logo

నకిలీ కాల్‌ సెంటర్‌ పెట్టి నిలువు దోపిడీ

దిల్లీ కేంద్రంగా నకిలీ కాల్‌సెంటర్‌ ఏర్పాటుచేసి దేశవ్యాప్తంగా వేలాది మందిని నట్టేట ముంచిన మాయగాళ్ల ముఠా ఆటకట్టించారు నగర సైబర్‌క్రైమ్‌ పోలీసులు.

Published : 25 Mar 2023 02:21 IST

స్వాధీనం చేసుకున్న సామగ్రి పరిశీలిస్తున్న సైబర్‌క్రైమ్‌ డీసీపీ స్నేహామెహ్రా, ఏసీపీ ప్రసాద్‌

ఈనాడు, హైదరాబాద్‌, నారాయణగూడ, న్యూస్‌టుడే: దిల్లీ కేంద్రంగా నకిలీ కాల్‌సెంటర్‌ ఏర్పాటుచేసి దేశవ్యాప్తంగా వేలాది మందిని నట్టేట ముంచిన మాయగాళ్ల ముఠా ఆటకట్టించారు నగర సైబర్‌క్రైమ్‌ పోలీసులు. నలుగురు నిందితులను సైబర్‌క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.హరిభూషణరావు బృందం అరెస్ట్‌ చేసింది. 17 మొబైల్‌ ఫోన్లు, 7 లాప్‌ట్యాప్‌లు, ఒక సీపీయూను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం బషీర్‌బాగ్‌లోని సీసీఎస్‌లో ఏసీపీ కేవీఎం.ప్రసాద్‌తో కలిసి సైబర్‌ క్రైమ్‌ డీసీపీ స్నేహామెహ్రా మీడియాకు వివరాలు వెల్లడించారు.  హరియాణా ఫరీదాబాద్‌కు చెందిన తరుణ్‌ ఓఝా(31) టెలీకాలర్‌గా పనిచేశాడు. తేలికగా డబ్బు సంపాదించాలని స్నేహితుడు గురుచరణ్‌సింగ్‌(26)తో కలిసి దిల్లీలో మ్యాజిక్‌ ట్రిప్‌ ఇండియా పేరిట నకిలీ కాల్‌సెంటర్‌ ప్రారంభించాడు. యోగేందర్‌సింగ్‌ బడోరియా(29) మేనేజర్‌. షహదత్‌ అన్సారీ (25) బృంద నేత నెల వేతనంతో నవీన్‌కుమార్‌(24), పరంవీర్‌సింగ్‌(30), జ్యోతికుమారి(20), జాహ్నవి తివారి(21), కాంచన్‌(23), అన్యద(23), అమిత్‌సింగ్‌ ఫత్యాల్‌(20), సౌమ్య(20), రీమా(25), మమతాకుమారి(28)లను టెలీకాలర్లుగా నియిమించుకున్నారు. నకిలీ చిరునామా, వ్యక్తుల పేర్లతో సిమ్‌కార్డులు సేకరించి బ్యాంకు ఖాతాలు తెరిచారు. రిలయన్స్‌ క్యాపిటల్‌ ఫైనాన్స్‌ పేరుతో నకిలీ సంస్థ ఏర్పాటుచేశారు. వ్యక్తిగత, వ్యాపార రుణాల కోసం వెతికేవారిని లక్ష్యంగా చేసుకొని మొబైల్‌ఫోన్‌, వాట్సాప్‌ సందేశాలు పంపారు. టెలీకాలర్స్‌ ఫోన్‌చేసి మాయ మాటలతో నమ్మించారు. తరువాత ఫీజులు పేరిట దోచుకుంటారు. ఇలా తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో అప్పులిప్పిస్తామంటూ ఏడాదిలో 27మందిని మోసగించి రూ.5కోట్లు కొట్టేశారు.

ఇలా పట్టుబడ్డారు

గత ఏడాది డిసెంబరు 29న విశ్రాంత ఉద్యోగి గృహనిర్మాణ రుణం కోసం అంతర్జాలంలో వెతికారు. రిలయన్స్‌ క్యాపిటల్‌ ఎగ్జిక్యూటివ్‌ అంటూ అభివన్‌ పేరుతో ఓ వ్యక్తి ఫోన్‌ చేశాడు. ఉచితంగా రుణ ప్రక్రియ పూర్తిచేస్తామంటూ రిలయన్స్‌ లోగోతో ఉన్న దరఖాస్తును లింక్‌ ద్వారా విశ్రాంత ఉద్యోగికి పంపాడు. రూ.కోటి రుణానికి దరఖాస్తు చేశాక వివిధ రకాల ఫీజుల పేరుతో రూ.30లక్షలు వసూలు చేశారు. తర్వాత ఫోన్లకు స్పందించకపోవటంతో మోసపోయినట్టు భావించిన పోలీసులు నగర సైబర్‌క్రైమ్‌ పోలీసులు ఫిర్యాదు చేశారు. ఏసీపీ కె.వి.ఎంప్రసాద్‌ సారథ్యంలో హరిభూషణరావు, ఎస్సైలు పి.సురేష్‌, ఎ.శైలేందర్‌కుమార్‌, కానిస్టేబుళ్లు  బి.రవిశంకర్‌, ఎ.రాము, మనీష్‌కుమార్‌ తివారి, సాయికుమార్‌ బృందం దిల్లీకి వెళ్లి తరుణ్‌ ఓఝా, గురుచరణ్‌సింగ్‌, యోగేందర్‌సింగ్‌ బడోరియా, షహదత్‌ అన్సారీలను అరెస్ట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని