోగపడనుంది. పద్దులో పేర్కొన్నట్లుగా ఒక్కో నియోజకవర్గంలో 2వేల మందికి ఇంటి నిర్మాణం కోసం రూ.3లక్షలు మంజూరైతే.. మెజార్టీ ప్రజలు సొంతింటిని సొంతం చేసుకుంటారని జీహెచ్‌ఎంసీ భావిస్తోంది. సుమారు 48వేల మందికి లబ్ధి చేకూరనుందని అధికారుల అంచనా.


మూసీ.. మళ్లీ కంపే!

గుజరాత్‌ సబర్మతీ నదిలా మూసీ నదిని తీర్చిదిద్దాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి ఆదిలోనే అడ్డంకి ఏర్పడింది. ఈ బడ్జెట్‌లో మూసీ సుందరీకరణ కోసం పెద్దఎత్తున నిధులు కేటాయిస్తారని అధికారులు ఎదురు చూశారు. కానీ... కేవలం రూ.200 కోట్లు విదిల్చారు. గతేడాది బడ్జెట్‌లో ఇలానే రూ.200 కోట్లను కేటాయించిన సర్కారు ఇప్పటివరకు కేవలం రూ.60 కోట్లు మాత్రమే విడుదల చేసింది. ఈ నిధులతో కేవలం మూసీలో మురుగునీరు ముందుకుపారేలా పూడికతీతకు, దోమల నివారణ, ఉద్యోగుల జీతాలకే సరిపోయాయి. దీంతో ఇతరత్రా అభివృద్ధి పనులు చేయడానికి వీలులేకుండా పోయింది. కనీసం నదికి రెండువైపులా పెన్సింగ్‌ వేయడానికి కూడా పైసా నిధులు లేవని అధికారులు చెబుతున్నారు. మూసీలో ఆక్రమణలు తొలగించాలంటే కనీసం రూ.1000 కోట్ల వరకు పరిహారం ఇవ్వాల్సి ఉంది. ఈ బడ్జెట్‌లో రూ.1000 కోట్ల వరకు కేటాయిస్తారని అధికారులు భావించారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్టును మొదలుపెట్టే విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పట్టుదలగా ఉన్నారని మూసీ రివర్‌ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌, ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ‘ఈనాడు’కు తెలిపారు.


ఆసుపత్రుల నిర్మాణానికి చకచకా అడుగులు

గడ్డిఅన్నారం పండ్లమార్కెట్‌ స్థలంలో నిర్మించనున్న ఆసుపత్రి నమూనా

గ్రేటర్‌లో నలువైపులా సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణ పనులు ఇక చకచక కొనసాగనున్నాయి. తాజాగా బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.500 కోట్ల మ్యాచింగ్‌ గ్రాంటు  ప్రకటించడంతో పనులకు మార్గం సుగమం అయింది.  ఇప్పటికే గచ్చిబౌలిలో టిమ్స్‌ ఉండగా.. ఎల్‌బీనగర్‌, అల్వాల్‌, ఎర్రగడ్డలో ఈ సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రులు రానున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ ఆధ్వర్యంలో గాంధీ, ఉస్మానియా, నిమ్స్‌ ఆసుపత్రులు ఉన్నాయి.  వీటిపై ఏయేటికాయేడు భారం పడుతోంది. శివార్లలో ఏదైనా ప్రమాదం జరిగిన సందర్భంలో అక్కడ నుంచి ఉస్మానియా, గాంధీలకు తరలించేలోపు గోల్డెన్‌ అవర్‌ దాటిపోతోంది. ట్రాఫిక్‌ ఇబ్బందుల వల్ల సమయం వృథా అవుతోంది. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ సూపర్‌స్పెషాలిటీ సేవలు అందించాలని సర్కారు నిర్ణయించింది.  దీంతో ఈ నాలుగు సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మించాలని గతంలో నిర్ణయించిన సంగతి తెలిసిందే. వీటి కోసం రూ.2,679 కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునే క్రమంలో ప్రభుత్వం మ్యాచింగ్‌ గ్రాంటు కింద తాజాగా బడ్జెట్‌లో కేటాయింపులు చేసింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఆసుపత్రుల్లో రోగుల ఆహారానికి రూ.70 కోట్లు,  నిమ్స్‌లో అభివృద్ధి పనులతోపాటు ఎంఎన్‌జేలో కొత్త భవనాల కోసం నిధులు కేటాయించారు.


రుణాల చెల్లింపు కోసం..

తాజా బడ్జెట్‌లో ప్రభుత్వం హెచ్‌ఎండీఏకు రూ.200 కోట్లు కేటాయించింది. గతంలో జైకా, ఇతర సంస్థల నుంచి రుణాలు తీసుకొని అవుటర్‌ రింగ్‌ రోడ్డు నిర్మించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రుణ చెల్లింపులు చేపడుతున్నారు. ఈ మేరకు ఈ ఏడాది చెల్లింపులకు ఈ నిధులు అందించింది. ఇవికాక పలు అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు పంపగా బడ్జెట్‌లో కేవలం రూ.10 లక్షలు కేటాయించారు. అయితే భూములు అమ్మకం ద్వారా హెచ్‌ఎండీఏ సొంతంగా వివిధ అభివృద్ధి పనులను ఇప్పటికే శ్రీకారం చుట్టింది. అవుటర్‌లో సైకిల్‌ ట్రాక్‌, అర్బన్‌ పార్కులను ఏర్పాటు చేస్తోంది.


అగ్నిమాపక కేంద్రాలు పూర్తవుతాయా?

కొత్తగా అగ్నిమాపక కేంద్రాల ఏర్పాటు, వసతుల కల్పనకు ఈసారీ నిరాశే ఎదురైంది. రాష్ట్రంలో కొత్తగా నిర్మించబోయే 15 అగ్నిమాపక కేంద్రాల నిర్మాణానికి ప్రభుత్వం రూ.12 కోట్లు కేటాయించింది. వాటిలో 6 కేంద్రాలు గ్రేటర్‌లోనే ఉన్నాయి. ఎల్బీనగర్‌, అంబర్‌పేట, మల్కాజిగిరి, జూబ్లీహిల్స్‌, చాంద్రాయణగుట్ట, రాజేంద్రనగర్‌ ఫైర్‌స్టేషన్ల నిర్మాణానికి స్థలాల ఎంపిక పూర్తయింది. ఒక్కో భవనానికి రూ.2 కోట్లు అవుతాయని అంచనా వేసినా.. తక్కువ కేటాయింపులతో సకాలంలో పూర్తవుతాయా అనేది ప్రశ్నార్థకమే.


యాదాద్రికి ఎంఎంటీఎస్‌ లేనట్లే

ఎంఎంటీఎస్‌ రెండోదశకు నిధులు విదిల్చిన రాష్ట్రప్రభుత్వం యాదాద్రి వరకు పొడిగింపు విషయం మాత్రం తేల్చలేదు. అయితే రెండోదశ 2024 మార్చి నాటికి పూర్తి చేస్తామని ద.మ రైల్వే స్పష్టత ఇచ్చింది.  ఇదిలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటీవల తన వాటాగా రూ.100 కోట్లు రైల్వే శాఖకు అందజేసింది. వాస్తవానికి గత ఆర్థిక సంవత్సరంలో ప్రకటించకుండానే రూ.100 కోట్లు ఇచ్చింది. ఈ బడ్జెట్‌లో రూ.50 కోట్లు ప్రకటించింది.  మరి యాదాద్రి వరకూ పొడిగింపు విషయంలో అటు రైల్వే, ఇటు సర్కారు స్పందించ లేదు.


ఆర్థిక పురోగమనం దిశగా..

రాష్ట్రంలో సామాజికంగా, ఆర్థికంగా పలు అంశాల్లో రాజధాని జిల్లాలు ముందు వరసలో ఉన్నాయి. రోడ్‌ డెన్సిటీ, రోడ్డు రవాణా, ఎగుమతులు, తలసరి ఆదాయం వరకు గ్రేటర్‌లోని జిల్లాలు పోటీ పడుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ సందర్భంగా ఆర్థికమంత్రి సోమవారం విడుదల చేసిన 2021-22కి సంబంధించి తెలంగాణ రాష్ట్ర సామాజిక ఆర్థిక ముఖ చిత్రం (సోషియో ఎకనామిక్‌ అవుట్‌ లుక్‌ - 2023)లో నగర అభివృద్ధికి అద్దం పట్టే విషయాలు వెల్లడయ్యాయి.  

రోడ్డు రవాణాలో రంగారెడ్డి టాప్‌

రాష్ట్రంలోనే రోడ్డు రవాణాలో రంగారెడ్డి జిల్లా అగ్రస్థానంలో ఉంది. 7,714 కి.మీ. నెట్‌వర్క్‌ కల్గి ఉంది.

* జీహెచ్‌ఎంసీ పరిధిలో రహదారులు 9013 కి.మీ. కల్గి ఉంది. వీటిలో 6067 కి.మీ. 68.42 శాతం సిమెంటు రోడ్లు ఉన్నాయి.

రహదారి సాంద్రతలో హైదరాబాద్‌ ముందు

రాష్ట్రంలో హైదరాబాద్‌ అత్యధిక రోడ్‌ డెన్సిటీ కల్గి ఉంది. వంద చదరపు కిలోమీటర్ల పరిధిలో 1332.7 కి.మీ.రహదారులను సిటీ కల్గి ఉంది.

* మేడ్చల్‌లో 386 కి.మీ., రంగారెడ్డి జిల్లాలో 157.6 కి.మీ.తో రెండు, మూడో స్థానంలో ఉన్నాయి.

ఎగుమతుల్లో మేడ్చల్‌ అగ్రస్థానం

రాష్ట్రం నుంచి విదేశాలకు పెద్ద ఎత్తున మెర్కండైజ్‌ ఎగుమతులు జరుగుతున్నాయి. ఫార్మాస్యూటికల్‌ గూడ్స్‌, ఆర్గానిక్‌ రసాయనాల వాటానే ఇందులో 65 శాతం ఉంది. యూఎస్‌ఏ, చైనాకు వెళ్తున్నాయి. ఎగుమతులు అధికంగా ఉన్న ఐదు జిల్లాల్లో సిటీలోనే మూడు ఉన్నాయి.

* రాష్ట్రంలో హైదరాబాద్‌ భౌగోళిక విస్తీర్ణం 0.6 శాతం ఉంటే.. రాష్ట్రంలోని 20 శాతం జనాభా నివసించే గృహాలు ఇక్కడ ఉన్నాయి. అత్యధిక జనసాంద్రత ఇక్కడ ఉంది.


బంగారు తెలంగాణ సాకారమయ్యే బడ్జెట్‌ : మంత్రి సబితారెడ్డి

మహేశ్వరం: రాష్ట్ర బడ్జెట్ సీఎం కేసీఆర్‌ కోరుకునే బంగారు తెలంగాణను సాకారం చేస్తుందని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. విద్యారంగానికి రూ.19,093 కోట్లు కేటాయించడం హర్షదాయకమన్నారు. విశ్వవిద్యాలయాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు గతంలో ఎన్నడూ లేనివిధంగా రూ.500 కోట్లు కేటాయించడంపై ధన్యవాదాలు తెలిపారు. వివిధ నోటిఫికేషన్ల ద్వారా నియమితులవుతున్న ఉద్యోగుల కోసం రు.1000 కోట్లు, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలకు రూ.5609 కోట్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌లకు రూ.3210 కోట్ల కేటాయింపు గొప్ప విషయమన్నారు.  


పథకాలకు నిధుల పంట..

రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో సంక్షేమ పథకాలకు  గతేడాది కంటే ఈసారి ఎక్కువగా కేటాయించడంతో  లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రైతుబంధు, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు అర్హులైన వారికి రెండు పడక గదుల ఇళ్లు వంటి సంక్షేమ పథకాలకు నిధుల కొరత లేదంటూ హరీశ్‌రావు శాసనసభలో ప్రకటించారు. రైతుబంధు పథకం కింద తాజా బడ్జెట్‌లో రూ.15,075 వేల కోట్లు కేటాయిస్తే..  ఇందులో దాదాపు ఐదుశాతం (రూ.634)కోట్లు రంగారెడ్డి జిల్లా రైతులకు దక్కనున్నాయి. గతేడాది రైతుబంధు పథకంతో జిల్లాలో 5.96లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరింది.  

ఇళ్లు వేగంగా పూర్తయితే..  

డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి బడ్జెట్‌లో గతేడాదితో పోలిస్తే కేటాయింపులు పెరగలేదు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఇళ్ల నిర్మాణాలు వేగంగా పూర్తవుతున్నాయి. ఇందుకు భిన్నంగా రెండు జిల్లాల్లోని మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో ఇళ్ల నిర్మాణం మందగమనంగా కొనసాగుతోంది. రంగారెడ్డి జిల్లాలో 6645 ఇళ్లు మంజూరు కాగా.. ఇప్పటి వరకు 2061  మాత్రమే పూర్తయ్యాయి. మేడ్చల్‌ జిల్లాలో 2350 ఇళ్లకు గాను 978 మాత్రమే పూర్తయ్యాయి. రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయింపులు పెరగకపోయినా.. ప్రజాప్రతినిధులు చొరవతీసుకుని అభివృద్ధి నిధులు కేటాయిస్తే.. ఈ ఏడాదైనా ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే అవకాశాలున్నాయి.


అభిమానం చాటేలా..

బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా  సోమవారం అసెంబ్లీ వద్దకు వచ్చిన ఓ మహిళా కార్యకర్త.. మంత్రి కేటీఆర్‌ చిత్రమున్న చేతిసంచితో కనిపించారు. దారి తెలిసిన, చూపిన, నడిచే నాయకుడు కేటీఆర్‌ అని ఆ సంచిపై   రాసి ఉండటం ఆకట్టుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని